#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్ల పాలనలో మోదీకి ఎదురైన 5 అతిపెద్ద సవాళ్లు, తీవ్ర విమర్శలు..

మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు ఎదురైన అతిపెద్ద సవాళ్లు, ఆయనపై వచ్చిన తీవ్ర విమర్శల గురించి తెలుసుకుందాం.

#9YearsOfModiGovernment: తొమ్మిదేళ్ల పాలనలో మోదీకి ఎదురైన 5 అతిపెద్ద సవాళ్లు, తీవ్ర విమర్శలు..

PM Modi

Narendra Modi: నరేంద్ర మోదీ.. భారత 14వ ప్రధాన మంత్రి. 2014 మే 26న ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొమ్మిదేళ్లు అవుతోంది. వచ్చే ఏడాది ఇదే సమయానికి లోక్‌సభ (18th Lok Sabha) ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది కాలం మోదీతో పాటు బీజేపీ (BJP) ఎంతో కీలకం.

ఈ తొమ్మిదేళ్ల కాలంలో మోదీ పాలన ఫలితమే వచ్చే ఏడాది ఆయన గెలుపు/ఓటములను నిర్ణయిస్తుంది. మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకు ఎదురైన అతిపెద్ద సవాళ్లు, ఆయనపై వచ్చిన తీవ్ర విమర్శల గురించి తెలుసుకుందాం.

పెద్ద నోట్ల రద్దు, భారత ఆర్థిక వ్యవస్థ
అది 2016 నవంబరు 8.. సాయంత్రం పూట అందరూ ఆఫీసుల నుంచి వచ్చి ఇంట్లో టీవీలు పెట్టుకుని కూర్చుకున్నారు. అన్ని టీవీ ఛానెళ్లలోనూ మోదీ కనపడుతున్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ప్రజలందరిలో భయం.. ఆందోళన.. ఏదో జరుగుతుందని మోదీ భావిస్తే, మరేదో జరిగింది.

ఆ తర్వాతి రోజు నుంచి దాదాపు రెండు నెలల పాటు దేశ వ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజలు కొత్త నోట్ల కోసం పరుగులు.. బ్యాంకుల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలు.. అస్వస్థతకు గురైన అక్కడే మరణించారు కొందరు. బ్యాంకుల ముందు లాఠీఛార్జిలు.. ఎవరూ ఊహించని విధంగా వచ్చి పడిన విపత్తులా పరిణమించింది పెద్దనోట్ల రద్దు. కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. నోట్ల కొరత కారణంగా వ్యాపారాలు నిలిచిపోతున్నాయి. జీడీపీ గురించి ఆర్థిక వేత్తలు అందరూ హెచ్చరికలు చేస్తున్నారు.

ఇంతకు ముందు ఏ ప్రధానికీ ఎదురుకాని సవాళ్లు మోదీకి ఎదురయ్యాయి. కొన్ని రోజుల్లో నోట్ల కొరత తీరుతుందని మోదీ భావించారు. నల్లధనాన్ని అరికట్టవచ్చనుకున్నారు. నక్సలైట్లకు నిధులు అందవని భావించారు. ఇలా ఇంకా ఎన్నో మంచి పరిణామాలు జరుగుతాయని భావిస్తే పెద్దనోట్ల రద్దు ప్రయోగం బెడిసికొట్టినట్లయింది. చైనా, జపాన్ వంటి ఆర్థిక శక్తులతో పోటీ పడుతున్న భారత్ ను బంగ్లాదేశ్, శ్రీలంకతో పోటీ పడే స్థాయికి దిగజార్చారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.

భారత ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బే పడింది. భవిష్యత్తులో మరేదేశం పెద్దనోట్ల రద్దు ప్రయోగం చేయాలన్న భారత్ లో 2016లో ఎదురైన అనుభవాలను గుణపాఠాలుగా తీసుకునే పరిస్థితి ఏర్పడింది. భారత్ లో పెద్దనోట్ల రద్దు ప్రయోగం విజయవంతమైతే తామూ చేస్తామని అప్పట్లో చైనా కూడా చెప్పింది. భారత్ లో ఎదురైన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకూ ఆ నిర్ణయం తీసుకోలేదు. మోదీకి ఎదురైన అతిపెద్ద సవాళ్లలో పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ఏర్పడిన పరిస్థితులను ముందుగా చెప్పుకోవచ్చు.

యూరీ దాడులు
అది 2016 సెప్టెంబరు 18… పాకిస్థాన్ ఉగ్రవాదులు నలుగురు జమ్ముకశ్మీర్ లోని యూరీలోకి చొరబడి భారత ఆర్మీపై భీకరదాడి చేశారు. 20 ఏళ్ల వ్యవధిలో ఎన్నడూ జరగనంత భారీ దాడి ఇది. కాశ్మీరులో అలజడి, అశాంతి చోటుచేసుకుంది. ఒకవైపు కశ్మీర్ లో వేర్పాటువాదులు సృస్టిస్తో అలజడి, మరోవైపు ఉగ్రదాడి. దేశ సరిహద్దుల వద్ద శాంతి నెలకొందని చెప్పుకుంటున్న మోదీ సర్కారుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. మోదీ ఎదురుకున్న అతి పెద్ద సవాళ్లలో మొదటిది ఇదే.

2019 పుల్వామాదాడి
యూరీ దాడులను గుర్తుకు తెచ్చింది 2019 పుల్వామాదాడి. మరోసారి యూరీ దాడుల వంటివి జరగకుండా చూసుకుంటామని, దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని చెప్పుకుంటున్న మోదీపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించేలా చేసిన ఘటన అది. 2019, ఫిబ్రవరి 14న శ్రీనగర్ లో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న కాన్వాయ్ పై ఉగ్రవాదులు కారుతో ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.

కరోనా-దేశంలో మళ్లీ పాత రోజులు వస్తే బాగుండు
చైనాలో కరోనా అల్లకల్లోలం సృష్టించింది. మరికొన్ని దేశాలకు పాకి భయాందోళనలకు గురిచేసింది. 2020, జనవరి 27న భారత్ లోకీ వ్యాప్తించింది. కేరళలో మొదటి కేసు నమోదైందని తెలుసుకుని దేశ ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. కొన్ని రోజులకే దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందింది.

లాక్ డౌన్ తో భారత ఆర్థిక వ్యవస్థకు మళ్లీ నష్టం వచ్చింది. రోడ్లన్నీ నిర్మానుష్యం. కొనుగోళ్లు నిలిచిపోయాయి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వలస కార్మికులు వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ సొంత ప్రాంతానికి వెళ్తూ పడిన కష్టాలు వర్ణనాతీతం. ఇది కూడా ఇంతకు ముందు ఏ ప్రధానికీ ఎదురుకాని సవాలుగా చెప్పవచ్చు.

కరోనా విజృంభణ సమయంలో దేశంంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ముందెన్నడూ చూడని ప్రతికూల పరిస్థితులు అవి. కరోనా ప్రభావం ఇప్పటికీ కనపడుతోంది. దేశంలో మళ్లీ పాత రోజులు వస్తే బాగుండని ప్రజలు అనుకున్నారు. మనుషులే కాదు మూగజీవాలు సైతం తిండి కోసం అలమటించాయి.

చైనా, గల్వాన్ లోయ
చైనా-భారత్ మధ్య ఉన్న విభేదాలు 2020 మేలో తారస్థాయికి చేరాయనే చెప్పుకొవాలి. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో భారత సైనికులతో పాటు చైనా సైనికులు చాలా మంది మృతి చెందారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగోంగ్ సరస్సు, వాస్తవాధీన రేఖ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు కూడా మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.

జూన్ 15న జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం చెందారు. మృతి చెందిన/గాయపడిన చైనా సైనికుల సంఖ్య 43గా ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సరిహద్దుల్లో పరిస్థితులపై భారత్ సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మోదీకి ఎదురైన అతి పెద్ద సవాలుగా దీన్ని చెప్పుకోవచ్చు.

అల్లర్లు
రాజధాని ఢిల్లీలో 2020, ఫిబ్రవరి 23 నుంచి దేశ జరిగిన అల్లర్లు అంతర్జాతీయంగానూ సంచలనమయ్యాయి. మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలు రాష్ట్రాల్లో 2018-19లో జరిగిన మూకదాడులు కేంద్ర సర్కారుకు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి.

సాగు చట్టాలు- రైతుల వ్యతిరేకత
సాగుచట్టాలు-2020కి వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళన ప్రపంచాన్నీ కదిలించిందని చెప్పుకోవాలి. మోదీకి ఈ అప్పట్లో ఈ వ్యవహారం అతి పెద్ద సవాలుగా మారింది. చివరకు ఆ చట్టాలను కేంద్ర సర్కారు ఉపసంహరించుకుంది. 2021 అక్టోబరు 3న ల‌ఖింపూర్ ఖేరీలో రైతుల మీదకు కారు దూసుకెళ్లడం, కొందరు రైతులు చనిపోవడం సంచలనం రేపింది. కేంద్ర స‌హాయ‌ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలు మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించాయి.

మరిన్ని..
జీఎస్టీ: మోదీ సర్కారు అతిపెద్ద సంస్కరణగా తీసుకొచ్చిన జీఎస్టీలో లోపాలు ఉన్నాయని ఇప్పటికీ విమర్శలు వస్తున్నాయి.

2014 మేనిఫెస్టో: యూపీఏ ప్రభుత్వాన్ని గద్దె దించి ఎన్డీఏ సర్కారును ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంలో 2014 మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారు. మోదీ ప్రచార సభల్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి.

యూపీలోని ఉన్నావ్‌లో బాలికపై అత్యాచారం కేసు (2017 జూన్ 4): బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అప్పట్లో ఈ వ్యవహారం బీజేపీని ఇరుకున పెట్టింది.

K Laxman: 9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇన్ని కేటాయించాం: ఎంపీ లక్ష్మణ్