ఆధార్‌ కార్డులో ఈ తప్పు చేయొద్దు.. భారీ జరిమానా!

  • Published By: sreehari ,Published On : January 15, 2020 / 04:40 PM IST
ఆధార్‌ కార్డులో ఈ తప్పు చేయొద్దు.. భారీ జరిమానా!

ఆధార్ కార్డుదారులకు హెచ్చరిక. మీ ఆధార్ కార్డులో ఈ చిన్న తప్పు చేశారా? భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. ఆధార్ విషయంలో ఎలాంటి తప్పులు చేసినా తప్పించుకోలేరు. కనీసం రూ.10వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఐటీ శాఖ. పన్నుదారులు పన్ను చెల్లించే సమయంలో పాన్ కార్డుకు బదులుగా ఆధార్ కార్డును సమర్పించవచ్చునని ఆదాయ పన్ను శాఖ తెలిపింది.

పాన్ కార్డు స్థానంలో 12 అంకెల ఆధార్ నెంబర్ చూపిస్తే చాలు. కానీ, ఇక్కడే మీరు తప్పు చేసే అవకాశం ఉంది జాగ్రత్త. పన్ను దాఖలుకు ఆధార్ నెంబర్ ఇచ్చే సమయంలో తప్పులు లేకుండా చూసుకోండి. కావాలని ఆధార్ నెంబర్ తప్పుగా ఇచ్చినా లేదా పొరపాటున తప్పుగా నెంబర్ దాఖలు చేసినా భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాదాపు రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

2019 ఆర్థిక బిల్లులోని కొత్త సవరణ ప్రకారం.. ఆదాయ పన్ను శాఖ 1961 చట్టంలో సవరణలు చేసింది. ఈ కొత్త సవరణలతో పాన్ కార్డు లేని పన్నుదారులు తమ ఆధార్ కార్డును దాఖలు చేసుకోవచ్చు. తద్వారా పాన్ కార్డు నేరుగా సదరు పన్నుదారుడికి జారీ అవుతుంది. అంతేకాదు.. తప్పుడు ఆధార్ నెంబర్ ఇస్తే.. భారీ పెనాల్టీ కూడా ఉంటుందని పేర్కొంది.

ఆదాయ పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. పాన్ కార్డు ఇవ్వని పన్నుదారులు ఆధార్ కార్డును సమర్పించిన సందర్భాల్లో మాత్రమే కొత్త పెనాల్టీ నిబంధనలు వర్తిస్తాయి. ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసే సందర్భంలో, కొత్త బ్యాంకు అకౌంట్ తెరిచే సమయంలో, డిమ్యాట్ అకౌంట్, మ్యూటువల్ ఫండ్స్, బాండ్స్, రూ.50వేలకుపైగా కొనుగోలు సమయంలో మాత్రమే ఈ రూల్స్ వర్తిస్తాయి.

కొత్త ఆధార్ రూల్స్ :
* ఆధార్ కార్డును UIDAI నుంచి జారీ అయినప్పటికీ ఈ జరిమానా విధించదు. 
* ఆదాయ పన్ను శాఖ మాత్రమే తప్పుడు ఆధార్‌పై పెనాల్టీ విధిస్తుంది.
* 1961 ఆదాయ పన్ను చట్టం, 272B సెక్షన్ కింద ఐటీ శాఖ పెనాల్టీ విధించవచ్చు.
* PAN బదులుగా ఆధార్ నెంబర్ ఇచ్చినప్పుడే ఈ రూల్ వర్తిస్తుంది. 
* PAN ధ్రవీకరించడంలో విఫలమైనప్పుడు మాత్రమే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
* ఒక్కో డిఫాల్ట్.. పెనాల్టీ రూపంలో రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. 
* ప్రారంభంలో ఈ పెనాల్టీ పరిమతంగా ఉండేది.
* గత సెప్టెంబర్ నెలలో పాన్, ఆధార్ పరస్పరం మార్చుకునే నిబంధన వచ్చింది.
* అప్పుడే పెనాల్టీ పరిమితి కూడా భారీగా పెరిగింది.
* ఆధార్ విషయంలో కూడా పెనాల్టీని పెంచింది.

జరిమానా ఎప్పుడు విధిస్తారంటే?
* PAN బదులుగా ఆధార్ తప్పుగా ఇచ్చినప్పుడు
* నిర్దిష్ట లావాదేవీలకు మీ పాన్ లేదా ఆధార్ ఇవ్వనప్పుడు
* మీ ఆధార్ నెంబర్ మాత్రమే ఇస్తే సరిపోదు. బయోమెట్రిక్ ధ్రువీకరించాలి.
* బయోమెట్రిక్ ఐడెంటిటీ ఫెయిల్ అయినా పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.
* బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా PAN, ఆధార్ ఇవ్వకపోయినా జరిమానా పడుతుంది.
* ఈ నిబంధన ప్రకారం.. ఒక్కో ఫాంపై ఆధార్ తప్పుగా ఇస్తే రూ.10వేలు జరిమానా
* రెండు ఫాంల్లో ఆధార్ తప్పుగా ఇస్తే.. రూ.20వేలు వరకు జరిమానా పడుతుంది.
* ఫైలింగ్ ఫాంలను పూర్తి చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.