గిరిజనుల గ్రామం ఆదర్శ నిర్ణయం : మద్యం, పొగాకు నిషేధించారు

  • Published By: veegamteam ,Published On : October 21, 2019 / 09:29 AM IST
గిరిజనుల గ్రామం ఆదర్శ నిర్ణయం : మద్యం, పొగాకు నిషేధించారు

గుజరాత్ రాష్ట్రంలోని ఉదేపూర్ ప్రాంతంలోని భేఖాడియా గ్రామంలోని గిరిజనులు మద్యం..పొగాకు ఉత్పత్తులను నిషేధించి ఆదర్శంగా నిలిచారు. మద్యం, బీడీలు, సిగిరెట్లు, గంజాయి వంటి మత్తు పదార్ధాలను కూడా నిషేధించారు.  ఆఖరికి వారి ఇళ్లలో వివాహాలు జరిగినా..వచ్చిన అతిథులకు మద్యం ఏర్పాటు చేయాలంటే కూడా భయపడుతున్నారు. 

గిరిజనుల వివాహాల్లోను..శుభకార్యాల్లోను మద్యం..మాంసం తప్పనిసరిగా ఉంటుంది. మద్యం, మాసంతో పాటు గంజాయి వంటి మత్తు పదార్ధాలు ఏర్పాటు చేస్తారు. అలా చేయకుంటే దైవదూషణ చేసినట్లుగా..వివాహానికి వచ్చిన అతిథులను అవమానించినట్లుగా భావిస్తారు.  కానీ గుజరాత్ లో గిరిజనులు వివాహాల్లోనే కాదు సాధారణ రోజుల్లో కూడా మద్యాన్ని సేవించకూడదనీ, మత్తు పదార్ధాలను తీసుకోకూడదనీ నిర్ణయించుకున్నారు. తీర్మానం కూడా చేసుకున్నారు. ఈ నిబంధన అతిక్రమించినవారు గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్పి భారీగా జరిమానా కట్టాలని హెచ్చరిక  కూడా చేశారు గ్రామ పెద్దలు. దీనికి సంబంధించి ఓ బోర్డును కూడా తయారు చేసి గ్రామం ఎంట్రన్స్ లో ఏర్పాటు చేశారు. 

11 వందల జనాభా కలిగినది భేఖాడియా గ్రామం.  వారి ఇళ్లలో వివాహాలు జరిగితే మద్యం..మాసం, గంజాయి వంటివి ఉండాల్సిందే. కానీ బేఖాడియా గ్రామస్తులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మంచి నిర్ణయం తీసుకున్నారు. మద్యం, మత్తు పదార్ధాలు మానివేయాలనీ..వివాహాలు జరిగే సమయాల్లో మద్యం గానీ, మత్తు పదార్ధాలు గానీ ఉండకూడదని తీర్మానించుకున్నారు. 

ఈ విషయంపై గ్రామ పెద్ద రతన్ భగత్ మాట్లాడుతూ..శుభకార్యాలకు వచ్చిన అతిథులను గౌరవంగా చూసుకోవటమే కాదు…వారికి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మద్యం తాగటం..మత్తు పదార్ధాలు తీసుకోవటం వల్ల జరిగే అనర్థాలను శుభకార్యాలకు వచ్చిన అతిథులకు చెప్పాలని అనుకున్నామనీ..పెద్దలంతా మద్యం తాగుతూ మత్తు పదార్ధాలు తీసుకుంటుంటే అది చూసిన పిల్లలు కూడా అలవాటు పడుతున్నారనీ అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని రతన్ భగత్ తెలిపారు.     

ఈ నిబంధన అతిక్రమించి వివాహాల్లో మద్యాన్ని ఏర్పాటు చేసినందుకు మూడు వివాహాలను బహిష్కరించారు. వారికి  వెయ్యి రూపాయలు జరిమానా విధించారు గ్రామ పెద్దలు. వారితో క్షమాపణ లేఖ కూడా రాయించి గ్రామస్థులందరికీ క్షమాపణ చెప్పారు. ఇకపై ఎప్పుడు మద్యం సేవించమని వాగ్ధానం చేయించారు. 

అంతేకాదు గ్రామంలోనే కాక గ్రామ పరిసరాల్లో మద్యం దుకాణాలు గానీ బీడీలు, సిగిరెట్లు, గంజాయి వంటి మత్తు పదార్ధాలు విక్రయించేందుకు వీల్లేకుండా చర్యలు తీసుకున్నారు. 

దీనిపై గ్రామ సర్పంచ్ మిలన్ రత్వా మాట్లాడుతూ..తమకు సంపాదన కంటే ఆరోగ్యకరమైన జీవితం ముఖ్యమనీ అన్నారు. ఈ నిబంధనను వ్యతిరేకించినవారికి కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నామనీ తరువాత వారు కూడా అంగీకరించి మంచి నిర్ణయమని అభినందిస్తున్నారనీ తెలిపారు.