మళ్లీ మోడీ వస్తే దేశంలో ఎన్నికలు ఉండవు : చంద్రబాబు భయపెట్టారు

  • Published By: veegamteam ,Published On : April 15, 2019 / 02:48 PM IST
మళ్లీ మోడీ వస్తే దేశంలో ఎన్నికలు ఉండవు : చంద్రబాబు భయపెట్టారు

బెంగళూరు : కేంద్రంలో మరోసారి మోడీ వస్తే దేశంలో ఇక ఎన్నికలు ఉండవు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ప్రధాని మోడీ అని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నమైందన్నారు. కర్నాటక రాష్ట్రంలో మాండ్యలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడి తరుఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేశారు. దేవెగౌడ మనవడిని గెలిపించాలని అభ్యర్థించారు. కర్నాటక సీఎం కుమారస్వామి సుపరిపాలన అందిస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. ప్రధాని పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి దేవెగౌడ అని కితాబిచ్చారు.

ప్రధాని మోడీ పాలనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ నిర్ణయాలు దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేశాయని అన్నారు. నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. రూ.2వేల నోటు రావడం వల్ల అవినీతి పెరిగిపోయిందన్నారు. దేశ రక్షణ విషయంలోనూ మోడీ ప్రభుత్వం రాజీ పడిందని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ సూచనల మేరకే ఈసీ పని చేస్తోందని, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం లేదని చంద్రబాబు ఆరోపించారు.

మోడీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. పాండవపుర స్టేడియంలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవెగౌడ ఏపీకి వచ్చి చంద్రబాబు తరఫున ప్రచారం చేశారు. చంద్రబాబుని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇప్పుడు చంద్రబాబు.. దేవెగౌడ మనవడి కోసం క్యాంపెయిన్ చేశారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. మాండ్య లోక్ సభ స్థానంలో జేడీఎస్ అభ్యర్థిగా దేవెగౌడ మనవడు నిఖిల్ బరిలో ఉన్నారు. ఇక్కడ సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ సుమలతకు మద్దుతు ప్రకటించింది.