మళ్లీ తెగబడిన పాక్ రేంజర్లు : ముగ్గురు భారతీయులు మృతి

  • Published By: madhu ,Published On : March 2, 2019 / 06:10 AM IST
మళ్లీ తెగబడిన పాక్ రేంజర్లు : ముగ్గురు భారతీయులు మృతి

భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది. ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ తూట్లు పొడుస్తోంది. కొన్ని రోజులుగా ఫైరింగ్‌కు దిగుతోంది.
Read Also : ఈ పరీక్షలు పాసైతేనే : అభినందన్‌ను ఏం చేస్తారు

మార్చి 02వ తేదీ శనివారం మెందర్, కృష్ణఘాటి, నౌహెరా, బాలకోట్ సెక్టార్లలో కాల్పులకు తెగబడింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. భారత సైనిక పోస్టులు, ప్రజల నివాసాలే లక్ష్యంగా చేసుకొంటోంది. మోటార్ షెల్స్‌తో పాక్ రేంజర్లు ఫైరింగ్ చేశాయి. ఈ కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి. 

పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ మూకల కాల్పులకు వందలాది గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. విచక్షణారహితంగా మోర్టార్లు, తుపాకులు పేలుస్తూ తూటాల వర్షం కురిపిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేదు.
Read Also : రైతులు కావలెను : జీతం 20 వేలు

దీనితో బతుకు జీవుడా అంటూ ఎంతో మంది ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఉండలేక..వెళ్లలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఫలితంగా గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. పాక్ జరుపుతున్న కాల్పులతో పశు, పంట ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతోంది. 

సరిహద్దులో ఉన్న గ్రామాలపై కేంద్రం, అధికారులు దృష్టి సారించారు. పౌరులకు హాని కలగకుండా బంకర్లలో ఆశ్రయం కల్పిస్తున్నారు అధికారులు. మరికొన్ని ప్రాంతాల్లో గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

Read Also : గివేం మాటలు : జేషే‌ ఏ మహ్మద్‌తో సంప్రదింపులు – ఖురేషీ