తప్పు ఒప్పుకుని…మన్మోహన్ సలహాలు తీసుకోండి

  • Published By: venkaiahnaidu ,Published On : February 8, 2020 / 06:20 PM IST
తప్పు ఒప్పుకుని…మన్మోహన్ సలహాలు తీసుకోండి

దేశ ఆర్థికస్థితి విషయంలో మోడీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు చిదంబరం. తప్పుచేసినట్లు ఇప్పటికైనా మోడీ సర్కార్ ఒప్పుకుని…మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాజీ ప్రధానమంత్రి,ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ సలహాలు తీసుకుని దేశ ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించాలని సూచించారు.

కేంద్ర బడ్జెట్ 2020-21పై హైదరాబాద్ లోని ముఫ్ఖం జాహ్ కళాశాలలో శనివారం ఓ కార్యక్రమం జరిగింది. దీనికి చిదంబరం హాజరై విద్యార్థులను ఉద్దేశించి  మాట్లాడుతూ… ఇప్పటి వరకూ దేశాన్ని ఏలిన ప్రభుత్వాలతో పోల్చుకుంటే అత్యంత పేదల వ్యతిరేక ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ఉందని విమర్శించారు. గ్రామీణ భారతం, వ్యవసాయరంగం దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా మోడీ సర్కార్ జరిగిన తప్పు ఒప్పుకుని తమకు సలహాలు ఇవ్వాలని మన్మోహన్ సింగ్‌ను కోరాలిని ఆయన హితవు పలికారు. ప్రభుత్వం తనను తాను మభ్యపెట్టుకుంటోందని విమర్శించారు.

దేశ ఆర్థిక పరిస్థితిని వెల్లడించేందుకు ఎందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తి చూపించడం లేదని చిదంబరం నిలదీశారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా ఆరు  త్రైమాసికాల్లో జీడీపీ తగ్గుతూ వచ్చిందని, ఏడో త్రైమాసికం గురించి ఇక చెప్పేదేముంటుందని అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పేషెంట్ అయితే, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం మంచిరోజులు వస్తాయని, పేషెంట్‌ త్వరలోనే కోలుకుంటాడని చెబుతున్నారని అన్నారు.

అన్ని రంగాల్లో వృద్ధి లేదని, పన్నుల వసూలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. దేశ చరిత్రలో GDP ఇంతగా పడిపోయిన సందర్భం లేదని వ్యాఖ్యానించారు. అయితే..దీనికి కారణం నోట్ల రద్దుగా ఆయన అభివర్ణించారు. ఇండియా ఆర్థిక వృద్ధి 8.2 శాతం నుంచి 5 శాతానికి పడిపోయిందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా స్వదేశీ, విదేశీ ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని చిదంబరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేకమన్నారు. పీఎం కిసాన్ స్కీంకు కూడా కోతలు పెట్టిన విషయాన్ని ఆయన వివరించారు.