మోడీ హామీలు…గాలిలో మేడలు : కేంద్రంపై రాహుల్ ఫైర్

10TV Telugu News

మోడీ సర్కారుపై మరోసారి విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ ​నాయకుడు రాహుల్​ గాంధీ. కరోనా వైరస్​, ఆర్థిక వ్యవస్థ, చైనాతో సరిహద్దు వివాదంపై గత కొంతకాలంగా ప్రభుత్వంపై రాహుల్ ​ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న రాహుల్ తాజాగా… కరోనా సంక్షోభంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ట్వీట్ చేశారు. ​

21 రోజుల్లో కరోనాను ఓడిస్తామని గాలిలో మేడలు కట్టడం, ఆరోగ్య సేతు యాప్​.. ప్రజలను రక్షిస్తుందని చెప్పడం, రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ, మన భూభాగాన్ని ఎవరూ ఆక్రమించలేదు.. అంతా నియంత్రణలోనే ఉంది.. అని ఇలా బీజేపీ అబద్ధాలు చెప్పింది. అయితే వీటన్నంటిలోనూ ఒక నిజం మాత్రం ఉంది. అదే ‘ఆపదలో అవకాశం’ #పీఎం కేర్స్​ అంటూ రాహుల్ ట్వీట్ లో తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం సోనియా గాంధీ వైద్య పరీక్షల​ కోసం రాహుల్ ఆమెకు తోడుగా​ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.


మరోవైపు, చైనా వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ .. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని నిన్న రాహుల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పార్లమెంట్​లో రక్షణమంత్రి చేసిన ప్రకటన ద్వారా అర్థమవుతోందన్నారు. అతి ముఖ్యమైన విషయంపై రక్షణమంత్రి ప్రకటన చేస్తున్న సమయంలో సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు లేరని రాహుల్ ప్రశ్నించారు.


అయితే, నిన్న రాజ్​నాథ్​ ప్రకటన అనంతరం.. ప్రశ్నలు వేయడానికి కాంగ్రెస్​ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను అనుమతి కోరారు. అందుకు స్పీకర్​ నిరాకరించారు. వెంటనే సభ నుంచి కాంగ్రెస్​ ఎంపీలు వాకౌట్​ చేసిన విషయం తెలిసిందే.10TV Telugu News