కొట్టే చేతికి తిండి పెట్టడం కూడా తెలుసు: హ్యాట్సాఫ్ పోలీస్..

  • Published By: vamsi ,Published On : March 25, 2020 / 02:52 AM IST
కొట్టే చేతికి తిండి పెట్టడం కూడా తెలుసు: హ్యాట్సాఫ్ పోలీస్..

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తుండగా.. దేశంలోనూ విస్తరిస్తున్న క్రమంలో లాక్‌డౌన్‌తో జనాలను ఇళ్లకు మాత్రమే పరిమితం చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి. అయినా కూడా లెక్కచెయ్యకుండా బండ్ల మీద రయ్యి రయ్యిమంటూ తిరిగేవారికి పోలీసులు వాళ్ల స్టైల్‌లో గట్టిగానే ట్రీట్మెంట్ ఇస్తున్నారు.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి వీడియోలు కూడా గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వాలు చెప్పిన వినకుండా రోడ్లపైకి వచ్చేవాళ్లను కంట్రోల్ చేస్తున్న పోలీసులు నివాసాలు లేక రోడ్లపైనే ఉంటూ ఆకలికి అలమటిస్తున్న వారికి అన్నం కూడా పెడుతున్నారు. విధుల్లో బిజీగా ఉండే పోలీసులు.. సమాజ సేవలో కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో తిండి లేక రోడ్లపై ఉండే అనాథలకు అన్నం పెడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఇటువంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. గుళ్లు, బస్టాండులు, మెట్రోలు కింద అనాధలుగా ఉన్నవారికి పోలీసులు అన్నదానం చేస్తున్నారు. లేటెస్ట్‌గా కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్ వద్ద అన్నం లేక అలమటిస్తున్న అనాథలకు దాతల సహకారంతో పోలీసులు అన్నదానం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అలాగే విజయవాడతో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాగే అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా ఆహార పొట్లాలు అందిస్తున్నారు. పేదలు, ఆహారం అవసరం ఉన్నవారికి లాక్ డౌన్ సమయంలో ఆకలిని తీర్చారు. దీంతో హ్యాట్సఫ్ పోలీస్ అంటూ పోలీసులపై నెటిజన్లు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

See Also |  బ్రేకింగ్ న్యూస్ : ఇండియాలో కరోనా..తమిళనాడులో తొలి మృతి