బుధవారం అర్ధరాత్రికి తీరం దాటనున్న నివర్ తుపాను

  • Published By: murthy ,Published On : November 25, 2020 / 01:39 PM IST
బుధవారం అర్ధరాత్రికి తీరం దాటనున్న నివర్ తుపాను

Cyclone Nivar To Hit Tamil Nadu, Puducherry At 145 Kmph After Midnight  : నివర్ తుపాన్ ప్రభావంతో తమిళనాడు లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను కారణంగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం సూచించింది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు 290 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన నివర్‌ తుపాను రానున్న 12 గంటల్లో పెను తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.



బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశమున్నట్లు తెలిపింది. దీంతో రానున్న రెండు రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. ఇప్పటికే చెన్నైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను కారణంగా చెన్నై ఎయిర్ పోర్టులో 26 విమాన సర్వీసులు రద్దు చేశారు. వర్షం వల్ల చెన్నైలోని చెంబరాంబక్కం సరస్సులో నీటి మట్టం పెరిగింది. దీంతో రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.



వర్షాల కారణంగా తమిళనాడు వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  చెన్నై శివారులోని చెంగల్పట్ జిల్లాలోని నందివీరం చెరువు పొంగి మహాలక్ష్మీ నగర్ లోని వరదనీరు ప్రవేశించింది. ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా 987 సహయ శిబిరాలను ఏర్పాటు చేసి, 24,166మంది తుపాను సహాయ కేంద్రాలకు తరలించారు. 22 పడవల్లో సముద్రంలో వేటకు వెళ్లిన కరైకల్ కు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు తిరిగి వచ్చారు.
https://10tv.in/nivar-cyclone-impact-on-four-states-holiday-in-that-state/
కడలూరు, నాగపట్నం, తంజావూరు, మైలాదుదుత్తురైలలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్ధంగా ఉంచారు. పుదుక్కోట్టై, నాగపట్నం, తంజావూర్, తిరువరూర్, కడలూరు, విల్లుపురం, చెంగల్‌పేట – ఏడు జిల్లాల్లో బస్సు రవాణాను బుధవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేసారు.



రాష్ట్రంలోని 14,144 చెరువుల్లో 1579 చెరువులు వర్షాలకారణంగా పూర్తి స్ధాయిలో నిండాయని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.మెట్టూర్, భవానిసాగర్, రెడ్ హిల్స్, పూండి, చెంబరంబక్కం, చోళవరం జలాశయాలలో నీటిమట్టాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చెన్నై, చిట్లపాక్కం, మేడవక్కం, తాంబరం లోని అన్నా సలై లోని లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వరద నీటిని తొలగించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.



మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులువేటకు వెళ్లోద్దని సీఎం నారాయణస్వామి విజ్ఞప్తి చేశారు. “నివార్ తుఫాను నేపథ్యంలో తుపాను పరిస్ధితికి సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ వి.నారాయణసామితో మాట్లాడారు. విద్యుత్, టెలిఫోన్ ,కమ్యూనికేషన్ వ్యవస్ధ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు భావించిన అధికారులు అప్రమత్తమయ్యారు.