చిదంబరానికి ఎదురు దెబ్బ : బెయిల్ పిటీషన్ కొట్టివేత 

  • Published By: chvmurthy ,Published On : November 15, 2019 / 10:45 AM IST
చిదంబరానికి ఎదురు దెబ్బ : బెయిల్ పిటీషన్ కొట్టివేత 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్రమాజీమంత్రి చిదంబరానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చిదంబరం దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటీషన్ను ఢిల్లీ హై కోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేసులో ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం  కీలకంగా వ్యవహరించినట్లు జస్టిస్ సురేష్ కుమార్ కెయిత్  అభిప్రాయపడ్డారు.  బెయిల్ కోరటం అనేది చిదబరం హక్కు అయినప్పటికీ ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తే అది ప్రజా ప్రయోజనాలకు విరుధ్ధమవుతుందని న్యాయమూర్తి అన్నారు. 

మనీ లాండరింగ్ కేసులో  అక్టోబరు 16న చిదంబరాన్ని ఈడీ అరెస్టు చేసింది. అప్పటికే ఆయన  అవినీతి కేసులో తీహార్ జైలులో ఉన్నారు.  కోర్టు ఇటీవల ఆయన జ్యుడిషియల్ కస్టడీని ఈనెల 27 వరకూ పొడిగించింది. 74 ఏళ్ల వయస్సులో విదేశాలకు పారిపోవడం, సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటివేవీ నిరూపణ కాలేదని చిందబరం తన రెగ్యులర్ బెయిల్  పిటీషన్ లో పేర్కొన్నారు.

ఆయన అభ్యర్థనను ఈడీ వ్యతిరేకిస్తూ, వ్యక్తిగత ప్రయోజనాల రీత్యా ఆయన తన అధికార హోదాను దుర్వనియోగం చేశారని ఆరోపించింది. నేర తీవ్రత దృష్ట్యా బెయిలు మంజూరు చేయరాదని కోర్టుకు విన్నవించింది. కాగా, సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఇదే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అక్టోబర్ 22న చిదంబరానికి కోర్టు బెయిల్ ఇచ్చింది.