Maharashtra Politics: మత్య్సకారుల సమావేశంలో ఐశ్వర్య రాయ్ పేరెత్తిన మంత్రి.. వివాదం లేవనెత్తిన విపక్షాలు
రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా మారుతుంది. కళ్లు మెరిసిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే, వారిని మీరు ఆకర్షిస్తారు. ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పాలి. ఆమె మంగుళూరులోని బీచ్ సమీపంలో నివసించేది

Minister Vijay Kumar Gavit: మహారాష్ట్రకు చెందిన మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ పేరెత్తడమే అందుకు కారణం. తాజాగా ఆయన మత్స్యకారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఐశ్వర్యరాయ్ లాంటి కళ్లు కావాలంటే రోజూ చేపలు తినండి అన్నారు. దీనిపైనే వివాదం తలెత్తింది.
ధూలే జిల్లాలోని అంతుర్లీలో గిరిజన మత్స్యకారులకు చేపల వేట సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా మత్స్యకారులను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వ గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ విజయ్ కుమార్ గవిత్ ప్రసంగించారు. ‘‘రోజూ చేపలు తినేవారి చర్మం నునుపుగా మారుతుంది. కళ్లు మెరిసిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని చూస్తే, వారిని మీరు ఆకర్షిస్తారు. ఐశ్వర్యరాయ్ గురించి నేను మీకు చెప్పాలి. ఆమె మంగుళూరులోని బీచ్ సమీపంలో నివసించేది. ఆమె రోజూ చేపలు తినేది. మీరు ఆమె కళ్ళు చూశారా? మీకు కూడా ఆమెలాంటి కళ్ళు ఉన్నాయి. చేపల్లో కొన్ని నూనెలు ఉంటాయి, అవి మీ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది’’ అని మంత్రి అన్నారు.
ఈ ప్రకటనపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గిరిజనుల సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు.