దిశ హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో ఎవరేమన్నారు

  • Published By: chvmurthy ,Published On : December 2, 2019 / 08:31 AM IST
దిశ హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో ఎవరేమన్నారు

“దిశ”  హత్యాచార ఘటన  దేశంలోని ప్రతి ఒక్కరినీ బాధించిందని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాధ్ సింగ్  అన్నారు. లోక్ సభలో ఈరోజు దిశ హత్యాచార ఘటనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటన దేశం మొత్తం తలదించుకునేలా చేసింది.ప్రతి ఒక్కరినీ బాధించింది.  దోషులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి మహిళలు చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను ఆపేందుకు ఎటువంటి చట్టాలను తీసుకువచ్చేందుకైనా ప్రభుత్వం సిధ్దంగా ఉందని చెప్పారు.  చట్టాల్లో మార్పులు చేసేందుకు ..ఈవిషయమై చర్చించేందుకు ఫ్రభుత్వం సిధ్దంగా ఉందన్నారు.  దిశ ఘటనలో నిందితులుక కఠినమైన శిక్షలు పడాలని సభ్యులు  ముక్త కంఠంతో కోరారు. ఈ ఘటనపై పార్లమెంట్ లో ఎవరెవరు ఏమన్నారో ఒకసారి చూద్దాం 

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
దిశ ఘటనపై దిగ్భ్రాంతి చెందానని, పోలీసులు ఇలాంటి ఘటనల్లో చురుగ్గా పనిచేయాలని  కిషన్ రెడ్డి సూచించారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలపై కేంద్రం సీరియస్‌గా ఉందని, కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని  వెల్లడించారు.

రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ ఎంపీ
ఈ అమానవీయ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దేశం మొత్తం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. దోషులకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సమాజ్ వాది ఎంపీ జయాబచ్చన్
దిశ కేసులో నిందితులకు బహిరంగ  ఉరిశిక్ష విధించాలి ఎటువంటి క్షమాభిక్ష లేకుండా వారిని ఉరితీయాలన్నారు.  దీనికి ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలని ప్రజలు నిలదీయాల్సిన సమయం  ఆసన్నమైందన్నారు. నిర్భయకేసులోనూ ఇంతవరకు సరైన  న్యాయం జరగలేదని జయాబచ్చన్ అన్నారు. 

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి 
దిశఘటనపై  తెలంగాణ హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. జాతీయ రహదారిపై హత్య జరిగితే పోలీసులు అడ్డుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బండి సంజయ్..బీజేపీ ఎంపీ
హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా చెడు వాతావరణాన్ని సృష్టించిందన్నారు. ప్రజలను చైతన్యపరచడంలో నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పారు. నిందితులకు వెంటనే శిక్షలు అమలు చేస్తే తప్ప న్యాయం జరగదని సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.  జరిగిన ఘటనకు నిరసనగా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు. ఘటన జరిగినప్పుడే కాకుండా.. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, చట్టంలో మార్పులు తీసుకొస్తే తప్ప మార్పు సాధ్యం కాదని ఆయన సభకు వివరించారు.

కె.రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ 
దిశ హత్యాచార ఘటనను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. మహిళలకు రక్షణ కరువైన పరిస్థితులు ఏర్పడటం దురదృష్టకరమన్నారు. 

వంగా గీత..వైసీపీ ఎంపీ
దిశను అత్యంత క్రూరంగా చంపేశారని విచారం వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఈ ఘటనను అందరూ ఖండించాలన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడాలంటేనే భయపడేలా చట్టం తీసుకురావాలని ఆమె సభకు వివరించారు. మహిళలు బయటికి వెళ్తే ఇంటికి క్షేమంగా వస్తారో..రారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. 

మలోతు కవిత …టీఆర్ఎస్ ఎంపీ 
నిర్భయను తలపించేలా హైదరాబాద్‌లో దిశ ఘటన జరిగిందని కవిత వ్యాఖ్యానించారు. నిర్భయ కేసులో ఇప్పటివరకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయలేదన్నారు. చట్టాల్లో మార్పుల గురించి ఎవరూ మాట్లాడటం లేదని.. దోషులకు వెంటనే ఉరిశిక్ష పడేలా చట్టాలు తేవాలన్నారు.

నామా నాగేశ్వర రావు…టీఆర్ఎస్ ఎంపీ
దిశ అత్యాచార నిందితుల‌కు 30 రోజుల్లోగా క‌ఠిన శిక్ష‌ను అమ‌లు చేయాల‌ని అన్నారు.  ఘ‌ట‌న జ‌రిగిన కొన్ని గంట‌ల్లోనే నిందితుల‌ను ప‌ట్టుకున్నామన్నారు. ప‌ది బృందాలుగా మారి పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్లు నామా తెలిపారు. హైద‌రాబాద్ దిశ ఘ‌ట‌న ఇప్పుడు దేశ స‌మ‌స్య‌గా మారింద‌న్నారు. రాజ‌స్థాన్‌, త‌మిళ‌నాడు, యూపీల్లోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో 30 రోజుల్లోనే నిందితుల‌ను శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.