DMK : మేనిఫెస్టో, లీటర్ పెట్రోల్ పై రూ 5 తగ్గింపు, సిలిండర్ పై రాయితీ, విద్యార్థులకు ట్యాబ్ లు

డీఎంకే శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 2021, మార్చి 13వ తేదీ శనివారం దీనిని రిలీజ్ చేశారు.

DMK : మేనిఫెస్టో, లీటర్ పెట్రోల్ పై రూ 5 తగ్గింపు, సిలిండర్ పై రాయితీ, విద్యార్థులకు ట్యాబ్ లు

Dmk Manifesto

dmk manifesto : తమిళనాడులో ఎన్నికల ఫీవర్ నెలకొంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని పార్టీలు పోటీ పడుతున్నాయి. వ్యూహ రచన చేస్తున్నాయి. తమిళనాట ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రజలను ఆకర్షించే పథకాల రచన చేస్తోంది. పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేసే పనిలో బిజీ అయిపోతున్నాయి. అందులో భాగంగా..డీఎంకే శాసనసభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 2021, మార్చి 13వ తేదీ శనివారం దీనిని రిలీజ్ చేశారు.

విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలకు భారంగా మారిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ పై ప్రధానంగా ఈ పార్టీ దృష్టి సారించింది. తమను గెలిపించినట్లయితే…లీటర్ పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 4 తగ్గిస్తామని, అలాగే..వంట గ్యాస్ సిలిండర్ రాయితీ రూ. 100 ఇస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది. మహిళల ప్రసూతి సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి 12 నెలల పాటు ప్రసూతి హాలీడేస్ ఇస్తామని వెల్లడించింది. విద్యార్థులపై ప్రధానంగా దృష్టి సారించింది ఆ పార్టీ. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు అందిస్తామని తెలిపింది.

ప్రధానమైనవి : పెంచిన ఆస్తిపన్ను రద్దు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు. తమిళనాడు వ్యాప్తంగా కలైంజ్ఞర్‌ క్యాంటీన్లు. నీట్‌ పరీక్షల రద్దుకు శాసనసభ తొలి సమావేశంలో ఆర్డినెన్స్‌. అన్నాడీఎంకే మంత్రుల అవినీతిపై విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు. కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు రూ.4వేల సాయం. జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు. ఆవిన్‌ పాల ధర లీటర్‌పై రూ.3 తగ్గింపు. శాసనసభ సమావేశాలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం. మధ్యాహ్న భోజన సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్పు.

డీఎంకే..కాంగ్రెస్, వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్ 06న ఎన్నికలు జరుగనున్నాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే 173 స్థానాలకు అభ్యర్థులను నిలిపింది. స్టాలిన్ తనయుడు ఉదయ నిధి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. చెపాక్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.