ట్రంప్ పర్యటనకు ఒక్క రోజు ముందు…అహ్మదాబాద్ లో కూలిన VVIP ఎంట్రీ గేట్

  • Published By: venkaiahnaidu ,Published On : February 23, 2020 / 11:30 AM IST
ట్రంప్ పర్యటనకు ఒక్క రోజు ముందు…అహ్మదాబాద్ లో కూలిన VVIP ఎంట్రీ గేట్

ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకు మరికొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. సోమవారం(ఫిబ్రవరి-24,2020)మధ్యాహ్యాం అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన కొన్ని గంటలపాటు కొనసాగనుంది. అహ్మదాబాద్ లో రోడ్ షో తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కలిసి కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన సర్థార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంను ట్రంప్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

అయితే ట్రంప్ అహ్మదాబాద్ లో అడుగుపెట్టేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఇవాళ(ఫిబ్రవరి-23,2020)ఉదయం బలమైన గాలుల కారణంగా ట్రంప్ ప్రారంభించబోయే క్రికెట్ స్టేడియం బయట తాత్కాలిక వివిఐపి ఎంట్రీ గేట్ కూలిపోయిందని ఒక అధికారి తెలిపారు.

ఈ మొత్తం ఘటనను ఓ వ్యక్తి తన ఫోన్ లో రికార్డ్ చేశాడు.స్థానిక న్యూస్ ఛానల్స్ లో ఇప్పుడు ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. తాత్కాలిక ప్రవేశ ద్వారం…. వెల్డెడ్ స్టీల్ రాడ్లతో తయారు చేయబడి,ఫ్లెక్స్ బ్యానర్లలో కప్పబడి ఉంది.

అయితే మొదటి గేట్ కూలిపోయిన కొంతసేపటి తర్వాత స్టేడియం యొక్క ప్రధాన ద్వారం వద్ద ఉన్న మరొక తాత్కాలిక గేట్ నిర్మాణం యొక్క భాగం కూడా బలమైన గాలులకారణంగా కూలిపోయిందని మరొక అధికారి తెలిపారు. ఈ రెండు ఘటనల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదని,తిరిగి యధాస్థానంలో నిర్మాణాలను ఉంచేందుకు పని జరుగుతోందని ఆయన తెలిపారు. ఫ్రాబ్రికేషన్ పని జరుగుతున్నప్పుడు వీవీఐపీ ఎంట్రీ గేట్ కూలిపోయిందని,ఇది పెద్ద ఘటన కాదని,ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదని క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ తోమర్ తెలిపారు.

ట్రంప్-మోడీ కలిసి సోమవారం అహ్మదాబాద్ లో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం ఇద్దరూ కలిసి సర్థార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో ఏర్పాటు చేసే నమస్తే ట్రంప్ ఈవెంట్ కు హాజరవుతారు. అహ్మదాబాద్ పర్యటనలో రుచికరమైన గుజరాతీ వంటకాలను ట్రంప్ టేస్ట్ చేయనున్నారు.