వాక్ స్వాతంత్య్రం ఎక్కువగా దుర్వినియోగమవుతోంది…సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2020 / 04:50 PM IST
వాక్ స్వాతంత్య్రం ఎక్కువగా దుర్వినియోగమవుతోంది…సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

Freedom of speech is one of the most abused freedoms in recent times ఇటీవ‌ల కాలంలో వాక్ స్వాతంత్య్రం అత్యంత స్వేచ్ఛ‌గా దుర్వినియోగానికి గుర‌వుతున్న‌ద‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే ఇవాళ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరోనా వైరస్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ లో నిర్వహించిన తబ్లిగీ జ‌మాత్ అంశంలో కొన్ని మీడియా సంస్థ‌లు ముస్లింల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరును ఖండిస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీం విచార‌ణ చేప‌ట్టింది.


పిటీష‌న‌ర్ల త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేట్ దుశ్యంత్ ద‌వే వాదించారు. త‌బ్లిగీ జ‌మాత్ ఘ‌ట‌న ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన అఫిడ‌విట్‌ను దుశ్యంత్ వ్య‌తిరేకించారు. సీజేఐ దీనిపై స్పందిస్తూ.. ఎవ‌రు ఏమ‌నుకుంటున్నారో అది వాళ్లు చెప్పుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. మీరు ఏ విధంగా ఏదైనా చెప్పాల‌నుకుంటున్నారో, అదే విధంగా వాళ్లు చెబుతార‌ని, మీకో విష‌యం చెబుతున్నాను…ఇటీవ‌ల కాలం వాక్ స్వాతంత్య్రం అత్యంత దుర్వినియోగానికి గురైన‌ట్లు సీజేఐ జస్టిస్ బోబ్డే అన్నారు.


ఇదిలావుండగా, ఈ అఫిడవిట్‌ను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి దాఖలు చేయవలసి ఉండగా, అదనపు కార్యదర్శి దాఖలు చేయడంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. త‌బ్లీగ్ అంశంపై ఓ జూనియ‌ర్ అధికారితో అఫిడ‌విట్ స‌మ‌ర్పించడం ప‌ట్ల కేంద్రంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్య‌క్తం చేసింది. కోర్టును మీరు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా భావించ‌రాదని, జూనియ‌ర్ ఆఫీస‌ర్ అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌డం స‌రికాదని సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తాపై చీఫ్ జ‌స్టిస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీవీ ఛాన‌ళ్ల నియంత్ర‌ణ కోసం అమ‌లులో ఉన్న చ‌ట్టాల గురించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సీజే కోరారు. మ‌రో రెండు వారాల పాటు విచార‌ణ వాయిదా వేశారు