భారత్ Vs పాక్ : సైనిక సత్తా ఎవరికెంత

ప్రపంచంలో సైనిక శక్తులుగా ఎదిగిన.. ఎదుగుతున్న దేశాలపై గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ (జీఎఫ్‌పీ) అనే సంస్థ విస్తృత అధ్యయనం చేసింది. ఏ దేశానికి ఎంత సైనిక, ఆయుధ శక్తి ఉందో, రక్షణపై ఏయే దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో సుదీర్ఘ నివేదికను వెలువరించింది.

  • Published By: veegamteam ,Published On : February 26, 2019 / 07:01 AM IST
భారత్ Vs పాక్ : సైనిక సత్తా ఎవరికెంత

ప్రపంచంలో సైనిక శక్తులుగా ఎదిగిన.. ఎదుగుతున్న దేశాలపై గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ (జీఎఫ్‌పీ) అనే సంస్థ విస్తృత అధ్యయనం చేసింది. ఏ దేశానికి ఎంత సైనిక, ఆయుధ శక్తి ఉందో, రక్షణపై ఏయే దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో సుదీర్ఘ నివేదికను వెలువరించింది.

నేటి ప్రపంచ స్థితిని, గతిని ఆయుధం శాసిస్తోంది. బలమున్న వాడిదే రాజ్యం. అందుకే సైనికంగా, ఆయుధపరంగా బలోపేతం కావడానికి ప్రపంచ దేశాలు సర్వశక్తులొడ్డుతున్నాయి. దేశ బడ్జెట్‌లలో అత్యధిక భాగాన్ని రక్షణపై వెచ్చిస్తున్నాయి. ప్రపంచంలో సైనిక శక్తులుగా ఎదిగిన.. ఎదుగుతున్న దేశాలపై గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ (జీఎఫ్‌పీ) అనే సంస్థ విస్తృత అధ్యయనం చేసి… ఏ దేశానికి ఎంత సైనిక, ఆయుధ శక్తి ఉందో, రక్షణపై ఏయే దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో సుదీర్ఘ నివేదికను వెలువరించింది. దాదాపు 136 దేశాల సైనిక శక్తులపై ఆ సంస్థ విశ్లేషణలు చేసింది. ఒక దేశానికి ఉన్న వనరులు, ఆర్థిక పరిస్థితులు, భూతల అనుకూలతలు, స్థానిక ఆయుధ పరిశ్రమలు, ప్రభావం లాంటి 55 అంశాలను సంస్థ పరిగణనలోకి తీసుకుంది. జీఎఫ్‌పీ కేటాయించిన ర్యాంకుల్లో భారత్‌ 4వ స్థానంలో ఉండగా… పాక్‌ 17వ స్థానంలో ఉంది.

రెండు దేశాలకు క్షిపణి వ్యవస్థల సామర్థ్యం 
క్షిపణులు, అణ్వాయుధాలు, అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణి వ్యవస్థల సామర్థ్యం ఇరు దేశాలకు ఉంది. 5వేల కిలోమీటర్లలోపు లక్ష్యాలను ఛేదించే అగ్ని-3తో కలిపి ఇటువంటి 9 రకాల క్షిపణి వ్యవస్థలు భారత్‌కు ఉన్నాయి. చైనా సాయంతో పాకిస్థాన్‌ క్షిపణులను తయారు చేసుకుంటోంది. భారత్‌లోని లక్ష్యాలను ఛేదించగలిగే మొబైల్‌ షార్ట్‌, మీడియం రేంజ్‌ ఆయుధాలు పాక్‌ వద్ద ఉన్నాయి. 2,750 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలిగే షహీన్‌ 3తో కలిపి మొత్తం 10 రకాల క్షిపణులు ఉన్నాయి. 

పాక్‌ సైన్యం 6.3లక్షలు – భారత్‌ సైన్యం 13 లక్షలు
స్టాక్‌ హోం ఇంటర్నెషనల్‌ పీస్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌  లెక్కల ప్రకారం పాక్‌ వద్ద సుమారు 140-150 న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ ఉండగా… భారత్‌ వద్ద సుమారు 130-140 ఉన్నాయి. గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ ఇండెక్స్‌ మొత్తం 136 దేశాలను పోలుస్తూ జీఎఫ్‌పీ కేటాయించిన ర్యాంకుల్లో భారత్‌ 4వ స్థానంలో ఉండగా.. పాక్‌ 17వ స్థానంలో ఉంది. భారత జనాభా 128 కోట్లు కాగా పాక్‌ది 20 కోట్లు. వీరిలో దళాలకు అసవరమైన ఫిట్‌నెస్‌తో ఉన్న వారి సంఖ్య భారత్‌లో 48 కోట్లు ఉండగా పాక్‌లో 7.5 కోట్లు మాత్రమే ఉంది. భారత్‌ సైన్యం 13 లక్షలు కాగా పాక్‌ సైన్యం 6.3లక్షలు. ఇక రిజర్వు దళాలను చూస్తే భారత్‌కు 28 లక్షల మంది ఉండగా పాక్‌కు కేవలం 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే భారత్‌ వద్ద మొత్తం దళాల సంఖ్య 42లక్షలకు పైమాటే. ఇక పాక్‌వద్ద మొత్తం కలిపితే 9.19లక్షలు మాత్రమే.

వైమానిక దళం బలాబలాలు..
వైమానిక దళం బలాబలాలను చూస్తే… భారత్‌ దగ్గర మొత్తం 2,185 విమానాలుండగా… పాక్‌ వద్ద 1,281 విమానాలున్నాయి. మన దగ్గర 590 ఫైటర్‌ జెట్లు ఉంటే… పాక్‌ వద్ద 320 ఉన్నాయి. దాడి చేసే విమానాలు మన దగ్గర 804 ఉండగా… దాయాది 410 విమానాలను సమకూర్చుకుంది. రవాణా విమానాలు సంఖ్య 708, 296గా ఉంది. భారత్‌ దగ్గర శిక్షణ విమానాలు 251 ఉండగా… పాక్‌ వద్ద 486 అందుబాటులో ఉన్నాయి. హెలికాప్టర్లు 720, 328. దాడి చేసే హెలికాప్టర్లు మన దగ్గర 15 మాత్రమే ఉంటే… పాక్‌ దగ్గర 49 ఉన్నాయి. ఇక… భారత్‌లో అందుబాటులో ఉన్న ఎయిర్‌పోర్టులు 346 కాగా… పాక్‌లో 151 ఉన్నాయి. భారత్‌ దగ్గర 4,426 ట్యాంకులు ఉండగా… పాక్‌లో 2,182 ఉన్నాయి. సాయుధ పోరాట వాహనాలు 3,147, 2,604. సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ ఆర్టలరీ భారత్‌లో 190 ఉంటే… పాక్‌లో 307 ఉన్నాయి. 4,158 శతఘ్నులు మన సైన్యం దగ్గర ఉంటే… 1,240 శతఘ్నులను పాక్‌ ఆర్మీ కోసం వినియోగిస్తున్నారు. రాకెట్‌ ప్రొజెక్టర్లు ఇక్కడ 266 ఉంటే… అటువైపు 144 ఉన్నాయి.

నావికాదళం బలాలు.. 
నావికాదళం బలాన్ని చూస్తే… భారత్‌ 295, పాక్‌ 197. విమాన వాహక నౌకలు భారత్‌ దగ్గర ఒకటి ఉండగా.. పాక్‌ దగ్గర అసలు లేవు. అలాగే మన దగ్గర 16 జలాంతర్గాములు ఉంటే… పాక్‌లో ఐదే ఉన్నాయి. ఫ్రిగేట్లు 14, 10 కాగా… డెస్ట్రాయర్లు భారత్‌లో 11 ఉంటే.. పాక్‌ సైన్యానికి ఇవి అందుబాటులో లేవు. కొర్వెట్టిలు భారత్‌లో 22 ఉంటే… పాక్ దగ్గర ఒక్కటి కూడా లేవు. పోర్టల్‌ క్రాఫ్ట్‌ఇటువైపు 139 ఉంటే… అటువైపు 11 ఉన్నాయి. ప్రధాన యుద్ధనౌకలు మన దగ్గర నాలుగు.. పాక్ దగ్గర మూడున్నాయి. భారత్‌ వాణిజ్యనౌకా బలగం 1,674 కాగా… పాక్‌లో ఈ సంఖ్య కేవలం 52. ప్రధాన నౌకాశ్రయాలు ఇక్కడ ఏడుంటే… పాక్‌లో రెండే ఉన్నాయి. ఇలా… ఏ రకంగా చూసినా… పాక్‌తో పోలిస్తే… భారత్‌ అత్యంత బలంగా ఉంది.

రెండు దేశాల్లోనూ అణ్వాయుధాలు..
సైనికపరంగా పాకిస్థాన్‌ కన్నా భారత్‌ తొలి నుంచీ పటిష్టమైన స్థితిలో ఉంది. ఇదివరకు ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో మన దేశానిదే పైచేయి కావడానికి ఇదే కారణం. కానీ.. ఆ యుద్ధాలు అణ్వాయుధాలను సమకూర్చుకోకముందు జరిగినవి. ప్రస్తుతం రెండు దేశాల్లోనూ అణ్వాయుధాలున్నాయి. సైనికపరంగా భారత్‌ను ఎదుర్కోవడం కష్టం కాబట్టి… పాక్‌, తన వద్ద ఉన్న అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనుకాడకపోవచ్చు. దానికి ప్రతిగా భారత్‌ కూడా అణ్వాయుధాలను విసిరితే జరిగే నష్టం భారీ ఎత్తున ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నష్టం మానవ ప్రాణాల పరంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా… పలు విధాలా ఉంటుందని చెప్తున్నారు.