Drone Rules, 2021 : డ్రోన్ల వాడకం ఇక సులభం..కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్రం

దేశంలో డ్రోన్ల వాడకం, నియంత్రణ, అనుమతులకు సంబంధించి కేంద్ర నూతన నిబంధనలను రూపొందించింది.

Drone Rules, 2021 : డ్రోన్ల వాడకం ఇక సులభం..కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేంద్రం

Drones2

Drone Rules, 2021 దేశంలో డ్రోన్ల వాడకం, నియంత్రణ, అనుమతులకు సంబంధించి కేంద్ర నూతన నిబంధనలను రూపొందించింది. ఈ మేరకు గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ..2021 డ్రోన్ రూల్స్ పేరిట ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో అమలులోకి వచ్చిన మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ వ్యవస్థ నిబంధనల స్థానంలో వీటిని(కొత్త రూల్స్) తీసుకొచ్చారు. డ్రోన్‌కు సంబంధించిన ఈ నిబంధనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రూపొందించింది. వీటి ప్రకారం..గాల్లో ఎగరే ప్రతి డ్రోన్‌కూ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. డ్రోన్ల తయారీ నుంచి బరువు వరకు చాలా నియమ నిబంధనలను రూపొందించారు.

ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలను ఆగస్టు 5 వరకు తెలియజేయవచ్చని పౌర విమానయాన శాఖ తెలిపింది. విశ్వసనీయత, స్వీయ ధ్రువీకరణ వంటి అంశాల ఆధారంగా వీటిని రూపొందించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. అయితే,మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్(UAS) ట్రాఫిక్ మేనజ్ మెంట్ లేదా డ్రోన్స్ కి సంబంధించిన ఓ పాలసీని తీసుకొచ్చేందుకు ఇటీవల ప్రధాన మోదీ.. కీలక మంత్రులతో చర్చించిన విషయం తెలిసిందే. జమ్మూలో ఇటీవల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్ ల దాడి తర్వాత ప్రధాని ఈ భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీ జరిగిన కొద్ది రోజుల్లో కేంద్రం కొత్త డ్రోన్ పాలసీపి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం డ్రోన్ నిబంధనల ముసాయిదాను మాత్రమే రూపొందించారు. ఇంకా అమల్లోకి తీసుకురాలేదు.

కాగా, 2021 డ్రోన్ రూల్స్ ప్రకారం..సింగిల్ విండో విధానంలో డ్రోన్లకు అనుమతులు జారీ చేస్తారు. ఇందుకోసం డిజిటల్ స్కై ప్లాట్​ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు తాజా ముసాయిదా నిబంధనల్లో పేర్కొన్నారు. చాలా వరకు అనుమతులను మానవ ప్రమేయం లేకుండానే జారీ చేస్తారు. దేశంలో డ్రోన్లు వినియోగించేందుకు గతంలో 25 అప్లికేషన్లను నింపాల్సి ఉండగా.. కొత్త నిబంధనల్లో వీటి సంఖ్యను కేవలం ఐదుకి కుదించారు. చెల్లించాల్సిన ఫీజును సైతం కేంద్రం సవరించింది. డ్రోన్ సైజుతో సంబంధం లేకుండా ఫీజు వసూలు చేయనున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారికి విధించే గరిష్ఠ జరిమానాను రూ. లక్షకు తగ్గించారు. అయితే ఇతర చట్టాల నిబంధనలను ఉల్లంఘిస్తే వాటి ప్రకారమే జరిమానా విధిస్తారు.

యూనిక్ ఆథరైజేషన్ నెంబర్, యూనిక్ ప్రొటోటైప్ ఐడెంటిఫికేషన్ నెంబర్, కన్మర్మెన్స్ సర్టిఫికెట్, మెయింటెనెన్స్ సర్టిఫికెట్, ఇంపోర్ట్ క్లియరెన్స్, ఆపరేటర్ పర్మిట్, స్టూడెంట్ రిమోట్ పైలెట్ లైసెన్స్ వంటి అప్రూవల్స్‌ అవసరం లేకుండానే డ్రోన్లు వినియోగించే అవకాశముంటుంది. డ్రోన్ల తయారీ సంస్థలు సెల్ఫ్ సర్టిఫికెట్ రూట్ ద్వారా డిజిటల్ స్కై ప్లాట్‌‌ఫామ్‌పై డ్రోన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను జనరేట్ చేయవచ్చు.

గ్రీన్ జోన్లలో 400 అడుగులు, ఎయిర్​ పోర్టులకు 8-12 కి.మీ దూరంలో 200 అడుగుల ఎత్తు వరకు డ్రోన్ల సంచారం కోసం ఎలాంటి ఎయిర్​లైన్ అనుమతులు అవసరం లేదు. వాణిజ్యేతర కార్యకలాపాల కోసం వినియోగించే మైక్రో డ్రోన్లు, పరిశోధనాభివృద్ధి సంస్థలు ఉపయోగించే నానో డ్రోన్లకు పైలట్ లైసెన్స్ అవసరం లేదు. కార్గో డెలివరీ కోసం డ్రోన్ కారిడార్ల అభివృద్ధి చేయనున్నారు.స్నేహపూర్వక నియంత్రణ వ్యవస్థ కోసం డ్రోన్ ప్రమోషన్ మండలి ఏర్పాటు చేయనున్నారు. దేశంలో రిజిస్టర్ అయిన విదేశీ సంస్థల డ్రోన్ కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపింది. డ్రోన్ల డీ రిజిస్ట్రేషన్, బదిలీ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.