40రోజుల్లో 69లక్షల మంది జాబ్ కోసం అప్లయ్ చేసుకుంటే, వచ్చింది మాత్రం 691 మందికే.

  • Published By: naveen ,Published On : August 24, 2020 / 11:12 AM IST
40రోజుల్లో 69లక్షల మంది జాబ్ కోసం అప్లయ్ చేసుకుంటే, వచ్చింది మాత్రం 691 మందికే.

దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పేందుకు ఇదో నిదర్శనం. అందరికి ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది. జూలై 11న దేశ ప్రధాని నరేంద్ర మోడీ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్(Aatmanirbhar Skilled Employee Employer Mapping-ASEEM) ను ప్రారంభించారు. 40 రోజుల్లోనే ఈ పోర్టల్ లో 69లక్షల మంది జాబ్ కోసం అప్లయ్ చేసుకున్నారు. కానీ ఉద్యోగాలు పొందిన వారి సంఖ్య చాలా దారుణంగా ఉంది. కేవలం 691మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి అతిపెద్ద రాజకీయ ఆర్థిక సవాల్ గా మారిందని చెప్పాలి. అదే సమయంలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యం కలిగిన వారు దొరకడం లేదు.



కేవలం వారం రోజుల వ్యవధిలో అంటే ఆగస్టు 14 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు, 7లక్షల మందికిపైగా పోర్టల్ లో జాబ్స్ కోసం అప్లయ్ చేసుకున్నారు. కానీ అందులో 61మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ పోర్టల్ డేటా ప్రకారం, 3.7లక్షల మందిలో 2శాతం మందికే ఉద్యోగాలు దొరికాయి. ఇక 69లక్షల మంది వలస కూలీలు జాబ్ కోసం రిజిస్టర్ చేసుకోగా, 1.49లక్షల జాబ్ లు ఆఫర్ చేశారు. అయితే కేవలం 7వేల 700మంది మాత్రమే ఉద్యోగంలో చేరారు.

ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు వలస కూలీలు మాత్రమే కాదు. స్వయం ఉపాధి పొందుతున్న టైలర్లు, ఎలక్ట్రిషియన్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు, సీవింగ్ మెషిన్ ఆపరేటర్లు ఉన్నారు. కాగా, కొవియర్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్, నర్సులు, అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్స్, మ్యానువల్ క్లీనలర్స్, సేల్స్ అసోసియేట్స్ కు భారీగా డిమాండ్ ఉంది. కర్నాటక, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్కర్ల కొరత తీవ్రంగా ఉన్నట్టు పోర్టల్ లోని డేటా ద్వారా తెలుస్తుంది. మార్చి నుంచి లాక్ డౌన్ విధించాలక ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా వలసలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వలస కార్మికులు సొంతూళ్లకు(ఉత్తరప్రదేశ్, బీహార్) వెళ్లిపోయారు.



ఉద్యోగాలు కోసం అప్లయ్ చేసుకున్న వారి సంఖ్య ఒక వారం(ఆగస్టు 14-21) వ్యవధిలో 80శాతం పెరిగింది. 2.97 నుంచి 3.78లక్షలకు పెరిగింది. కానీ ఉద్యోగాలు చేరిన వారి సంఖ్య కేవలం 9.87శాతం(7వేల 9మంది నుంచి 7వేల 700మంది) మాత్రమే పెరుగుదల ఉంది. ఆగస్టు 21 నాటికి పోర్టల్ లో జాబ్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 11.98శాతం పెరిగింది. అంటే 61.67 లక్షల నుంచి 69లక్షలకు పెరిగింది.

జూన్ లలో 116 జిల్లాల్లో గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ అభియాన్ ను ప్రధాని ప్రారంభించారు. ఇందులో 5.4శాతం మంది మహిళలు జాబ్స్ కోసం అప్లయ్ చేసుకున్నారు. మొత్తం 514 కంపెనీలు పోర్టల్ లో రిజిస్టర్ చేయించుకున్నాయి. అందులో 443 కంపెనీలు 2.92 లక్షలు జాబ్స్ ఇచ్చాయి. వారాంతానికి కనీసం ఒక జాబ్ అయిన ఇచ్చిన కంపెనీల సంఖ్య 419 నుంచి 443కి పెరిగింది.



లాజిస్టిక్స్(సరకు రవాణ), హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రిటైల్, కన్ స్ట్రక్షన్ రంగాల్లో ఎక్కువగా జాబ్స్ లభించాయి. 73.4శాతం ఉద్యోగాలు ఈ రంగాల నుంచే ఉన్నాయి. ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ నుంచి పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. 77శాతం ఉద్యోగాలు ఐదు రాష్ట్రాల నుంచే ఉన్నాయి. అవి కర్నాటక, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, తమిళనాడు.

దేశం అభివృద్ది బాటలో పయనిస్తోంది, ఈ విషయంలో నైపుణ్యం కలిగిన యువత ప్రముఖ పాత్ర పోషించనుందని స్కిల్ డెవలప్ మెంట్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి మహేంద్ర నాధ్ పాండే ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్లో సప్లయ్, డిమాండ్ కు అనుసంధానంగా స్కిల్ డెవలప్ మెంట్ పోర్టల్ పని చేస్తుందన్నారు. ఉత్పత్తిని పెంచడంలో నైపుణ్యం కలిగిన యువత తోడ్పాటు అందిస్తుందని, పరిశ్రల్లో మెరుగైన ఫలితాల సాధనకు ఉపయోగపడుతుందని ఆయన నమ్మకంగా చెప్పారు.