Community service: కొత్త బిల్లు.. దేశంలో ఇలాంటి చిన్నపాటి నేరాలకు పాల్పడితే ఏయే శిక్షలు విధిస్తారో తెలుసా?
చిన్న తప్పులు చేసి నేరం రుజువైతే సమాజ సేవ శిక్షను విధించే అంశం భారతీయ న్యాయ సంహిత బిల్లులో ఉంది.

India
Community service – India: చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే ఇప్పటివరకు దేశంలో మరణ శిక్ష, జైలు శిక్ష, ఆస్తుల జప్తు, జరిమానాలు వంటివి విధిస్తున్నారు. కొన్ని దేశాల్లో దోషులతో సమాజ సేవను కూడా చేయించే శిక్షలు ఉన్నాయి.
ఇప్పుడు భారత్‌లోనూ సమాజ సేవ చేయించే శిక్షను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita BNS), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య పేర్లతో మూడు కొత్త బిల్లులను ఇటీవలే లోక్‌సభ(Lok Sabha)లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వాటిని పార్లమెంటరీ స్థాయి సంఘానికి పంపారు.
చిన్న తప్పులు చేసి నేరం రుజువైతే సమాజ సేవ శిక్షను విధించే అంశం భారతీయ న్యాయ సంహిత బిల్లులో ఉంది. ఆత్మహత్యాయత్నం, వ్యాపార, వాణిజ్యాల్లో ప్రభుత్వ ఉద్యోగులు చట్టవిరుద్ధంగా పాలుపంచుకోవడం, రూ.5 వేల కన్నా తక్కువ నగదు, వస్తువులు చోరీ చేయడం, పరువు నష్టం తదిరత నేరాల వంటివికి సమాజ సేవ శిక్షను విధించే అవకాశం ఉంది.
ఇప్పటికే పాశ్చాత దేశాల్లో ఇటువంటి శిక్షలు అమలవుతున్నాయి. అమెరికాలో ఇటువంటి శిక్షలు విధించడం సాధారణమైపోయింది. సమాజ సేవ శిక్ష అంటే బహిరంగ ప్రదేశాల్లోని చెత్తను తీసేయడం, ఆరోగ్య కేంద్రాలు, మునిసిపాలిటీ వంటి సంస్థల సిబ్బంది చేసే పనులు చేయడం వంటివి చేయాల్సి ఉంటుంది. అలాగే, విద్య గురించి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేయాలి.
అలాగే, కౌన్సెలింగ్ క్లాసులకు హాజరుకావాలి. తొలిసారి దేశంలో సమాజ సేవను శిక్షలను కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాలోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఇప్పటికే దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు వంటి విషయాల్లో అందుకు తగ్గ సమాజ సేవ శిక్షను విధిస్తున్నారు. అయితే, మౌఖికంగా అటువంటి శిక్షలు విధిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. దేశ చట్టంలో ఇటువంటి నిబంధన లేదని, తాము దాన్ని చట్టంలో తీసుకువస్తున్నామని ఇప్పటికే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
PM Modi: దేశ ప్రజల్ని అలా పడుకోనివ్వనని శపథం చేసిన ప్రధాని మోదీ