Indians At Dubai : దుబాయ్‌‌లో భారీ సంఖ్యలో ఇళ్లు కొనేస్తున్న భారతీయులు

దుబాయ్‌లో భారతీయులు చాలా ఈజీగా ఇళ్లు కొనేస్తున్నారు. కొనే ఇల్లు అలాంటిలాంటి ప్రాంతంలో కాదు. ఏకంగా మినిమం బుర్జ్ ఖలీఫాకు దగ్గర్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లెక్క ఎంతైనా ఫరవాలేదు. ఇల్లు మాత్రం అద్దిరిపోయేలా ఉండాలనుకుంటున్నారు. మన సంపన్నుల దూకుడుకు.. దుబాయ్ రియల్ ఎస్టేట్‌ ఓ రేంజ్ కు చేరింది.

Indians At Dubai : దుబాయ్‌‌లో భారీ సంఖ్యలో ఇళ్లు కొనేస్తున్న భారతీయులు

Indians At Dubai

Indians At Dubai : దుబాయ్‌లో భారతీయులు చాలా ఈజీగా ఇళ్లు కొనేస్తున్నారు. కొనే ఇల్లు అలాంటిలాంటి ప్రాంతంలో కాదు. ఏకంగా మినిమం బుర్జ్ ఖలీఫాకు దగ్గర్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. లెక్క ఎంతైనా ఫరవాలేదు. ఇల్లు మాత్రం అద్దిరిపోయేలా ఉండాలనుకుంటున్నారు. మన సంపన్నుల దూకుడుకు.. దుబాయ్ రియల్ ఎస్టేట్‌కి పట్టిన దరిద్రమంతా వదిలిపోయింది.

రేటు గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఖరీదైన నగరంలో.. ఏదో ఓ మూలన ఉండటానికి కూడా ఇష్టపడటం లేదు. భారతీయ సంపన్నుల చూపంతా.. ఇప్పుడు దుబాయ్ మీద పడింది. అక్కడ కూడా ఓ ఇల్లు కొనిపడేస్తున్నారు. అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నోళ్లు కొందరుంటే.. ఇల్లు కొని.. అద్దెకిస్తున్న వాళ్లూ ఉన్నారు. ఉన్నత ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల అడ్రస్ అంతా ఇప్పుడు దుబాయ్‌కి మారిపోతోంది. ఇళ్ల కొనుగోలు కోసం.. ఒక్క 2022లోనే 35 వేల 500 కోట్లు ఖర్చు చేశారు. 2021తో పోలిస్తే.. ఇది డబుల్ అయిందని చెప్పొచ్చు. ఏడాదిలోనే.. దుబాయ్‌లో ఇళ్లు కొనే భారతీయ సంఖ్య రెట్టింపు కావడం ఆశ్చర్యపరుస్తోంది. ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్‌ నగరాలకు చెందిన సంపన్నులతో పాటు పంజాబీలు సైతం.. దుబాయ్‌లో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. అక్కడ మనోళ్లు కొంటున్న ఇళ్ల విలువ.. మూడున్నర కోట్ల నుంచి 4కోట్ల దాకా ఉంటోంది. వీటిని అద్దెకు ఇస్తే.. నెలకు మూడున్నర లక్షల దాకా రెంట్ వస్తోంది.

బిజినెస్‌లని, ఉద్యోగాలని.. దుబాయ్‌కి వెళ్లే వాళ్లున్నారు. అలాగే.. రిలాక్సేషన్ కోసం.. వెళ్లే వాళ్ల సంఖ్య కూడా ఈ మధ్య బాగా పెరిగింది. పైగా.. దుబాయ్ అందరికీ ట్రావెల్ హబ్‌గా ఉండటంతో.. పెద్ద మొత్తంలో టూరిస్టులను సైతం ఆకర్షిస్తోంది. అంతకుమించి.. మంచి బిజినెస్‌ సెంటర్‌గానూ ఉండటంతో.. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ బిజినెస్.. ఫుల్ స్వింగ్‌లో నడుస్తోంది. ఇళ్ల ధరలు.. మన దేశంలోని ముంబైతో పోలిస్తే కాస్త అటు ఇటుగా ఉన్నాయ్. దాంతో.. దుబాయ్‌లో ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఇండియన్ బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. పైగా.. అక్కడ ఇళ్లు కొంటున్న వారిలో.. అక్కడే స్థిరపడిన భారతీయులు, ఎన్ఆర్ఐలతో పోలిస్తే.. భారత్‌లో నివసిస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దుబాయ్‌లో అద్దెల ద్వారా వచ్చే ఆదాయం బాగానే ఉంటోందని.. అక్కడి రియల్టర్లు చెబుతున్నారు. ముంబై మాదిరిగానే.. అద్దెల్లో ఏటా 4 నుంచి 5 శాతం వృద్ధి ఉండటం కూడా కలిసొస్తోంది. దాంతో.. చాలా మంది సంపన్నులు దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో.. విల్లా కొనాలంటే 7 నుంచి 8 కోట్లు ధర పలుకుతోంది. అదే.. దుబాయ్‌లో అయితే.. మూడున్నర నుంచి 4 కోట్ల లోపే.. లగ్జరీ ఫ్లాట్ గానీ, ఇల్లు గానీ వచ్చేస్తోంది. దాంతో.. హైదరాబాద్‌లోనూ.. దుబాయ్‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా? టైపు యాడ్స్ మొదలైపోయాయ్. పైగా.. సైట్ విజిట్ కోసం.. ఫ్రీ ట్రిప్స్ కూడా వేస్తున్నాయ్ కొన్ని రియాల్టీ కంపెనీలు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి మరీ.. ఇళ్ల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న వాళ్లని దుబాయ్ తీసుకెళ్తున్నారు. అక్కడ ఇళ్లతో పాటు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఈ మధ్య.. హైదరాబాద్‌లో ఈ తరహా యాడ్స్ బాగా కనిపిస్తున్నాయ్.

ఇక.. లగ్జరీ లైఫ్ కోసం దుబాయ్‌ వెళ్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది. ఈ లిస్టులో.. వ్యాపార, పారిశ్రామికవేత్తలు ఎక్కువగా ఉన్నారు. విలాసవంతమైన జీవనం కోసం, తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు.. దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. బుర్జ్ ఖ‌లీఫాతో పాటు.. ఆకాశాన్నంటే రీతిలో ఇండ్లు, షాపింగ్ మాల్స్‌తో దుబాయ్ టూరిస్ట్ హ‌బ్‌గా నిలుస్తోందని.. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ గణాంకాలు చెబుతున్నాయ్. కార్పొరేట్ సంస్థల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న ప్రొఫెషనల్స్ కూడా దుబాయ్‌లో ఆస్తుల కొనుగోళ్లపై ఫోకస్ పెట్టారు. ప్రపంచ దేశాలన్నింటికీ.. దుబాయ్ వారధిగా నిలవడమే ఇందుకు కారణమనే టాక్ వినిపిస్తోంది. చాలా మంది భారతీయ కుబేరులు సైతం.. ఇండియాలోని మెట్రో నగరాల నుంచి దుబాయ్‌కి షిఫ్ట్ అయిపోతున్నారు. లగ్జరీ లైఫ్ కోసం.. కోట్లు పెట్టి ఇండ్లు, అపార్ట్‌మెంట్లు కొనేస్తున్నారు.

కరోనాకు ముందు 2019లో.. ఏడాది మొత్తం కలిపి ఎన్ని ఇళ్లు విక్రయించారో.. ఇప్పుడు ఒక్క నెలలోనే అన్ని ఇళ్లను అమ్ముతున్నాయ్ దుబాయ్ రియాల్టీ కంపెనీలు. పైగా.. అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో 15 నుంచి 20 శాతం వాటా భారతీయులదే. అంతేకాదు.. దుబాయ్‌లో ఇళ్లు కొన్న విదేశీయుల్లో.. భారతీయుల వాటా 40 శాతంగా ఉంది. ఇది చాలు.. ఇండియన్స్ దుబాయ్‌లో ఏ రేంజ్‌లో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారో చెప్పడానికి. అక్కడి ప్రభుత్వం కూడా భారతీయులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలోకి వెళితే.. అక్కడ మినీ ఇండియా కనిపిస్తుంది. భారత్‌కు చెందిన పాపులర్ బిజినెస్‌మ్యాన్స్, పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతంలో లగ్జరీ ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇండియన్స్ మాత్రమే కాదు.. రష్యన్లు, బ్రిటీషర్లు, చైనీస్, పాకిస్థానీలు కూడా దుబాయ్‌లో బాగానే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు.