Assembly Elections 2023: రాజస్థాన్‭లో విచిత్రమైన సంప్రదాయం.. రవాణా మంత్రిగా పని చేస్తే రాజకీయానికి ముగింపే!

1993 నుంచి 2018 వరకు జరిగిన ఐదు ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గెహ్లాట్‌ మంత్రులు ఈ ఎన్నికల్లో ఈ అపోహను బద్దలు కొట్టగలరా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Assembly Elections 2023: రాజస్థాన్‭లో విచిత్రమైన సంప్రదాయం.. రవాణా మంత్రిగా పని చేస్తే రాజకీయానికి ముగింపే!

Rajasthan Politics: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు నవంబర్ 25వ తేదీన తమ ఓటు ద్వారా ద్వారా ఎవరికి అధికారమో, ఎవరు విపక్షమో నిర్ణయిస్తారు. ఇక పోలింగ్ ముగిసిన వారం రోజుల తర్వాత అంటే డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ప్రచారం ఇప్పటికే హాట్ హాటుగా సాగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ ఉంది.

ఇక రాజస్థాన్ ఎన్నికల రాజకీయాల్నీ ప‌రిశీలిస్తే అనేక ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు, ట్రెండ్‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఏ నాయకుడూ తన తదుపరి ఎన్నికల్లో విజయం సాధించలేకపోవడం అందులో ఒకటి. బీజేపీ ప్రభుత్వంలో అయినా, కాంగ్రెస్‌లో రవాణా శాఖా మంత్రి అయినా సరే.. 1993 నుంచి 2018 వరకు జరిగిన ఐదు ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గెహ్లాట్‌ మంత్రులు ఈ ఎన్నికల్లో ఈ అపోహను బద్దలు కొట్టగలరా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు రవాణా శాఖ మంత్రులు
రాజస్థాన్‌లో గెహ్లాట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసారాను రవాణా మంత్రిగా చేశారు. దోటసార ఈ పదవిని 24 డిసెంబర్ 2018 నుంచి 20 నవంబర్ 2021 వరకు నిర్వహించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండడంతో దోటసార మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బ్రిజేంద్ర ఓలాకు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

ఘర్షణ ఉంటుంది
జుంజును నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రవాణా శాఖ మంత్రి బ్రిజేంద్ర ఓలాను బరిలోకి దించగా, బీజేపీ బబ్లూ చౌదరికి టికెట్ ఇచ్చింది. అదే సమయంలో, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోటసార, బీజేపీకి చెందిన సుభాష్ మహరియా సికార్‌లోని లక్ష్మణ్ ఘర్ స్థానంలో ఒకరినొకరు ఎదుర్కొంటున్నారు.

గత ఐదు ఎన్నికల ట్రెండ్
1993: బన్సూర్ నుంచి ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయిన రోహితాష్ శర్మ, బీజేపీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1998లో శర్మ బన్సూర్ నుండే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
1998: కాంగ్రెస్ ప్రభుత్వంలో చోగరం బకోలియా, బన్వారీ లాల్ బైరవ రవాణా మంత్రులుగా చేశారు. 2003 ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు.
2003: బీజేపీ ప్రభుత్వంలో యూనస్ ఖాన్ రవాణా మంత్రిగా నియమితులయ్యారు. 2008లో యూనస్ దిద్వానా నుంచి ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు.
2008: కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రిజ్‌కిషోర్ శర్మ, వీరేంద్ర బెనివాల్‌లు రవాణా మంత్రులుగా నియమితులయ్యారు. అయితే 2013 ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
2013: బీజేపీ మళ్లీ యూనస్ ఖాన్‌ను రవాణా మంత్రిని చేసింది. 2018లో టోంక్ నుంచి సచిన్ పైలట్‌పై పోటీ చేసి మరోసారి ఓటమిని చవిచూశారు.