India-Pakistan Cricket Match : నేడు మరోసారి తలపడనున్న భారత్‌-పాక్‌

వారం తిరిగేలోపే మరో బ్లాక్‌ బస్టర్‌ బ్యాటిల్‌కు ఇండియా-పాకిస్థాన్‌ జట్లు రెడీ ఐపోయాయి. చిరకాల ప్రత్యర్థులు పోరుకు మరోసారి దుబాయ్‌ వేదిక కానుంది. ఆసియాకప్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 7గంటల 30నిమిషాలకు ఇరు జట్ల మధ్య సూపర్-4 సమరం జరుగనుంది.

India-Pakistan Cricket Match : నేడు మరోసారి తలపడనున్న భారత్‌-పాక్‌

India-Pakistan cricket match

India-Pakistan Cricket Match : వారం తిరిగేలోపే మరో బ్లాక్‌ బస్టర్‌ బ్యాటిల్‌కు ఇండియా-పాకిస్థాన్‌ జట్లు రెడీ ఐపోయాయి. చిరకాల ప్రత్యర్థులు పోరుకు మరోసారి దుబాయ్‌ వేదిక కానుంది. ఆసియాకప్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 7గంటల 30నిమిషాలకు ఇరు జట్ల మధ్య సూపర్-4 సమరం జరుగనుంది. ఇప్పటికే లీగ్ దశలో ఇరు జట్లు తలపడగా.. ఉత్కంఠ పోరులో దాయాదిని టీమిండియా ఓడించింది. లీగ్‌లో భారత్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో పాకిస్థాన్ కనిపిస్తుండగా.. లీగ్ మ్యాచ్‌ ఫలితాన్ని మరోసారి రిపీట్‌ చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఇక వారం రోజుల్లోనే రెండోసారి ఇండియా-పాక్‌ మ్యాచ్‌ జరగడం.. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఆదివారం జరిగే ఫైనల్లో కూడా ఇరు జట్లు ఢీకొనే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే రెండు దేశాల క్రికెట్ అభిమానులకు పండగే పండుగ.

మరోవైపు ఇరు జట్లను గాయాల బాధ వెంటాడుతోంది. గాయంతో రెండు జట్లకు చెందిన కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. లాస్ట్‌ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అలరించిన రవీంద్ర జడేజా గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంలేదు. పాకిస్థాన్ కూడా షాహిన్ అఫ్రిదితో సహా పలువురు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోయింది. అయితే రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవ లేదనే చెప్పాలి. వారు సామర్థం మేరకు రాణిస్తే దాయాదిల మధ్య పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

అటు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా బ్యాలెన్స్‌గా కనిపిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. అయితే కెఎల్ రాహుల్ ఫామ్ జట్టును కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ రాహుల్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరముంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తనదైన స్టైల్‌లో బ్యాటింగ్‌ చేయడంలేదు.

ఇటు హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన విరాట్ కోహ్లి, సూర్యకుమార్‌ టీమిండియాకు కీలకంగా మారారు. కోహ్లి ఆడిన రెండు మ్యాచుల్లోనూ మంచి బ్యాటింగ్‌ చేశాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక హాంకాంగ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పాకిస్థాన్‌పై కూడా చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. వీరిద్దరూ తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిచితే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. అటు రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యతో భారత్ బ్యాటింగ్ యమ స్ట్రాంగ్‌గా ఉంది.

మరోవైపు టీ20లో ప్రమాదకర జట్టుగా పేరున్న పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం. లాస్ట్‌ మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ చివరి వరకు భారత్‌కు గట్టి పోటీనే ఇచ్చింది. ఇక హాంకాంగ్‌పై రికార్డు విజయం సాధించడంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈసారి మరింత మెరుగైన ఆటను కనబరచాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాకిస్థాన్ భారత్‌కు ఏ మాత్రం తీసిపోదు కూడా. రిజ్వాన్, ఫకర్ జమాన్, కెప్టెన్ బాబర్, ఖుష్‌దిల్ షా, ఇఫ్తికార్ తదితరులతో పాక్ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. అటు నవాజ్, షాదాబ్, నసీమ్, రవూఫ్‌లతో కూడా పటిష్టమైన బౌలింగ్ లైనప్ కూడా పాక్‌కు ఉండడం ప్లస్‌ పాయింట్‌. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌ హోరాహోరిగా సాగడం పక్కా..!