#ShameOnIndiGo : ప్రయాణికులందరి లగేజీ మరిచి దేశం దాటిన ఇండిగో

  • Published By: venkaiahnaidu ,Published On : September 17, 2019 / 09:30 AM IST
#ShameOnIndiGo : ప్రయాణికులందరి లగేజీ మరిచి దేశం దాటిన ఇండిగో

ప్రముఖ దేశీయ విమాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.షేమ్ ఆన్ ఇండిగో హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు సాంకేతిక లోపంతో విమానాలు బ్రేక్‌డౌన్ అవుతుండగా మరికొన్ని విమానాలు ఇతర కారణాలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. తాజాగా జరిగిన మరోఘటనతో ఇండిగో ఎయిర్‌లైన్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. 

ఆదివారం(సెప్టెంబర్-15,2019)  ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ బయలుదేరిన ఇండిగో విమానం ప్రయాణికులందరి లగేజ్‌ను ఢిల్లీలోనే మర్చిపోయింది. ఇస్తాంబుల్ చేరుకున్న తర్వాత ప్రయాణికులందరూ తమ లగేజ్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏ ఒక్క ప్రయాణికుడి లగేజీ లేకపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది.

ఇండిగో బాధ్యత మరిచి ఇలా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్మయ్ అనే ఓ ప్రయాణికుడు జరిగిన ఘటనలపై ప్రపంచానికి తెలిసేలా తన ట్విటర్‌లో షేర్ చేశాడు. తాము ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కు ఇండిగో విమానం 6E 11లో వచ్చినట్లు తెలిపాడు. ఇక విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవగానే తామంతా దిగి లగజే బెల్ట్ దగ్గర వేచిచూస్తున్న సమయంలో ఇండిగో సిబ్బంది ఓ పేపర్ ముక్క చేతిలో పెట్టారని చెప్పాడు. లగేజీని విమానంలో లోడ్ చేయడం సిబ్బంది మరిచింది. ఒక్క ప్రయాణికుడి లగేజీ కూడా లోడ్ చేయకుండానే విమానం ఇస్తాంబుల్‌ కు బయలు దేరిందని తెలిపాడు. ప్రయాణికులకు ఇచ్చిన పేపర్ ముక్కలో క్షమించాల్సిందిగా రాసి ఉందని చెబుతూ ఆ పేపర్ ముక్కను ఫోటో తీసి ట్విటర్‌లో పోస్టు చేశాడు. షేమ్‌ ఆన్ఇండిగో అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వడంతో అది ట్రెండ్ అవుతోంది.

ఒక అంతర్జాతీయ సర్వీసును నడిపే ఇండిగో సంస్థ ఇంత బాధ్యతారాహిత్యంతో ఎలా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. ఒకరి లగేజీ మరిచిందంటే ఏదో పొరపాటు అనుకోవచ్చు.. కానీ విమానంలోని మొత్తం ప్రయాణికుల లగేజీని లోడ్ చేయడం మరిచిపోవడమంటే అది బాధ్యతారాహిత్యమే అని ఆగ్రహం వ్యక్తం చేశాడు చిన్మయ్. ఢిల్లీలోని ఇండిగో ఆపరేషన్స్ శాఖ ఏం చేస్తోందంటూ ప్రశ్నించాడు.

ఐశ్వర్య గడ్కరీ మరో ప్రయాణికురాలు ట్వీట్‌  చేస్తూ.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న సోదరుడికివ్వాల్సిన మందులు లగేజీలో ఉండిపోయాయనీ, సమయానికి ఆ మందు తీసుకోకపోతే…మళ్లీ ఫిట్స్ వచ్చి అతను చనిపోయే అవకాశం కూడా వుందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  ఇండిగో  స్పందించడం లేదని,  తక్షణమే  సహాయం చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేసింది. మరో వ్యక్తి ..ఇంధనం ఆదాచేసేందుకే ఇండిగో యాజమాన్యం తమ లగేజీలను లోడ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు.