దేశంలో ఇదే ఫస్ట్..మధ్యప్రదేశ్ లో కరోనా సోకి డాక్టర్ మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : April 9, 2020 / 03:53 PM IST
దేశంలో ఇదే ఫస్ట్..మధ్యప్రదేశ్ లో కరోనా సోకి డాక్టర్ మృతి

కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయకున్నా ఆయన ఈ మహమ్మారి కారణంగా మరణించాడు. ఈ విషయం తెలిసి స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.

ఏకంగా డాక్టర్ మరణించడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇటీవల అనారోగ్యానికి గురైన డాక్ట‌ర్ శ‌త్రుఘ్న పంజ్‌వానీ(62)కి పరీక్షలు చేయగా కరోనా సోకినట్టు నిర్థారణ అయింది. ఐసోలేషన్‌లో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి గురువారం ఉదయం ఇండోర్ హాస్పిటల్ లో మరణించాడు.

కరోనా డ్యూటీలో ఆయన లేనప్పటికీ అతనికి వైరస్ సోకింది. ఈయన స్థానికంగా ఫేమస్ ఫిజిషియన్. ఎక్కువగా మురికివాడల్లో ఉండే వారికే ఆయన వైద్యం చేస్తూ ఉంటాడు. దీంతో వారిలో ఎవరి నుంచైనా సోకి ఉంటుందని తోటి డాక్టర్లు అనుమానిస్తున్నారు. కాగా మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరంతా ఆస్ట్రేలియాలోనే ఉంటున్నారు. కాగా ఇండోర్‌లో ఇప్పటివరకు 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 16 మంది చనిపోయారు.