Karnataka: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చిత్రమైన హామీలు.. ఆసక్తికర విన్యాసాలు

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు వరాల వరద పారిస్తున్నాయి.

Karnataka: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో చిత్రమైన హామీలు.. ఆసక్తికర విన్యాసాలు

Karnataka Assembly Election 2023: కర్ణాటక కదనరంగం ఆసక్తికరంగా మారుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వివాదాలు రాజుకుంటున్నాయి. ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు పార్టీలన్నీ అనేక రకాల ఎత్తులు వేస్తూ, సరికొత్త వ్యూహాలు రచిస్తూ గెలుపు కోసం పోరాడుతున్నాయి.

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వచ్చేనెల 10న ఎన్నికలు జరగనుండగా, ప్రధాన పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తూ పోటీకి రెడీ అవుతున్నాయి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కులాలు, మతాల వారీగా లెక్కలు వేసుకోవడమే కాకుండా.. రైతులు, ఆటోడ్రైవర్లు, కార్మికులు… ఇలా రకరకాల వర్గాల వారీగా ఈక్వేషన్లు చూసుకుంటూ వరాల వరద పారిస్తున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ.. అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలను ఓడించి సత్తాచాటాలని జేడీఎస్ పోటాపోటీగా ఇస్తున్న హామీలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.

రైతు బిడ్డను పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షల కన్యాశుల్కం
ఎన్నడూ లేనివిధంగా ఈ సారి రైతు సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారుతున్నాయి. సాగునీరు, ఎరువులు, విత్తనాలు వంటి సమస్యలైతే కామన్‌గానే చూసేవారంతా.. కానీ ఈ సారి కాస్త విచిత్రమైన సమస్య ఎన్నికల అంశంగా మారింది. వ్యవసాయం చేస్తున్న రైతుల కుమారులకు వివాహాలు జరగకపోవడం అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఎక్కడకు వెళ్లినా ఈ సమస్యపైనే చెబుతున్నారంటూ జేడీఎస్(JDS) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ ఇష్యూని ఎన్నికల అంశంగా మార్చేశారు. ఇదో సామాజిక సమస్య.. దేశానికి అన్నంపెట్టే రైతన్నలకు వివాహం కాకపోతే ఎలా అంటూ.. ఆడపిల్లల తల్లిదండ్రులను ఆకట్టుకునేలా ఓ ఆఫర్ ఇచ్చారు కుమారస్వామి. వ్యవసాయం చేస్తున్న రైతు పిల్లలను పెళ్లి చేసుకుంటే.. ఆడపిల్ల తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు పారితోషికం ఇస్తామని కుమారస్వామి ప్రకటించడం కన్నడ నాట సరికొత్త చర్చకు దారితీసింది. ఇన్నాళ్లు ఇదో సమస్య కాదనుకున్న వారంతా కుమారస్వామి ప్రకటనతో బాగా కనెక్ట్ అవుతున్నారు. ఔను.. నిజమే కదా.. వ్యవసాయం(Agriculture) చేస్తున్నారనే కారణంతో పెళ్లి చేసుకోకపోతే ఎలా అంటూ చర్చించుకుంటున్నారు జనం. అంతేకాదు కుమారస్వామి హామీతో ఎన్నికల్లో రైతుల సమస్యలకు ప్రముఖంగా చోటు దక్కినట్లైంది.


ఆటోవాలా జిందాబాద్ అంటున్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్

ఇక కన్నడనాట పార్టీలన్నీ ఆటోవాలాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమూ ఈ ఏట హైలెట్‌గా మారుతోంది. ప్రతి ఓటు ఎంతో కీలకంగా భావిస్తూ ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసే లిస్టులో ఆటోడ్రైవర్లు ఉన్నారని.. వారిని ప్రసన్నం చేసుకుంటే ఎక్కువ ఓట్లు దక్కించుకోవచ్చని లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న బేధం లేకుండా ఆటోడ్రైవర్లకు దగ్గరయ్యేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. హామీలు కురిపిస్తున్నాయి. తమను గెలిపిస్తే ఆటోడ్రైవర్లకు నెలనెలా రెండు వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు జేడీఎస్ నేత కుమారస్వామి. పంచరత్న యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్న కుమారస్వామి హామీలు ఇవ్వడంలో చాలా స్పీడు చూపిస్తున్నారు. రైతు బిడ్డలను పెళ్లి చేసుకుంటే ఎదురుకట్నం చెల్లిస్తామన్న కుమారస్వామి(HD Kumaraswamy) హామీ ఎంతలా చర్చకు దారితీసిందో.. ఆటో డ్రైవర్లకు నెలనెలా సాయం ప్రకటించడం అంతే కాకపుట్టిస్తోంది.

కర్ణాటకలో 7.7 లక్షలు ఆటోలు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది. కానీ, 6 లక్షల ఆటోలు రోజూ సర్వీసు చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆటోవాలా కుటుంబంలో నలుగురి ఓట్లు ఉన్నాయని అనుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఓట్లు సాధించొచ్చని లెక్కలేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఒక్కో నియోజకవర్గంలో గరిష్టంగా పది వేల వరకు ఆటో డ్రైవర్ల కుటుంబాల ఓట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఏ అభ్యర్థి తలరాత మార్చే సత్తా అయినా ఆటోవాలా కుటుంబాలకు ఉంటుందనే లెక్కలతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్(Congress Party) కూడా ఆటోడ్రైవర్లను ప్రసన్నం చేసుకోడానికి రంగంలోకి దిగాయి. కుమారస్వామి నెలకు రెండు వేలు ఇస్తామంటే.. బీజేపీ (BJP) ఇప్పటికే అమలు చేస్తున్న ఆటోడ్రైవర్ పిల్లలకు ఇస్తున్న విద్యా నిధి పథకాన్ని గుర్తు చేస్తోంది. ఇక కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) బెంగళూరులో కాకీ చొక్కావేసుకుని ఆటో నడుపుతూ.. ఆటోవాలా భాయి.. భాయి అంటున్నారు.

Also Read: బీజేపీలో చేరితేనే తన బిడ్డను కాపురానికి పంపిస్తానంటూ అల్లుడికి ఝలక్ ఇచ్చిన మామ.. ఎక్కడంటే..?

పార్టీలు అన్నీ ఆటోవాలా ఓట్లను ఆకర్షించేందుకు పోటీపడటానికి మరో ముఖ్య కారణం ఉంది. ప్రతి నియోజకవర్గంలో సగటున పది వేల వరకు ఆటోడ్రైవర్ కుటుంబ ఓట్లు ఉంటే.. వారి ఆటోల్లో తిరిగే ప్రజలను ఆటోడ్రైవర్లు ప్రభావితం చేయగలరని నమ్ముతున్నాయి పార్టీలు. ఆటోడ్రైవర్ల మాక్ కేంపైనింగ్‌ ఓటర్లపై మంచి ఎఫెక్ట్ చూపుతుందని లెక్కలు వేసుకుంటున్నాయి పార్టీలు. ఈ అంచనాలు.. కూడికలు తీసివేతలతో తాజా ఎన్నికలు ఆటోడ్రైవర్లను సెంటర్ ఆఫ్ ద ఇంటరెస్ట్‌గా మార్చేశాయి.

Also Read: మేము ఇతర పార్టీల్లా కాదు.. బీజేపీ ఈ ప్రయోగాలు చేస్తోంది: సీటీ రవి

అమూల్ వర్సస్ నందిని
తాజా ఎన్నికల్లో వరాలే కాదు వివాదాలు ప్రధాన అంశంగా మారుతున్నాయి. పెరుగు పేరు మార్పుపై రేగిన దుమారం చల్లారక ముందే ఇప్పుడు అమూల్ (Amul) ఉత్పత్తుల విక్రయంపై మరో వివాదం రాజుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని డెయిరీ ఊపిరి తీస్తున్నారంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి విపక్షాలు. ఇక ముస్లిం రిజర్వేషన్ల రద్దు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కూడా అధికార బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అదేసమయంలో పార్టీపై 40 పర్సెంట్ కమీషన్ ఆరోపణలు, టికెట్ల కేటాయింపుపై నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల అలకలతో బీజేపీ సతమతమైపోతోంది. దక్షిణాదిలో అధికారం దక్కించుకున్న ఏకైక రాష్ట్రాన్ని కాపాడుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికలు విజయ శంఖారావం పూరించాలని ప్రయత్నిస్తోంది బీజేపీ. ఈ చాన్స్ మిస్ అయితే మళ్లీ కష్టమే అన్నట్లు కాంగ్రెస్ పోరాడుతోంది. హంగ్ రావాలి.. అధికారం దక్కాలని కోరుకుంటోంది జేడీఎస్.. ఇలా మూడు పార్టీలు ఎత్తులతో చిన్నచిన్న అంశాలు కూడా ఎన్నికల ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి.