Karnataka Elections 2023: బీజేపీ ఉచిత పథకాల జపం దేనికి సంకేతం.. హస్తం పార్టీ ట్రాప్‌లో బీజేపీ చిక్కుకుందా?

కన్నడ రాజకీయంలో బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. ఊహించని విధంగా కాంగ్రెస్, జేడీఎస్ పోటీ ఇస్తుండటంతో ఉచిత హామీల జాతరకు రెడీ అయ్యింది కాషాయ పార్టీ.

Karnataka Elections 2023: బీజేపీ ఉచిత పథకాల జపం దేనికి సంకేతం.. హస్తం పార్టీ ట్రాప్‌లో బీజేపీ చిక్కుకుందా?

Karnataka Elections 2023: ఉచిత హామీలను వ్యతిరేకించే బీజేపీ.. కర్ణాటక ఎన్నికల్లో ఉచితాల జపం చేయడానికి కారణమేమిటి? తొమ్మిదేళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన కాషాయ పార్టీ.. కన్నడ సీమలో సిద్ధాంతాలను పక్కన పెట్టడాన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ ముక్త్ భారత్ (congress mukt bharat) అంటూ నినాదమిచ్చిన కమలదళం.. హస్తం పార్టీ ట్రాప్‌లోకి వెళ్లిందా? కన్నడ కాంగ్రెస్ పోటీని తట్టుకోడానికే ఉచిత హామీలు ఎంచుకుందా? ఇప్పుడు చూద్దాం..

కన్నడ రాజకీయంలో బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. ఊహించని విధంగా కాంగ్రెస్, జేడీఎస్ పోటీ ఇస్తుండటంతో ఉచిత హామీల జాతరకు రెడీ అయ్యింది కాషాయ పార్టీ. ప్రధాని మోదీ (PM Modi) వంటి నేత ఉచితాలను బహిరంగంగా వ్యతిరేకించినా.. కన్నడ నాట అధికారం నిలబెట్టుకోడానికి ఉచిత పథకాలను ఎంపిక చేసుకోక తప్పలేదంటున్నారు కాషాయ నేతలు. దక్షిణాదిలో ఓటర్లను ఆకట్టుకోవాలంటే జనాకర్షక పథకాలు ప్రకటించక తప్పదంటున్నారు. బీజేపీ ఇలా మారడానికి కాంగ్రెస్సే కారణమంటున్నారు పరిశీలకులు. హిమాచల్ ప్రదేశ్‌లో విజయం తెచ్చిపెట్టిన ఫార్ములాను కర్ణాటకలోనూ అమలు చేయాలని హస్తం పార్టీ నిర్ణయించడంతో బీజేపీ ప్రణాళిక (BJP Plan) కూడా మారిపోయిందని చెబుతున్నారు.

ఎన్నికల్లో విజయం కోసం ఎన్నాళ్లో ఎదురుచూసిన కాంగ్రెస్ పార్టీకి గత ఏడాది హిమాచల్ ప్రదేశ్‌ రూపంలో ఓదార్పు దక్కింది. ఆ రాష్ట్ర ఎన్నికల్లో తిరుగులేని విజయం దక్కించుకుని కర్ణాటక ఎన్నికలకు హుషారు తెచ్చుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌, అంతకుముందు రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రయోజనం తెచ్చిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ (old pension scheme)ను కర్ణాటకలోనూ అమలు చేస్తామని హామీ ఇస్తోంది కాంగ్రెస్. ఉద్యోగుల ఓట్లు కొల్లగొట్టాలనే లక్ష్యంతో పెన్షన్ స్కీమ్ అమలుకు కట్టుబడి ఉన్నామని చెబుతోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని.. చేతనైతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని చాలెంజ్ చేస్తోంది కాంగ్రెస్. ఇక హిమాచల్‌లో సక్సెస్ అయిన గృహజ్యోతి, గృహలక్ష్మి, నిరుద్యోగ నిధి వంటి పథకాలను కర్ణాటకలోనూ అమలు చేస్తామని చెబుతోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, డ్వాక్రా రుణాల మాఫీపై హామీలిస్తోంది. రాహుల్‌గాంధీ(Rahul Gandhi), ప్రియాంక, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వంటివారు ఈ హామీలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ హామీల దూకుడుతో బీజేపీ ఆలోచనలో పడిందని చెబుతున్నారు పరిశీలకులు. కర్ణాటకలో ప్రధాని ప్రచార సభల్లో ఉచితాలను వ్యతిరేకించిన రెండు రోజుల తర్వాత.. ప్రధాని ప్రకటనలకు భిన్నంగా బీజేపీ ఉచిత పథకాలను ప్రకటించడం చర్చనీయాంశమైంది.

జేడీఎస్ పార్టీ ఎఫెక్ట్
ఇక బీజేపీలో మార్పునకు జేడీఎస్ పార్టీ (JDS Party) కూడా కొంత కారణమంటున్నారు. వొక్కలిగ ఓట్లు ఎక్కువగా ఉన్న పాత మైసూరు ప్రాంతంలో బీజేపీ ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటివరకు ఆ పార్టీకి ఈ ప్రాంతంలో ఎలాంటి బలం లేదు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్నా పాత మైసూరు, కిత్తూరు కర్ణాటక, హోసూరు ప్రాంతాల్లో జేడీఎస్ మాత్రమే బలంగా ఉంది. కాంగ్రెస్ కూడా ఇక్కడ పట్టు సాధించింది. కానీ, బీజేపీకి ఇంతవరకు ఆ చాన్స్ రాలేదు. తాజా ఎన్నికల్లో తనకు పట్టున్న ప్రాంతంలో నష్టం జరిగితే.. పాత మైసూరులో గెలిచి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. ఇక్కడ పట్టు సాధించాలంటే జేడీఎస్ ఇచ్చిన హామీలు కన్నా మెరుగైన హామీలు ఇవ్వాల్సివచ్చిందని చెబుతున్నారు పరిశీలకులు.

Also Read: కిరీటం వంటి తలపాగాను ధరించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటీ?

జేడీఎస్ వినూత్న హామీలు
ఈ ఎన్నికల్లో గెలిచి కింగ్ కాకపోయినా.. కింగ్ మేకర్ (King Maker) అవ్వాలని కోరుకుంటున్న జేడీఎస్ పార్టీ వినూత్న హామీలిస్తూ తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. మహిళలకు నెలనెలా ఆర్థిక సాయం చేయడంతోపాటు, రైతు కుటుంబాల్లో అబ్బాయిలను వివాహం చేసుకునే అమ్మాయిలకు రెండు లక్షల రూపాయల పారితోషికం ఇస్తామని జేడీఎస్ చేసిన ప్రకటన రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. సామాజిక కోణంలో కుమారస్వామి చేసిన ప్రతిపాదన ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన వొక్కలిగలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం చేస్తున్న రైతుల పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. ఈ కోణంలో ఆలోచించిన కుమారస్వామి ఇది ఎన్నికల అంశం చేసి ప్రధాన పార్టీలకు ఝలక్ ఇచ్చారు. జనతా ప్రణాళిక అనే పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసిన జేడీఎస్.. బీజేపీ రద్దు చేసిన ముస్లిం రిజర్వేషన్లను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించింది.

Also Read: పెరట్లోని చెట్టుపై మూట, మూటలో కోటి రూపాయలు.. కన్నడనాట సిత్రాలు ఇసిత్రాలు..!!