Sonia Gandhi : రూటు మార్చండి..పీసీసీ చీఫ్ లకు సోనియా కీలక సూచనలు

వ్యక్తిగత ఆకాంక్షలను పక్కకుపెట్టి క్రమశిక్షణ, ఐక్యతపై దృష్టిసారించాలని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోరారు. పంజాబ్,చత్తీస్ గఢ్ సహా పలు

Sonia Gandhi : రూటు మార్చండి..పీసీసీ చీఫ్ లకు సోనియా కీలక సూచనలు

Sonia (1)

Sonia Gandhi వ్యక్తిగత ఆకాంక్షలను పక్కకుపెట్టి క్రమశిక్షణ, ఐక్యతపై దృష్టిసారించాలని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను ఇవాళ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోరారు. పంజాబ్,చత్తీస్ గఢ్ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరుని,తిరుగుబాటుని ఎదుర్కొంటున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ లకు ఈ మేరకు సోనియా గట్టి సందేశాన్ని పంపారు.

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో( పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌) జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ అగ్రనేతలతో మంగళవారంనాడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి సోనియాగాంధీ అధ్యక్షత వహించారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ ‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జులు, పీసీసీ చీఫ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడుతూ..దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, కీల‌కాంశాల‌పై ఏఐసీసీ ప్ర‌తిరోజూ స‌వివ‌ర ప్ర‌క‌ట‌న‌లు జారీ చేస్తున్నా అవి బ్లాక్‌, జిల్లా స్ధాయిలో పార్టీ శ్రేణుల వ‌ర‌కూ చేర‌డం లేద‌న్నారు. విధాన‌ప‌ర‌మైన అంశాల‌ విషయంలో రాష్ట్ర‌స్ధాయి నేత‌ల్లో కూడా స్ప‌ష్ట‌త కొర‌వ‌డిన‌ట్టు తాను గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్ర నేతల మధ్య అవగాహనా లేమి, సయోధ్య లేమి కనిపిస్తోందన్నారు. పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత తప్పనిసరి అని, వ్యక్తిగత ఆకాంక్షల కంటే పార్టీ పటిష్టతే మిన్న అని అన్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ దుష్ప్రచారాలపై పోరాడే క్ర‌మంలో అంత‌ర్గ‌త విభేదాల‌ను ప‌క్క‌న‌పెట్టి నేత‌లంతా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో స‌మైక్య పోరు సాగించాల‌ని కాంగ్రెస్ అధినేత్రి పేర్కొన్నారు.

ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త సభ్యులే కీలకమైనే విషయాన్ని పీసీసీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జులు గుర్తించాలని అన్నారు. వారందరికీ ఒక వేదిక కల్పించాలని అన్నారు. దశాబ్దాల తరబడి పార్టీ ఇదే బాటలో నడుస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

కార్యకర్తలను గుర్తించి, ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టినప్పుడే ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందని సోనియా పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగావకాశాల కోసం పోరాడుతున్న యువత, చిన్న, మధ్య తరగతి వ్యాపారులు, ముఖ్యంగా అణగారిన వర్గాల సమస్యలపై దృష్టి సారించాలని నేతలకు సోనియా పిలుపునిచ్చారు. పార్టీ చేపట్టాల్సిన న్యూ మెంబర్‌షిప్ డ్రైవ్‌, అందుకు అనుసరించాల్సిన విధివిధానాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించారు. నవంబర్ 1న కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ డ్రైవ్ నిర్వహించనున్నారు.

ALSO READ UP Election : వచ్చే ఏడాది ఎన్నికలు, అప్పుడే హామీల వర్షం