సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరింపు…మరోసారి భారత్, చైనా అధికారుల కీలక భేటీ

  • Published By: raju ,Published On : June 22, 2020 / 04:12 PM IST
సరిహద్దుల్లో భారీగా సైన్యం  మోహరింపు…మరోసారి భారత్, చైనా అధికారుల కీలక భేటీ

తూర్పు లడఖ్‌లోని గాల్వ‌న్ వ్యాలీలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణతో సరిహద్దుల్లో ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇరు దేశాల సైనికాధికారులు సోమవారం మరోసారి సమావేశమయ్యారు. చైనా వైపున ఉన్న వాస్తవాధీన రేఖ లోప‌ల‌ చుశూల్‌ సెక్టార్‌లోని మోల్డో దగ్గర భారత్, చైనా సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్స్ ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. 

ఎల్ఏసీ వెంబడి ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. గాల్వన్ లోయపై సార్వభౌమాధికారం తమదంటే తమదంటూ భారత్, చైనాలు వాదించుకుంటున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

జూన్ 6న కూడా ఇదే ప్రాంతంలో ఇరు దేశాల ఆర్మీ జనరల్స్ స్థాయి అధికారుల మధ్య స‌మావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ చర్చల్లో తీసుకున్న నిర్ణయాలను విస్మరించి ఈ నెల 15న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత సైనికులపై మెరుపు దాడికి పాల్పడటంతో 20 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 76 మంది గాయపడ్డారు.

జూన్ 6న లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చల సందర్భంగా గాల్వన్‌ లోయలో నిర్మించిన తాత్కాలిక చెక్ పోస్టులను తొలగించడానికి, అక్కడి నుంచి వెనక్కి వెళ్లడానికి చైనా అంగీకరించింది. చైనా బలగాల ఉపంసహరణ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందో చూడటం కోసం కల్నల్ సంతోష్ బాబు నేతృత్వంలోని 40 మంది జవాన్లు జూన్ 15న సాయంత్రం గాల్వన్ లోయలోకి వెళ్లారు. భారత భూభాగంలో చైనా సైనికులు అబ్జర్వేషన్ పోస్టు నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఇదే సమయంలో చైనా దొంగదెబ్బ తీసి, ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసిన తెలిసిందే. విషయం తెలిసిందే. 

ప్రస్తుతం లడఖ్ లో పరిస్థితులు ఎప్పటి కప్పుడు మారిపోతున్నాయి.  ఓ వైపు చర్చలు జరుగుతున్నా.. సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు జరుగుతున్నట్లు  సమాచారం. ఈ బలగాల మోహరింపుతో భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి.  ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం. గాల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 , పాంగాంగ్‌ టీఎస్‌వో వద్ద ఇరు దేశాల సైనికులు వచ్చి చేరుతున్నారు. 

కీలక ప్రాంతాల్లో భారత్‌-చైనాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేసుకుంటున్నాయని సమాచారం అందుతోంది. మరో పక్క గాల్వాన్ లోయ ఘటన తర్వాత చైనా వస్తువుల బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనికి అనుగుణంగా చైనా కంపెనీలతో కుదిరిన 5 వేల కోట్ల ఒప్పందాల్ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇటీవల ముంబైలో జరిగిన మేగ్నటిక్ మహరాష్ట్ర 2.0 ఇన్వెస్టర్ మీట్‌లో చైనా కంపెనీలతో ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి సంతకాలు జరిగాయి. కేంద్రంతో సంప్రదించిన అనంతరమే మూడు ప్రాజెక్టుల సస్పెండ్ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు.