సైనికుల కోసం ఓ దీపం వెలిగించండి..షాపింగ్ లో ‘వోకల్ ఫర్ లోకల్’మర్చిపోవద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : October 25, 2020 / 03:07 PM IST
సైనికుల కోసం ఓ దీపం వెలిగించండి..షాపింగ్ లో ‘వోకల్ ఫర్ లోకల్’మర్చిపోవద్దు

Light A Lamp For Soldiers దేశ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి మోడీ. ప్రతినెలా చివరి ఆదివారం రేడియో కార్యక్రమం “మన్ కీ బాత్” ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల చివరి ఆదివారమైన ఇవాళ(అక్టోబర్-25,2020) ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెప్పిన మోడీ….ఎంతో సంయమనంతో, నిరాడంబరంగా పండుగలను జరుపుకోవాలన్నారు.



గతంలో దుర్గాదేవి దర్శనం కోసం మండపాల్లో పెద్ద సంఖ్యలో జనం గుమిగూడేవారని..కానీ కరోనా నేపథ్యంలో ఈ సారి అలా జరుగలేదన్నారు. గతంలో దసరా నాడు పెద్ద జాతరలు కూడా జరిగేవని…. ఈ సారి వాటి రూపం కూడా మరిపోయిందన్నారు. రామ్ లీలా పండుగ కూడా ఒక పెద్ద ఆకర్షణ…. కానీ దానికి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయని.. ఈసారి పెద్ద ఎత్తున సభలు నిషేధించినట్లు మోడీ తెలిపారు. ప్రజలు సంయమనంతో పండుగలు జరుపుకోవాలని, షాపింగ్‌ చేసే సమయంలో ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ నినాదాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. యుద్ధంలో మేం (కొవిడ్‌-19 వ్యతిరేకంగా) పోరాడుతున్నాం.. విజయం ఖచ్చితంగా ఉంటుంది అని మోడీ తెలిపారు.



ఈ సందర్భంగా మన జవాన్ల త్యాగాలను,ధైర్యసాహసాలను మోడీ గుర్తుచేసుకున్నారు. ధైర్యవంతమైన సైనికులు, భద్రతా దళాలతో మన దేశం దృఢంగా ఉందని ప్రధాని అన్నారు. సరిహద్దుల్లో కాపలా కాస్తూ బయటి నుంచి వచ్చే ముప్పు నుంచి దేశం సురక్షితంగా ఉండేందుకు సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉండి సేవలందిస్తున్నారన్నారు. ఈద్‌, దీపావళి వంటి అనేక పండుగలు ఈ ఏడాదిలో జరుగాయని, ఆయా సమయాల్లో సరిహద్దులో నిలబడిన మన ధైర్య సాహసాలు గల సైనికులను కూడా స్మరించాలన్నారు.



కరోనా మహమ్మారి మధ్య పండుగలను జరుపుకుంటుండగా.. సైనికుల కోసం ఒక దీపం వెలిగించాలని మోడీ పిలుపునిచ్చారు. మన భారతదేశపు ధైర్యవంతులైన కొడుకులు, కూతుళ్ల(సైనికులు) గౌరవార్థం మన ఇంట్లో ఓ దీపం వెలిగించాలని అన్నారు. చైనాతో నెలకొన్న వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.