‘కాందహార్’ విమానం హైజాక్ సమయంలో మమత త్యాగాన్ని గుర్తు చేసిన యశ్వంత్ సిన్హా

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ శనివారం(మార్చి-13,2021)తృణముల్ కాంగ్రెస్ లో చేరిన మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా..వాజ్ పేయి ప్రభుత్వంలో మమతతో కలిసి పని చేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు.

‘కాందహార్’ విమానం హైజాక్ సమయంలో మమత త్యాగాన్ని గుర్తు చేసిన యశ్వంత్ సిన్హా

Yashwant Sinha

Yashwant Sinha వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ శనివారం(మార్చి-13,2021)తృణముల్ కాంగ్రెస్ లో చేరిన మాజీ బీజేపీ నేత యశ్వంత్ సిన్హా..వాజ్ పేయి ప్రభుత్వంలో మమతతో కలిసి పని చేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 1999లో కేంద్రమంత్రి వర్గంలో తన సహచర మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ చేసిన చేసిన ఓ సాహసాన్ని ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హా గుర్తు చేశారు.

1999 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాకర్లు ..ఆఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ కు తీసుకెళ్లిన సమయంలో ఆ ఘటనపై కేబినెట్ లో చర్చ జరిగిందని, ఆవిమానంలోని బారతీయ ప్రయాణికులను హైజాకర్లు విడుదల చేయడానికి అనువుగా తను బందీగా వెళ్లేందుకు మమత సిధ్ధపడ్డారని యశ్వంత్ సిన్హా గుర్తుచేశారు. తనను తాను త్యాగం చేసేందుకు అప్పుడు మమత సిద్దపడ్డారని తెలిపారు. మమత కేంద్ర కేబినెట్ లో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ..మొదటి నుంచీ ఆమె ‘యోధురాలని’ (ఫైటర్) అన్నారు. ఇప్పుడు కూడా మమతా బెనర్జీ ఫైటరేనని యశ్వంత్ సిన్హా అన్నారు. నాడు వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో తాను ఆమెతో కలిసి పని చేశానని, తొలి నుంచీ ఆమె ఎంతో ధైర్యస్తురాలని పేర్కొన్నారు.

1999 డిసెంబరు 24న ఖాట్మండు లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వస్తోన్న ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ‘ఐసీ 814’ హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం ఆ రోజు సాయంత్రం 5.30కు భారత గగనతలంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే హైజాకింగ్‌ జరిగింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే హర్కతుల్‌ ముజాహిదీన్‌ అనే ఓ ఉగ్రవాద సంస్థ ఈ విమానాన్ని హైజాక్ చేసి ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ కి తరలించింది.

జైల్లో ఉన్న తమ ఉగ్రవాదులను విడుదల చేయకపోతే ఈ విమానంలోని ప్రయాణికులను హతమారుస్తామని హైజాకర్లు భారత ప్రభుత్వాన్ని హెచ్ఛరించారు. దాంతో ప్రయాణికులను రక్షించేందుకు నాడు భారత ప్రభుత్వం ముగ్గురు ఉగ్రవాదులను విడుదల చేసింది. ముస్తాక్ అహ్మద్ జర్గార్, అహ్మద్ ఉమర్ సయీద్ షేక్, మసూద్ అజహర్ అనే టెర్రరిస్టులను అప్పుడు వాజ్ పేయి ప్రభుత్వం విడుదల చేసింది. కానీ వీరిలో షేక్, అజహర్ తమ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చారు. మౌలానా మసూద్ అజర్ – 2000 సంవత్సరంలో జైష్ ఇ మొహమ్మద్ తీవ్రవాద సంస్థను స్థాపించాడు. 2001లో భారత పార్లమెంటు పై దాడిలో ఈ సంస్థ హస్తముందన్న ఆరోపణలున్నాయి. 2008 లో ముంబై పేలుళ్ల కుట్రలో కూడా వీళ్లు పాల్గొన్నారు. 2019ఫిబ్రవరిలో పుల్వామాలో మన జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రదాడికి పాల్పడింది కూడా జైషే సంస్థ అని తేలింది.

ఇక, 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.