మీడియా వెళ్లిపోతుంది, మీరు ఇక్కడే ఉంటారు…హత్రాస్ బాధితురాలి తండ్రిని బెదిరించిన జిల్లా మెజిస్ట్రేట్

  • Published By: venkaiahnaidu ,Published On : October 1, 2020 / 09:55 PM IST
మీడియా వెళ్లిపోతుంది, మీరు ఇక్కడే ఉంటారు…హత్రాస్ బాధితురాలి తండ్రిని బెదిరించిన  జిల్లా మెజిస్ట్రేట్

ఉత్తరప్రదేశ్ హత్రాస్ ‌కు చెందిన 19 ఏళ్ళ దళిత యువతిపై సెప్టెంబర్ 14న సామూహిక లైంగికదాడి జరుగగా ఢిల్లీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం చనిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే.

అయితే, ఈ సమయంలో హత్రాస్ బాధితురాలి తండ్రిని జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్సర్ బెదిరిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. కొన్ని రోజుల్లో మీడియా వెళ్లి పోతుంది.. మీరు ఇక్కడే ఉంటారంటూ హత్రాస్ బాధితురాలి తండ్రిని జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్సర్ హెచ్చరించారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో… ఇవాళ సగం మంది మీడియా సిబ్బంది వెళ్లిపోయారు. మిగతా వారు రేపు వెళ్లిపోతారు. ఇక మేమే ఉంటాం. నీ స్టేట్‌మెంట్ మార్చుకుంటావో లేదో ఇక నీ ఇష్టం అని బాధితురాలి తండ్రిని జిల్లా మెజిస్ట్రేట్ హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తోంది.


కాగా, తమ అంగీకారం లేకుండానే రాత్రివేళ యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, వారి అనుమతితోనే నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఆ యువతిపై లైంగికదాడి జరుగలేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బాధితురాలి సోదరుడు డిమాండ్ చేశారు.

ఇక, హ‌త్రాస్‌ గ్యాంగ్ రేప్ ఘటనపై.47 మంది మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్​ ఎస్​ఏ బోబ్డేను, కొలీజియం న్యాయమూర్తులను కోరారు.


మరోవైపు, ఈ ఘటనను అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై ఈ నెల 12వ తేదీలోగా స్పందన తెలియజేయాలంటూ ఏసీఎస్ హోం, డీజీపీ, లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ, హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు గురువారం వారికి నోటీసులు జారీ చేసింది.