modi hug diplomacy: ఆలింగనాలతో దేశాధినేతలను కట్టిపడేసిన ప్రధాని.. మోదీ హగ్‌ దౌత్యం ఫలిస్తుందా?

ఏ పర్యటనకు వెళ్లినా ఆ దేశాధినేతలకు హగ్‌తో స్నేహ హస్తాన్ని అందిస్తారు ప్రధాని మోదీ. ఇలా ఏ దేశం వెళ్లినా అక్కడి దేశాధినేతలతో కేవలం దౌత్య సంబంధాలే కాదు గాఢమైన స్నేహబంధాన్ని మోదీ పెంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

modi hug diplomacy: ఆలింగనాలతో దేశాధినేతలను కట్టిపడేసిన ప్రధాని.. మోదీ హగ్‌ దౌత్యం ఫలిస్తుందా?

pm modi hug diplomacy

Updated On : May 25, 2023 / 2:04 PM IST

Narendra Modi Hug Diplomacy: ప్రపంచ దేశాధినేతల్లో అందరిదీ ఓ లెక్క ప్రధాని మోదీది మరో లెక్క. దేశాధినేతలకు ఇతర దేశాల నాయకులతో వ్యూహాత్మక స్నేహం ఉంటుంది. అయితే మోదీ విషయంలో లెక్క వేరు. భారత ప్రధానిని ఎవరైనా దోస్త్‌ మేరా దోస్త్ అనాల్సిందే. ఆప్యాయతగా దగ్గరకు తీసుకోవాల్సిందే. దీనికి మోదీ చేసిన మ్యాజిక్ ఏంటి..? ఏ దౌత్యం మోదీని.. ఇతర దేశాల నేతలకు అత్యంత ఆప్తుడిని చేసింది..?

ఎక్కడకు వెళ్లినా మోదీకి హగ్‌ల స్వాగతం
ప్రపంచంలో ఏ దేశాధినేతకు లేని క్రేజ్ ప్రధాని నరేంద్ర మోదీకి ఉంది. కేవలం ప్రజలే కాదు.. ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానులు సైతం మోదీకి ఫిదా అవుతున్నారు. ఏం మంత్రం వేశారో.. ఏ మాయే చేశారో తెలియదు. కాని ఒక్క హగ్‌తో ప్రపంచ దేశాల నేతలను ప్రాణ స్నేహితులుగా చేసుకుంటున్నారు మోదీ. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మోదీ ప్రపంచ పర్యటనలకు వెళ్లినప్పుడు.. మొదట మోదీ ఆలింగనాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన నేతలే.. ఇప్పుడు స్వయంగా మోదీని వచ్చి హగ్‌ చేసుకోవడం విశేషం. ఇంతలా మోదీ తన హగ్స్‌తో వారి మనసు గెలుచుకున్నారు. ఆస్ట్రేలియా, పపువా న్యూ గినియా (Papua New Guinea), జీ7 సమావేశాల (G7 Summit 2023)కు జపాన్‌లో పర్యటించారు మోదీ ఎక్కడకు వెళ్లినా మోదీకి ఆలింగనాల స్వాగతం లభిస్తోంది.

Narendra Modi, Anthony Albanese
ఆలింగనాలతో దేశాధినేతలకు దగ్గరైన మోదీ

తన ఆలింగనాలతో దేశాధినేతలకు దగ్గరైన మోదీ.. వారి గుండెల్లో స్థానం సంపాదించారు. అందుకే మోదీ విదేశీ పర్యటన సందర్భంగా వారి నుంచి వచ్చే రియాక్షన్ అంత గొప్పగా ఉంటోంది. చాలా కాలం తర్వాత ప్రాణ స్నేహితుడు వస్తే ఎలా రీసీవ్‌ చేసుకుంటారో అలాగే.. మోదీకి అధ్యక్షులు, ప్రధానులు స్వాగతం పలుకుతున్నారు. ఇదే విధంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్.. మోదీని డియర్ ఫ్రెండ్‌ అంటూ ఆలింగనం చేసుకున్నారు. అమెరికన్ సింగర్ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్‌ (Bruce Springsteen)తో పోల్చారు. మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన జన సందోహం వారి రెస్పాన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ (never before ever after) అనిపించేలా ఉంది.

Narendra Modi James Marape
ఆశ్చర్య పోయేలా చేసిన జేమ్స్ మరాపే తీరు

అటు పపువా న్యూ గినియా పర్యటన సందర్భంగా.. ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే (James Marape) తీరు అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. ఏకంగా ప్రధాని మోదీ కాళ్లకు నమస్కారం పెట్టారు. దానిని ఆపి జేమ్స్ మరాపేను హగ్‌ చేసుకున్నారు మోదీ. ఇది ప్రపంచ దేశాధినేతలకు సైతం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒక దేశ ప్రధాని మరో దేశ ప్రధాని ఇంతలా గౌరవించడం చూసి ఉండరు. దీనికి మోదీ ఆ దేశంతో.. ఆ దేశాది నేతలతో చూపించే స్నేహానికి నిదర్శనమంటున్నారు. పపువా న్యూ గినియా పర్యటనలో మోదీకి ఫిజీ అత్యున్నత గౌరవ పురస్కారం లభించింది. ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వాన్ని గుర్తించి ఫిజీ-కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ-అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. పపువా న్యూ గినియా కూడా అత్యున్నత పురస్కారంతో ప్రధాని మోదీని గౌరవించింది. ఇది మోదీపై వారికున్న అభిమానాన్ని చాటుతోంది.

ఆలింగనంతో స్నేహ హస్తం
సాధారణంగా దేశాధినేతలు కలిసినప్పుడు షేక్‌ హ్యాండ్స్‌తో సరిపెట్టుకుంటారు. కాని మోదీ పరిచయం చేసిన హగ్స్.. మాయే వేరంటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సైతం దీనికి ఫిదా అయ్యారు. అందుకే జపాన్‌లో జీ7 సమావేశాల సందర్భంగా మోదీ దగ్గరకు స్వయంగా వచ్చి హగ్ ఇచ్చారు. సమావేశంలో ఎంతో మంది నేతలున్నా.. వారికి లభించని అరుదైన గౌరవం మోదీకి దక్కింది. భేటీ సందర్భంగా బైడెన్.. చైనాతో పోలుస్తూ భారత్ పై ప్రశంసలు కురిపించారు. అనంతరం ప్రత్యేకంగా సమావేశమైన మోదీ, బైడెన్ చాలా సరదాగా మాట్లాడుకున్నారు. అమెరికా ప్రజలంతా మీ గురించి ఎదురు చూస్తున్నారని చెప్పారు. జూన్‌లో మోదీ అమెరికా వెళ్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసింది అగ్రరాజ్యం. అటు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak)ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్నేహంగా మాట్లాడారు.

Also Read: తొమ్మిదేళ్ల పాలన.. మోదీ సాధించిన 5 అతిపెద్ద విజయాలు ఇవే..

ఇప్పుడే కాదు.. ఏ పర్యటనకు వెళ్లినా ఆ దేశాధినేతలకు హగ్‌తో స్నేహ హస్తాన్ని అందిస్తారు ప్రధాని మోదీ. ఇలా ఏ దేశం వెళ్లినా అక్కడి దేశాధినేతలతో కేవలం దౌత్య సంబంధాలే కాదు గాఢమైన స్నేహబంధాన్ని మోదీ పెంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దౌత్య సంబంధానికి కొత్త అర్థం చెబుతున్నారు మోదీ.

మోదీ హగ్‌ దౌత్యం వల్ల దేశానికి ఎలాంటి లాభం కలుగుతోంది?.. వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి..