President Kovind : కలలో కూడా ఊహించలేదు..జన్మభూమికి చేరిన వేళ రాష్ట్రపతి భావోద్వేగం

రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామానికి వెళ్లారు రామ్ నాథ్ కోవింద్.

President Kovind : కలలో కూడా ఊహించలేదు..జన్మభూమికి చేరిన వేళ రాష్ట్రపతి భావోద్వేగం

Kovind (1)

President Kovind రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామానికి వెళ్లారు రామ్ నాథ్ కోవింద్. స్వగ్రామంలోని బాల్య మిత్రులు, బంధువులను కలుసుకోవడానికి సతీమణి సవితా దేవితో కలిసి శుక్రవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక రైలులో కాన్పూర్ చేరుకున్న రాష్ట్రపతి ఆదివారం మధ్యాహ్నాం హెలికాప్టర్‌ లో స్వగ్రామం పరౌంఖ్ చేరుకున్నారు. రాష్ట్రపతి దంపతులకు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్,సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు ఘన స్వాగతం పలికారు

స్వగ్రామ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ భావోద్వేగానికి గురయ్యారు. పరౌంఖ్‌లో హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత రాష్ట్రపతి తన జన్మస్థలాన్ని చూసి పులకించిపోయిన కోవింద్.. పుట్టిన గడ్డను చేతితో తాకి, నమస్కరించారు. కొంత మట్టిని తీసుకుని, తన నుదుట బొట్టు పెట్టుకున్నారు. అనంతరం గ్రామంలోని పత్రి మాతా ఆలయానికి వెళ్లి కోవింద్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని అంబేద్కర్ భవన్ ని సందర్శించి డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రాహానికి నివాళి అర్పించిన కోవింద్.. మిలాన్ కేంద్రాన్ని(కమ్యూనిటీ సెంటర్ గా మార్చబడిన తమ పూర్వికుల ఇల్లు) సందర్శించారు. అనంతరం గ్రామంలోని వీరంఘన ఝల్కరీ బాయి ఇంటర్ కాలేజీలో ప్రజా ఆత్మీయ సమ్మేళనంలో కోవింద్ మాట్లాడారు.

ఒక మారుముల గ్రామానికి చెందిన నా లాంటి ఒక సాధారణ కుర్రాడు ఇంత పెద్ద దేశానికి చెందిన అత్యున్నత బాధ్యతలను నిర్వర్తించే అధికారాన్ని పొందుతానని నేను ఏనాడూ ఊహించలేదు.కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ దానిని చేసి చూపెట్టింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం.. ఈ నేల, మీ ప్రేమ, ఆదరాభిమానాలే. ఈ ఊరి జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నా మదిలోనే ఉంటాయి. పరౌఖ్​ అంటే కేవలం ఓ ఊరు కాదు నా మాతృభూమి.. అదే నాకు దేశానికి సేవ చేయాలనే ప్రేరణ కలిగించింది అని కోవింద్ అన్నారు. మాతృభూమి ఇచ్చిన స్ఫూర్తితోనే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, అక్కడి నుంచి రాజ్యసభ, రాజ్​భవన్.. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్​కు చేరుకున్నట్లు కోవింద్ తెలిపారు.

గ్రామంలో తన చిన్ననాటి మిత్రులు, సహ విద్యార్థులు, తనతో కలిసి పార్టీ కార్యక్రమాలు చేపట్టిన వారితో సమావేశమై గత స్మృతులను నెమరేసుకున్నారు రాష్ట్రపతి. తనతో కలిసి చదువుకున్న పలువురిని పేర్లతో పిలిచి వారితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గ్రామ ప్రజలు తనపై చూపిన ఆదరాభిమానాలు తాను ఎన్నటికీ మర్చిపోలేనని రాష్ట్రపతి కోవింద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. యూపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందన్న రామ్ నాథ్ కోవింద్..అందరూ టీకా వేయించుకోవాలని పిలుపునిచ్చారు. తాము టీకా తీసుకోవడంతోపాటు చుట్టుపక్కలవారిని కూడా వేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు.