పెళ్లి దుస్తుల్లోనే వచ్చి..రక్తదానం చేసి యువతి ప్రాణాలు కాపాడిన నవ దంపతులు

పెళ్లి దుస్తుల్లోనే  వచ్చి..రక్తదానం చేసి యువతి ప్రాణాలు కాపాడిన నవ దంపతులు

New couple donates blood : ప్రాణాన్ని మించింది ఏదీ లేదు. డబ్బు పోయినా మరొకటి పోయినా తిరిగి వస్తాయి. కానీ ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు.అటువంటి ప్రాణం ప్రమాదంలో ఉందని తెలిసి ఓ నూతన జంట పెళ్లి బట్టలతోనే వచ్చి ఓ యువతిని కాపాడారు. సాధారణంగా వధూ వరుల్ని పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు చేశాక ఇల్లు కదలనివ్వరు. అది సంప్రదాయం. అలా వివాహం జరిగి 16 పండుగ వేడుక పూర్తి అయ్యేంత వరకూ ఎక్కడికి వెళ్లనివ్వరు.

కానీ ఓ జంటకు అప్పుడే వివాహం జరిగింది. ఇంకా కాళ్ల పారాణి ఆరనే లేదు. మూడు ముడులు వేసిన పసుపు తాడు తడి ఇంకా పచ్చిగానే ఉంది. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఇంకా భోజనాల కార్యక్రమంలో హడావిడిగానే ఉన్నారు. ఇంతో ఓ యువతికి రక్తం అవసరం పడింది. ప్రాణాపాయం పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో సంప్రదాయాలు. పద్ధతులు ఏమీ గుర్తు రాలేదు ఆ నూతన వధూవరులకు.

ఎలాగైనా సరే ప్రాణాపాయంలో ఉన్న యువతిని కాపాడాలనుకున్నారు. అంతే పెళ్లి పీటల మీదనుంచి లేచి వచ్చి రక్తదానం చేసి ఆమెను కాపాడారు.ఈ నూతన వధూవరుల ఎక్కడివారు? వారి పేర్లు ఏంటీ అనేది ఇక్కడ అసవరం లేదు. ఓ నిండు ప్రాణం కాపాడటమే ముఖ్యం. అదే అనుకున్నారా దంపతులు. రక్తం లేదనే కారణంతో ఓ నిండు ప్రాణం కోల్పోకూడదనుకుని పెళ్లి పీటల మీదనుంచి వధూవరులు ముస్తాబుతోనే వచ్చి రక్తదానం చేశారు. ఆ జంట పెళ్లి రోజున చేసిన పనిపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇందుకు సంబంధించిన వివరాలను ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి అశిశ్ మిశ్రా తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. అశిశ్ మిశ్రా పోలీస్ మిత్రా క్యాంపెయిన్ ద్వారా రక్తం అవసరమైన పెషేంట్లకు రక్తం సమకూర్చేలా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ యువతి ప్రాణాలు కాపాడటానికి ఓ జంట పెళ్లి వేదిక నుంచి నేరుగా వచ్చి రక్తదానం చేసింది. పెళ్లి దుస్తులు ధరించి ఉన్న సమయంలో రక్తదానం చేస్తున్న నూతన వధూవరుల ఫొటోను అశిశ్ షేర్ చేశారు. ఈ ఫోటోలో వరుడు రక్తదానం చేస్తుండగా.. వధువు అతని పక్కనే నిల్చుని ఉంది.

అలాగే హిందీలో ఓ మెసేజ్ రాస్తూ..” నా భారతదేశం చాలా గొప్పది. ఓ యువతికి రక్తం దానం చేసేవారి అవసరం పడింది. కానీ ఆమెకు రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఆమె వేరొకరి బిడ్డ కాబట్టి. అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ జంట బాలికకు రక్తం అందించడానికి ముందకొచ్చారు. వారి పెళ్లి రోజు అయినా కూడా సమయం చూసుకుని రక్తదానం చేశారు. వారికి బిగ్ సెల్యూట్. ఆ జంటకు దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను” అని పేర్కొన్నారు. కాకపోతే ..పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చీ మరీ..రక్తదానం చేసిన ఆ జంట వివరాలను మాత్రం అశిశ్ తెలుపలేదు.

కానీ..ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులు మిన్న అని సేవకు ప్రతిరూపం అయిన మదర్ థెరిస్సా చెప్పినట్లుగా..సాయం చేసినవారు వివరాలు కంటే సహాయం చేసి నిలబెట్టిన ప్రాణం గొప్పదని భావించిన ఆ జంట పెద్ద మనస్సు చాలా చాలా గొప్పదనటం ఎటువంటి సందేహం లేదు.