ఉరి తప్పించుకోవడానికేనా? జైల్లో తల పగలకొట్టుకున్న నిర్భయ దోషి

  • Published By: veegamteam ,Published On : February 20, 2020 / 03:51 AM IST
ఉరి తప్పించుకోవడానికేనా? జైల్లో తల పగలకొట్టుకున్న నిర్భయ దోషి

ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇప్పటివరకు అనేక రకాల ప్రయత్నాలు చేసిన నిర్భయ దోషులు.. ఇప్పుడు మరో కొత్త నాటకానికి తెరతీశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిర్బయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తీహార్ జైల్లో గోడకు తల బాదుకున్నాడు. తనని తాను గాయపర్చుకున్నాడు. ఈ ఘటనలో వినయ్ శర్మ తలకు స్వల్పంగా గాయమైంది. దీంతో అతడికి జైలు అధికారులు చికిత్స అందించారు. మార్చి 3న నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలను గోడకు బాదుకుంటుండగా.. గమనించిన అధికారులు..వెంటనే వినయ్ శర్మని అడ్డుకున్నారు. బయటకు తీసుకొచ్చి చికిత్స చేశారు. 

కొత్త నాటకమా?
“నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ.. సెల్ లో గోడకు తల బాదుకున్నాడు. తనని తాను గాయపరుచుకున్నాడు. అతడి తలకు స్వల్ప గాయాలయ్యాయి. వినయ్ కు చికిత్స అందించాము. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది” అని తీహార్ జైలు అధికారి ఒకరు తెలిపారు. వినయ్ శర్మ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వినయ్ శర్మకు న్యాయపరమైన అవకాశాలన్ని ముగిశాయి. దీంతో ఉరి నుంచి తప్పించుకోవడానికి అతడు కొత్త నాటకాలు ఆడుతున్నాడా అనే అనుమాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వినయ్ నిరాహార దీక్షకు దిగాడు. ఇప్పుడేమో తల బాదుకున్నాడు. వీటిని సాకుగా చూపి.. వినయ్ శర్మ మెంటల్ కండీషన్ బాగోలేదని, ఉరి శిక్ష అమలు చేయొద్దని అతడి తరఫు లాయర్ కోరాడు. దీనిపై స్పందించిన కోర్టు.. వినయ్ శర్మ సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది.

ఈసారైనా ఉరి ఖాయమా?
నిర్భయ దోషులను ఉరితీసేందుకు ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇటీవలే కొత్త తేదీని ఖరారు చేసింది. మార్చి 3న ఉదయం 6గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని తీహార్‌ జైలు అధికారులను ఆదేశించింది. నిర్భయ దోషుల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారి ఉరిపై కొత్త తేదీని ప్రకటించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో… ఢిల్లీ ప్రభుత్వం, నిర్భయ తల్లిదండ్రులు ట్రయల్‌ కోర్టును ఆశ్రయించారు. దోషులను ఉరి తీయడానికి ఇదైనా ఆఖరు తేదీ అవుతుందని నిర్భయ తల్లి ఆశించారు.

మూడోసారి డెత్ వారెంట్:
నిర్భయ దోషులకు ఉరి తేదీని ప్రకటించడం ఇది మూడోసారి. న్యాయపరమైన అంశాల కారణంగా గతంలో రెండు సార్లు ఉరి అమలు వాయిదా పడింది. కోర్టు ఉరితీత తేదీని ప్రకటించడం.. చివరి నిమిషంలో దోషులు కొత్త పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో ఉరి వాయిదా పడుతూ వస్తోంది. మొదట జనవరి 22నే దోషులను ఉరి తీయాలని కోర్టు ఆదేశించింది. ముఖేశ్‌ క్షమాభిక్ష పిటిషన్‌తో అది ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. ఉరితీతకు రెండు రోజుల ముందు జనవరి 31న దోషులు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అన్ని న్యాయపరమైన అంశాలను వినియోగించుకునే వరకు ఉరి తీయరాదని కోరారు. దీంతో ఉరిశిక్ష అమలుపై కోర్టు జనవరి 31న స్టే విధించింది. 

ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని తేల్చి చెప్పింది. శిక్ష అమలుపై స్టే యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే వారం రోజుల్లోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిర్భయ దోషుల పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారిని ఉరి తీసేందుకు కొత్త తేదీని ప్రకటించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్చి 3వ తేదీని ప్రకటించారు.

Read More>>జర్మనీలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది మృతి