వరుసగా నాలుగోసారి.. బీహార్ సీఎంగా.. ఏకగ్రీవంగా నితీష్

  • Published By: vamsi ,Published On : November 15, 2020 / 02:33 PM IST
వరుసగా నాలుగోసారి.. బీహార్ సీఎంగా.. ఏకగ్రీవంగా నితీష్

JD(U) అధ్యక్షుడు నితీష్ కుమార్ NDA లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. NDA శాసనసభ పార్టీ సమావేశంలో శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా పాల్గొన్నారు. ఈ సాయంత్రం బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే వాదనను నితీష్ కుమార్ గవర్నర్‌కు సమర్పించనున్నారు.



రేపు(16 నవంబర్ 2020 11గంటల 30నిమిషాలకు నాల్గవసారి ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. నితీష్ 7వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతుండగా.. ఇది వరుసగా నాలుగోసారి. అలాగే అసెంబ్లీ పార్టీ నాయకుడిగా సుశీల్ కుమార్ మోడీ ఎన్నికయ్యారు. సుశీల్ ఈసారి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు. అయితే, ఇంకా అధికారికంగా సమాచారం వెల్లడించలేదు.



నితీష్ కుమార్ కొత్త క్యాబినెట్‌లో చాలా మంది యువ, కొత్త ముఖాలు కనిపించబోతున్నట్లుగా బీహార్‌లో ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతసారి కంటే ఈ ఎన్నికల్లో BJP ఎక్కువ సీట్లు గెలుచుకోగా.. JD(U) సీట్లు తగ్గాయి. ఈ కారణంగా, ఈసారి BJP మంత్రివర్గంలో ఆధిపత్యం చెలాయిస్తుందని భావిస్తున్నారు. నియమం ప్రకారం బీహార్ అసెంబ్లీలో సీట్ల సంఖ్యను బట్టి గరిష్టంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు.



ఈసారి BJP 74 సీట్లు గెలుచుకోగా.. గతసారితో పోలిస్తే, ఈసారి 21 మంది BJP ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచారు. అదే సమయంలో, JD(U) గెలిచిన అభ్యర్థుల సంఖ్య గతసారి 71 నుంచి 43కి పడిపోయింది. అదే సమయంలో వికాస్ ఇన్సాన్ పార్టీ(vip), హిందూస్థానీ అవామ్ మోర్చా నుంచి చెరో నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ క్రమంలో 74 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలక పదవులు ఆశిస్తోంది.



బీజేపీ కంటే JD(U)కి తక్కువ స్థానాలు వచ్చినా.. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు నితీష్‌ కుమార్‌నే తదుపరి ముఖ్యమంత్రిగా ఆమోదించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా రేపు నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో NDA మొత్తం 125సీట్లు కైవసం చేసుకుంది. అందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు, వీఐపీ, హిందూస్థానీ అవామ్ మోర్చా పార్టీల నుంచి చెరో నలుగురు గెలిచారు.