రాహుల్ నే కాదు..హర్యాణ సీఎంని వాడుకుంటున్న పాక్

  • Published By: venkaiahnaidu ,Published On : August 29, 2019 / 09:17 AM IST
రాహుల్ నే కాదు..హర్యాణ సీఎంని వాడుకుంటున్న పాక్

కశ్మీర్ విషయంలో పాక్ తన వాదనను నెగ్గించుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు  రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఐరాసలో వేసిన పిటిషన్లో ఆయన పేరును వాడుకోగా ఇప్పుడు హర్యాణ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌నూ వదిలిపెట్టలేదు. ఈయనతోపాటు ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎమ్మెల్యే విక్రమ్‌ సైనీ పేరునూ అందులో ప్రస్తావించింది. కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ కశ్మీరీ మహిళలపై వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. 

ఇటీవల ఓ సమావేశంలో సైనీ మాట్లాడుతూ… ముస్లిం యువకులు అందమైన కశ్మీరీ యువతులను పెళ్లాడవచ్చని అన్నారు. తర్వాత సీఎం ఖట్టర్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పటి వరకు బిహార్‌ నుంచే కోడళ్లను తెచ్చుకుంటున్నామని, ఇకపై కశ్మీర్‌ నుంచి కూడా కోడళ్లను తెచ్చుకోవచ్చని ఓ సందర్భంలో ఖట్టర్‌ అన్నారు. వీరిద్దరి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ వ్యాఖ్యలనే పాక్  ఐరాసలో వేసిన పిటిషన్‌లో తెలిపింది..

ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కశ్మీర్ లోయలో పరిస్థితిని సమీక్షించడానికి రాహుల్‌గాంధీ నేతృత్వంలో విపక్షాల బృందం శ్రీనగర్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితేయ  వారిని శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుంచే అధికారులు వెనక్కి పంపేశారు. ఈ ఘటనపై రాహుల్‌ స్పందిస్తూ కశ్మీర్‌లో క్రూరమైన పాలన సాగుతోందనన్నారు. ఈ మాటలను పాక్‌ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. దీంతో రాహుల్‌ నష్టనివారణ చర్యల్లో భాగంగా వివరణ ఇస్తూ బుధవారం వరుస ట్వీట్‌ లు చేశారు.  కశ్మీర్‌ అంశం పూర్తిగా అంతర్గత వ్యవహారమని, ఇందులో పాక్ తో సహా మరే ఇతర దేశానికి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. పాక్ ఉగ్రవాదుల అడ్డా అని రాహుల్ అన్నారు.