Jamili Elections: జమిలి ఎన్నికలకు ఉన్న అవాంతరాలేంటి.. తెలంగాణ ఎన్నికల వాయిదాకు అవకాశం ఉందా?

మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఆగమేఘాల మీద జమిలి దిశగా అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం.

Jamili Elections: జమిలి ఎన్నికలకు ఉన్న అవాంతరాలేంటి.. తెలంగాణ ఎన్నికల వాయిదాకు అవకాశం ఉందా?

One Nation, One Election Push Centre Listed Pros And Cons

Jamili Elections India: తెలంగాణ ఎన్నికల వేళ.. జమిలి ఎన్నికలపై జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా మారుతోంది. దేశంలో ఎప్పుడో ఐదున్నర దశాబ్దాల క్రితం ముగిసింది జమిలి ఎన్నికల శకం.. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టాలని చూస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఇందుకు సరైన సమయం కోసం వేచిచూస్తోంది కమలదళం. దేశవ్యాప్తంగా ఒకేసారి కాకున్నా.. సగం రాష్ట్రాల్లోనైనా పాక్షికంగా జమిలి ఎన్నికలు జరిపించాలని భావిస్తోంది కేంద్ర సర్కార్. అసలు జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న అవాంతరాలేంటి? కేంద్రం ప్రతిపాదిస్తున్న పరిష్కార మార్గాలేంటి? జమిలి ప్రతిపాదనకు మద్దతిస్తున్నదెవరు? అడ్డు తగులుతున్నదెవరు? జమిలి హడావుడి మధ్య తెలంగాణ ఎన్నికల వాయిదాకు అవకాశం ఉందా, లేదా?

దేశంలో జమిలి ఎన్నికల చర్చ కుదిపేస్తోంది. తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సిన సమయంలో కేంద్రం తెచ్చిన జమిలి ప్రతిపాదన రాజకీయంగా విస్తృత చర్చకు దారితీసింది. జమిలి సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో 8 మంది సభ్యుల కమిటీని నియమించిన కేంద్ర ప్రభుత్వం.. దేశంలో ఏకకాల ఎన్నికలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పకనే చెబుతోంది. ఆర్నెల్లలో నివేదిక ఇవ్వాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీకి టైమ్ ఇచ్చినా.. ఆ టైమ్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో కేంద్రం ఏం చేస్తుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జమిలి ప్రతిపాదన చేస్తోంది. ప్రధాని మోదీ, నీతి అయోగ్ ఆధ్వర్యంలో గతంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై సమావేశాలు జరిగాయి. కానీ ఇంతవరకు స్పష్టమైన.. సమగ్రమైన పరిష్కారాలను కనుగొనలేకపోయింది కేంద్ర ప్రభుత్వం.

మళ్లీ ఇప్పుడు మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఆగమేఘాల మీద జమిలి దిశగా అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం. ఐతే ప్రస్తుత పరిస్థితులు.. రాజ్యాంగ నిబంధనలు అనుసరించి జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చేనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ.. దేశవ్యాప్తంగా జమిలి నిర్వహించడం కుదరకపోతే.. పాక్షికంగా కనీసం 10 నుంచి 12 రాష్ట్రాలతో మినీ జమిలి ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం మరో మూడు నెలల్లో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలా? లేక కేంద్రమే మూడు నాలుగు నెలల ముందు ఎన్నికలను ఎదుర్కొనేలా సర్కారును రద్దు చేస్తుందా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Also Read: ఎన్డీయేలో చేరతారా, లేదంటే ఇండియాలోనా.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్

మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 16 కల్లా తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావాల్సివుంది. అంటే ఆ లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిందే.. తెలంగాణ ఒక్కటే కాదు ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకూ జనవరి 16లోగానే ఎన్నికలు జరిపించాల్సివుంటుంది. ఆ రోజుకు మించి ఒక్కరోజు కూడా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సివుంటుంది. ప్రస్తుతం ఎన్‌డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో మెజార్టీ లేదు. లోక్‌సభలోనూ రాజ్యాంగ సవరణకు కావాల్సిన 67 శాతానికి కన్నా తక్కువ ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం మన రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐదేళ్ల కాలపరిమితి.. ఇందుకు ఒక్కరోజు అదనంగా ఏ ప్రభుత్వం కొనసాగే వీలులేదు. ఒక వేళ కొనసాగించాల్సిన పరిస్థితి వస్తే రాష్ట్రపతి పాలన విధించి.. ఆపధర్మ ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించాల్సివుంటుంది. రాష్ట్రపతి పాలన విధించాలంటే అందుకు సరైన కారణాలు ఉండాలి.. అందులో ఒకటి ఆర్థిక ఎమర్జెన్సీ, రెండు శాంతి భద్రతల సమస్య, మూడు హెల్త్ ఎమర్జన్సీ.. ప్రస్తుతం ఈ మూడు విధించే పరిస్థితి లేనందున నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిపించాల్సిందే.

Also Read: ఏపీ పాలిటిక్స్‌ను మలుపు తిప్పిన ఐటీ నోటీసులు.. చంద్రబాబు మౌనం వ్యూహాత్మకమా?

తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు వాయిదా వేసే అవకాశం లేకపోవడంతో కేంద్రం మరో ప్రతిపాదన పరిశీలిస్తోంది. మినీ జమిలి ఎన్నికలైనా జరిపించాలన్నదే బీజేపీ ప్రభుత్వ పట్టుదల కావడంతో వచ్చే ఏడాది మేలో జరగాల్సిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలు.. డిసెంబర్‌లోగా జరగాల్సిన రెండు రాష్ట్రాలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనేదే ఆ ప్రతిపాదన. అంటే తెలంగాణతోపాటు కేంద్ర ప్రభుత్వానికి మిగిలిన పది రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే.. డిసెంబర్-జనవరి మధ్యలో తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మరో ఆరు రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్‌కు సైతం ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Also Read: ఇండియా పేరు మార్పుపై పిటిషన్‭ను కొట్టివేస్తూ సూటిగా ఓ ప్రశ్న అడిగిన సుప్రీంకోర్టు

వచ్చే ఏడాది మేలో కేంద్రంతోపాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సివుంది. ఇక వచ్చే ఏడాది డిసెంబర్లో హరియాణ, మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. దీంతో ఆ రాష్ట్రాల ఎన్నికలు ముందుకు జరిపి మినీ జమిలికి సన్నాహాలు చేస్తోంది బీజేపీ. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశిత షెడ్యూల్ కన్నా ఆర్నెల్లు ముందుగా ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది. అంటే తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికలతోపాటే కేంద్రం ప్రభుత్వానికి, ఏపీతోపాటు మిగిలిన మూడు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించొచ్చు. ఇక మిగిలిన రెండు రాష్ట్రాలైన హరియాణ, మహారాష్ట్రల్లో ఎలాగూ బీజేపీ ప్రభుత్వమే ఉన్నందున.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో అసెంబ్లీ రద్దు తీర్మానం చేయించి మినీ జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Also Read: ఇండియా పేరు భారత్ గా మార్పు.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో తీర్మానం!?

రాజ్యాంగ నిబంధనలు.. నిపుణుల సూచనలు సలహాలు ఎలావున్నా.. మరో నాలుగైదు నెలల్లో మినీ జమిలి ఎన్నికలు నిర్వహించడమే ధ్యేయంగా కేంద్రం కసరత్తు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణ ఎన్నికలు వాయిదా వేసే ఆలోచన లేదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. ముందస్తుపై ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు సంఘటితం అవుతుండటంతో వచ్చే ఏడాది మే వరకు ఎన్నికలకు వెళ్లకుండా వేచిచూడటం శ్రేయస్కరం కాదని భావిస్తోంది బీజేపీ ప్రభుత్వం. విపక్షాలు బలపడేలా సమయమిస్తే తమ అధికారానికే ముప్పుగా పరిణమిస్తున్న కమలనాథులు.. ప్రత్యర్థులను కోలుకోకుండా దెబ్బతీయాలంటే సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మేలైన మార్గంగా భావిస్తున్నారు. జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచనలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సన్నాహాలు పరిశీలిస్తుంటే తెలంగాణతోపాటు 11 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించి జమిలి కోరిక తీర్చుకోవాలని చూస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో విపక్షాలు ఎలా సన్నద్ధం అవుతాయో.. బీజేపీ ఎత్తులను చిత్తు చేసే వ్యూహాలను ఎలా అమలు చేస్తాయన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అతిపెద్ద హాట్‌టాపిక్.