KGF లో బంగారాన్ని మించిన ‘పల్లాడియం’ లోహా నిక్షేపాలు..!!

  • Published By: nagamani ,Published On : June 3, 2020 / 06:01 AM IST
KGF లో బంగారాన్ని మించిన ‘పల్లాడియం’ లోహా నిక్షేపాలు..!!

కేజీఎఫ్‌లోని బిజిఎంఎల్‌ బంగారు గనుల ప్రాంతంలో బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నాయని.. వీటి వెలికితీతపై కేంద్ర ప్రభుత్వం వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనుందని ఎంపీ ఎస్‌.మునిస్వామి తెలిపారు. 

మంగళవారం (జూన్ 2,2020)న బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..ఏపీ, కర్ణాటక పరిధిలో విస్తరించి ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్)లో నిక్షేపమై ఉన్న పల్లాడియంను వెలికి తీస్తే కోలార్ జిల్లా వాసులకు అది చాలా శుభవార్త అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బిజిఎంఎల్‌ పునరుజ్జీవనానికి సంబంధించి గని కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకు వెళ్లి విజ్ఞప్తి చేశామన్నారు.

ఆ సమయంలో ప్రధాని సూచనల మేరకు కేంద్ర గనుల శాఖా మంత్రి ప్రహ్లాద్‌జోషి నేతృత్వంలో ఒక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి బిజిఎంఎల్‌ను సందర్శించి బంగారు నిక్షేపాల నమూనాలను ల్యాబొరేటరికి పంపినపుడు.. బంగారం కంటే విలువైన పల్లాడియం లోహ నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) తరహాలో ఈ గనులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అన్నారు. దీనిపై వచ్చే పార్లమెంట్‌ సమావేశాలలో తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశముందన్ని అన్నారు. 

పల్లాడియం అంటే: ప్లాటినం గ్రూపు లోహాలకు చెందిన ఇది వెండి రంగులో మెరుస్తూ ఉంటుంది. బంగారంతో పోలీస్తే పల్లాడియం తక్కువ ఉష్ణోగ్రతకే కరుగిపోతుంది.  ప్రపంచంలో చాలా అరుదుగా లభిస్తున్నందున ఈ అరుదైన లోహంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. కార్ల ఇంజిన్‌ విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి రష్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో అధికంగా ఉత్పత్తి అవుతున్నా  డిమాండుకు తగినంతగా పల్లాడియం లభ్యత లేదు. దీంతో పల్లాడియం అంటే బంగారం కంటే విలువైనది గామారింది. పల్లాడియం  గ్రాము ధర బంగారం, ప్లాటినంల కంటే చాలా  ఎక్కువేనని నిపుణులు అంటున్నారు.

Read: ఆ పార్టీకి పని చేయనన్న ప్రశాంత్ కిశోర్