పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..వేడి పుట్టిస్తాయా

  • Published By: madhu ,Published On : November 18, 2019 / 12:10 AM IST
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..వేడి పుట్టిస్తాయా

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 20 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 17వ లోక్‌సభ ఏర్పాటైన తర్వాత.. రెండో సెషన్ కావడంతో కేంద్రం తన పట్టు నిరూపించుకునేందుకు సిద్ధమైంది. అటు కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు తమ తమ వ్యూహాలతో సిద్ధమయ్యాయి. వాటిని తిప్పికొట్టేందుకు.. మోదీ సర్కార్ కూడా సన్నద్ధమైంది. అయోధ్య తీర్పు, రఫేల్‌పై క్లీన్ చిట్‌తో బీజేపీ ఉత్సాహంగా కనిపిస్తోంది. అన్ని అంశాలపై చర్చకు.. ప్రభుత్వం సిద్ధమని ప్రధాని మోదీ కూడా ప్రకటించేశారు. నిరుద్యోగం, ఆర్థికమాంద్యంతో పాటు ఇతర సమస్యలపై సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం నుంచి పార్లమెంట్ ఉభయసభల్లో శివసేన ప్రతిపక్షంగా ఉండనుంది.

రాజ్యసభకు ఇవి 250వ సమావేశాలు. శివసేన ఎంపీలకు లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్ష స్థానాల్లో సీట్లు కేటాయించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. ఇదిలా ఉంటే…సమావేశాలు సాఫీగా జరిగేందుకు..పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో.. పార్లమెంట్ లైబ్రరీ హాల్‌లో ఆల్‌పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు 27 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

అలాగే..ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతోనూ ప్రధాని మోడీ సమావేశమయ్యారు. మహారాష్ట్రలో బీజేపీకి శివసేన దూరమైన నేపథ్యంలో.. స్వల్ప విభేదాలున్నా దేశ ప్రయోజనాల కోసం సమిష్టిగా ముందుకు సాగాలని కోరారు. ఎన్డీయే భేటీ సానుకూలంగా జరిగిందని, తమ కూటమి దేశంలోని వైరుధ్యాలను ప్రతిబింబిస్తూ 130 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అద్దంపడుతుందని సమావేశం తర్వాత ప్రధాని ట్వీట్‌ చేశారు. రైతులు, యువత, మహిళలు, నిరుపేదల జీవితాల్లో మార్పు సాధించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని జారవిడుచుకోమని చెప్పారు.
Read More : అస్త్రశస్త్రాలతో పార్టీలు సిద్ధం : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు