PUBG గేమ్ కోసం రూ.16 లక్షలు ఖర్చు చేసిన 17ఏళ్ల కుర్రాడు

  • Published By: naveen ,Published On : July 5, 2020 / 10:25 AM IST
PUBG గేమ్ కోసం రూ.16 లక్షలు ఖర్చు చేసిన 17ఏళ్ల కుర్రాడు

పబ్జీ(PUBG) గేమ్.. ఎంత డేంజర్ అన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. పిల్లలు, యువత జీవితాలను పబ్జీ నాశనం చేస్తోంది. ఇప్పటికే పబ్జీ గేమ్ కారణంగా అనేకమంది కుర్రాళ్లు పిచ్చోళ్లయ్యారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. కొంతమంది ఉన్మాదుల్లా తయారయ్యారు. పబ్జీ కారణంగా యువతలో హింసాత్మక ధోరణి పెరిగిపోతోందని, దాన్ని బ్యాన్ చేయాలనే డిమాండ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. పబ్జీ వల్ల పిల్లలు ఇప్పుడు దొంగలుగా కూడా మారుతున్నారు. ఓ టీనేజ్‌ కుర్రాడు ఈ గేమ్‌ కోసం దొంగగా మారాడు. తన తండ్రి అకౌంట్‌ నుంచి ఏకంగా రూ.16 లక్షలు ఖర్చు చేశాడు.

పబ్‌ జీ మొబైల్ అకౌంట్ అప్‌గ్రేడ్, ఇన్-యాప్ కొనుగోళ్ల కోసం రూ.16లక్షలు ఖర్చు:
పంజాబ్‌లోని ఖరార్‌కి చెందిన ఓ బాలుడు ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు ప్రతీరోజూ తన తల్లి స్మార్ట్‌ఫోన్‌ను తీసుకునేవాడు. స్మార్ట్‌ ఫోన్ తీసుకున్న ఆ కుర్రాడు ఆన్‌లైన్‌ క్లాసులు వినకుండా పబ్‌ జీకి ఎడిక్ట్ అయ్యాడు. ఎంతలా అంటే పబ్‌ జీ మొబైల్ అకౌంట్ అప్‌గ్రేడ్, ఇన్-యాప్ కొనుగోళ్ల కోసం ఏకంగా 16లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. పబ్‌ జీలో తన టీమ్ మేట్స్‌ కు కూడా అతనే డబ్బులు పెట్టి మొబైల్ అకౌంట్ అప్‌‌గ్రేడ్ చేయించాడు.

వైద్య ఖర్చుల కోసం దాచుకున్న డబ్బుని ఖర్చు పెట్టేసిన కొడుకు:
తల్లిదండ్రుల బ్యాంక్‌ ఖాతాల వివరాలన్నీ తెలుసుకుని.. ఆ డబ్బును పబ్‌జీ కోసం వాడాడు. అకౌంట్ నుంచి లావాదేవీలు జరిపినట్లుగా మెసేజ్ రాగానే వాటిని డిలీట్ చేసేవాడు. అలా చాలా రోజులు అతని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించలేదు. ఇటీవల బ్యాంకు స్టేట్‌మెంట్స్ పరిశీలించడంతో భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు తెలిసి తండ్రి షాక్ తిన్నాడు. వైద్య అవసరాల కోసం దాచుకున్న డబ్బును కొడుకు ఇలా తగలేయంతో తల పట్టుకున్నారు తల్లిదండ్రులు. కుర్రాడి తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. స్మార్ట్‌ఫోన్‌ను అదే పనిగా ఉపయోగిస్తుంటే ఆన్‌లైన్ చదువు కోసమే అనుకున్నాం కానీ ఇంతపని చేస్తాడనుకోలేదని తల్లిదండ్రులు వాపోయారు.

PUBG: ఎలా ఆడతారు? ఇందులో గెలుపు ఓటములు ఏమిటి?
పబ్‌ జీ… ఈ మధ్య కాలంలో పిల్లలు, యువత నోట ఈ గేమ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇదొక పాపులర్ వీడియో గేమ్. ‘ప్లేయర్ అన్‌నోన్స్ బ్యాటిల్‌ గ్రౌండ్స్’కు(PLAYER UNKNOWN’S BATTLE GROUNDS)… సంక్షిప్త రూపమే పబ్‌జి. దీన్ని దక్షిణ కొరియాకు చెందిన పబ్‌జి కార్పొరేషన్ తయారు చేసింది. 2017లో ఇది విడుదలైంది. కంప్యూటర్ లేదా మొబైల్‌లో ఒంటరిగా లేదా జట్టుతో కలిసి ఈ ఆటను ఆడొచ్చు. పబ్‌జిలోకి లాగిన్ అయ్యాక ఫేస్‌బుక్ లేదా మరేదైనా సోషల్ అకౌంట్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదా గెస్ట్ మోడ్‌లో కూడా గేమ్‌ ఆడొచ్చు. ఒంటరిగా ఆడుతున్నపుడు ఇతరుల సహకారం లభించదు. మీరు ఒక్కరే ఆడుతున్నప్పుడు మిగతా 99 మందిని (తక్కువ నిడివి ఉన్న గేమ్ మోడ్‌లో అయితే 27 మందిని) చంపాల్సి ఉంటుంది. జట్టుగా కలిసి ఆడుతున్నపుడు ఇద్దరు లేకుంటే నలుగురు కలిసి ఇతరులను చంపాల్సి ఉంటుంది. వీరితో వర్చువల్‌గా మాట్లాడుకోవచ్చు.

యుద్ధభూమి:
* ఆటలో 8X8 కిలోమీటర్ల యుద్ధ భూమి ఉంటుంది. ఇందులో పలు భవనాలు, శిథిలాలు, వాహనాలు, ఆయుధాలు, సముద్రం తదితరాలు ఉంటాయి.
* ఇందులో మొదట విమానం నుంచి ప్యారాషూట్‌ ద్వారా ‘హీరో’ యుద్ధభూమిలో అడుగుపెడతాడు.
* ఇక్కడకు దిగిన తర్వాత తనను తాను రక్షించుకోడానికి హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వంటివి సాధించాలి. ఇతరులను హతమార్చేందుకు ఆయుధాలను సేకరించాల్సి ఉంటుంది.

ఆయుధాలు:
* ఈ గేమ్‌ని ఖాళీ చేతులతో కూడా ఆడొచ్చు. కాకుంటే ఇతరులను దూరం నుంచి చంపాలంటే ఆయుధాల అవసరం ఉంటుంది.
* కత్తులు, రకరకాల తుపాకులు, బుల్లెట్లు, బాంబులు, గ్రెనేడ్‌లు, స్మోక్ గ్రెనేడ్‌లు తదితరాలుంటాయి.
* వీటితో పాటు గాయపడినపుడు కట్లు వేసేందుకు బ్యాండెయిడ్స్, ప్రథమ చికిత్స కిట్లు, ఎనర్జీ డ్రింకులు ఉంటాయి. ఇవన్నీ దొరకాలంటే యుద్ధభూమిలో ఉన్న భవనాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
* అలాగే వాహనాలు కూడా ఉంటాయి. వాటిని డ్రైవ్ చేసుకొని వెళ్లొచ్చు.

ఆడటం ఎలా:
* చేతిలో ఉన్న ఆయుధాలతో అవతలి వారిని చంపుకుంటూ వెళ్లాలి. లేకుంటే అవతలివారి చేతుల్లో చావాల్సి ఉంటుంది. అలాగే గేమ్‌లో రెడ్ జోన్, నీలి మేఘాలు తరుముకుంటూ వస్తాయి.
* రెడ్ జోన్‌లో ఉన్నప్పుడు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. ఇక్కడ బాంబు దాడులు ఎక్కువగా జరుగుతుంటాయి.
* నీలి మేఘాలు తరుముకుంటూ వస్తాయి. వీటిలో చిక్కుకుంటే ఖేల్ ఖతం. అందుకే వీటి బారిన పడకుండా.. గేమ్‌లో సూచించిన సర్కిల్లో ఉంటూనే గేమ్ ఆడాలి.
* గేమ్‌లో సర్కిల్ చిన్నదవుతూ.. అందరికీ వీలైనంతగా ఒకరికొకరిని దగ్గర చేస్తూ ఉంటుంది. దీంతో గేమ్ రసవత్తరంగా మారుతుంది.
* సర్కిల్ బయటకు వస్తే నీలి మేఘాల్లో చిక్కుకుని చనిపోతారు.
* ఇది గేమ్‌కి సంబంధించి ప్రాథమిక సమాచారం మాత్రమే.. ఇందులో నైపుణ్యం పెరిగే కొద్దీ.. లెవెల్స్ మారుతూ ఉంటాయి. అలాగే కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి.
* ఈ వర్చువల్ కాయిన్స్‌తో గన్స్, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయొచ్చు. అయితే ఇది పిల్లల్లో హింసాత్మక ధోరణిని ప్రేరేపించేలాగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఆడుతున్న వీడియో గేమ్స్ జాబితాలో ఇది ముందుంది.