Murder : కూరగాయలు కోయమన్నందుకు కత్తితో అత్తను చంపిన కోడలు
కూరగాయలు కట్ చేసే విషయం వచ్చిన గొడవకాస్తా అత్త మరణానికి కారణమైంది.కూరగాయలు కట్ చేయమన్న అత్తపై కోడలు చాకుతో దాడి చేసి చంపిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.

Vegetable Cutting Between Daughter In Law And Mother In Law
Vegetable Cutting Between Daughter In Law And Mother In Law : అత్తాకోడళ్లు అంటేనే ఏదో ఆగర్భశతృవులు అన్నట్లుగా నాటుకుపోయింది ఈ సమాజంలో. అందుకేనేమో అత్తాకోడళ్ల మధ్య ఎక్కడో గానీ సఖ్యత ఉండదనే అంటారు. ఇలా అత్తాకోడళ్ల గురించి చెప్పుకుంటే వరకట్న వేధింపుల నుంచి మొదలైతే..అత్తను ఇంట్లోంచి గెంటేసిన కోడలు వరకూ ఎన్నో ఉంటాయి.ఈక్రమంలో ఓ అత్త తన కోడల్ని కూరగాయలు కోమని ఇచ్చింది.కానీ కోడలు మాత్రం ఆ చాకుతో కూరగాయలు కోయకుండా అత్తను పొడిచి చంపేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. ఈఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
కూరగాయలు కోయమని చెప్పిన అత్తనే చాకుతో పొడిచిన కోడలు ఘటన జైపూర్ లో వెలుగులోకి వచ్చింది. కూరగాయలు సరిగా కోయలేదని అత్త తిట్టటంతో కోడలికి పట్టలేనికోపం వచ్చింది. ఆకోపంలో విచక్షణ మరిచిపోయిన కోడలు అత్తపై దాడి చేయగా తీవ్రంగా గాయపడిన అత్త చనిపోయింది. ఒకటీ రెండు కాదు ఏకంగా కత్తితో 26సార్లు అత్తను కోడలు పొడవటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.జైపూర్‌లోని భంక్రోటాకు చెందిన 62 ఏళ్ల మోహినీ దేవి కొడుకుకు వివాహం చేసింది. కోడలి పేరు మమతాదేవి. కొడుకు పెళ్లి జరిగి 14ఏళ్లు అయ్యింది. వారికి ఇద్దరు మగపిల్లలు, ఓ ఆడపిల్ల ఉన్నారు. కానీ అత్త మోహినీదేవికి, కోడలు మమతాదేవికి ఎప్పుడు గొడవలే. ఒకరంటే మరొకరికి అస్సలు పడేది కాదు. అయినా వేరుగా ఉండకుండా కలిసే ఒకే ఇంటిలో ఉంటారు.
ఈ క్రమంలో గత మంగళవారం (ఆగస్టు31,2021) అత్తగారు వంట చేస్తూ కోడలిని కూరగాయలు తరుగమని ఇచ్చింది. కానీ కోడలు కూరగాయలు సరిగా కోయలేదట.దీంతో అత్త మోహినీదేవికి చిరాకు వచ్చింది. పెళ్లి అయి 15 ఏళ్లు కావస్తోంది. ఇంకా నీకు కూరగాయలు తరగటమే రాదా అంటూ తిట్టింది. దాంతో కోడలు కస్సుమంటూ లేచింది. మాటా మాటా పెరిగింది. ఇద్దరి మధ్య మాటలు తీవ్రంగా వాదోపవాదాలకు దారితీశాయి.అలా కోపంతో ఊగిపోయిన కోడలు మమతాదేవి అత్తపై చేతిలో ఉన్న చాకుతో దాడికి చేసింది విచక్షనారహితంగా పదే పదే పొడిచేసింది. అలా ఏకంగా 26సార్లు పదునైన చాకుతో పొడిచేసరికి తీవ్ర రక్తస్రావంతో అత్త కుప్పకూలిపోయింది. కాసేపటికి కోపం తగ్గిన కోడలు జరిగిందేమిటో గ్రహించేసరికి జరగాల్సిన దారుణం అంతా జరిగిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న అత్తను చూసేసరికి భయం పట్టుకుంది మమతకు. వెంటనే బట్టలు సర్ధుకుని అక్కడనుంచి పిల్లల్ని తీసుకుని పరారైంది.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే మోహినీదేవి కొడుకుకు ఫోన్ చేసిన విషసయం చెప్పారు.దీంతో హుటాహుటిన ఇంటికి వచ్చిన కొడుకు రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న తన తల్లిని వెంటనే ఎస్‌ఎంఎస్ ఆస్పత్రికి తరలించాడు.కానీ అప్పటికే తీవ్ర రక్తస్రావం కావటంతో చికిత్స పొందుతూ బుధవారం (సెప్టెంబర్ 1,2021) రాత్రి కన్నుమూసింది. తన తల్లిని అంత దారుణంగా చంపిన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మమత కోసం గాలించి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.