Lionel Messi : మెస్సీ భారత్‌లో పూర్తి స్థాయి మ్యాచ్ ఎందుకు ఆడడు? ఇన్సూరెన్స్ తో లింక్ ఏంటి?
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ (Lionel Messi) ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు.
Why Lionel Messi Wont Play A Full Match In India
Lionel Messi : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం భారత్‌కు చేరుకున్నారు. ఇప్పటికే కోల్‌కతా, హైదరాబాద్ నగరాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక నేడు, రేపు ఆయన ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో సందడి చేయనున్నాడు. శనివారం ఉప్పల్ మైదానంలో మెస్సీ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. అయితే.. అది పూర్తి స్థాయి మ్యాచ్ కాదు.
ఇదిలా ఉంటే.. తమ అభిమాన ఆటగాడు అయిన మెస్సీ పూర్తి స్థాయిలో ఓ ఫుల్‌బాట్ మ్యాచ్ ను మనదేశంలో ఆడితే చూడాలని ఎంతో భారత అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వారికి నిరాశ తప్పేలా లేదు. ఈ పర్యటనలో మెస్సీ పూర్తి స్థాయి మ్యాచ్ ఆడే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
ఇందుకు ప్రధాన కారణం ఇన్సూరెన్స్. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. 38 ఏళ్ల మెస్సీ తన ఎడమ కాలికి ఏకంగా 900 మిలియన్ డాలర్ల బీమా చేయించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అథ్లెట్ బీమా పాలసీలలో ఇది ఒకటి. ఈ బీమా ఫుట్‌బాల్ క్రీడాకారుడికి కెరీర్‌కు ముప్పు కలిగించే గాయం వల్ల కలిగే ఏదైనా ఆర్థిక నష్టం నుండి తనను తాను రక్షించుకోవడంలో సహాయపడుతుంది.
ఈ పాలసీ కేవలం తన సొంతదేశమైన అర్జెంటీనా, తాను ప్రాతినిధ్యం వహించే క్లబ్ ఇంటర్ మయామి తరుపున అధికారికంగా షెడ్యూల్ చేయబడిన మ్యాచ్‌ల సమయంలోనే వర్తిస్తుంది. అంటే మెస్సీ వీటి తరుపున ఆడుతూ గాయపడితేనే ఆర్థిక పరిహారం అందుతుంది. అలా కాకుండా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతూ గాయపడితే వర్తించదు. అప్పుడు అతడు భారీ మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది. అందుకనే మెస్సీ భారత్‌లో ఎలాంటి పూర్తి స్థాయి మ్యాచ్‌లు ఆడడం లేదు.
దిగ్గజ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు మైఖేల్ జోర్డాన్ కు చికాగో బుల్స్‌తో ఓ కాంట్రాక్టు ఉంది. అయితే అందులో లవ్ ఆఫ్ ది గేమ్ అనే నిబంధన ఉంది. దీని ప్రకారం.. ఆయన ఎక్కడైనా, ఎవరితోనైనా బాస్కెట్‌బాల్ ఆడే స్వేచ్ఛ ఉండేది. అలాంటి సమయంలో జోర్డాన్ ఆడుతూ గాయపడి తమ తరుపున ఆడకపోయినా కూడా చికాగో బుల్స్ అతడికి జీతాన్ని చెల్లిస్తుంది. అయితే.. మెస్సీ బీమాలో అలాంటి వెసులుబాటు ఏదీ లేనట్లుగా తెలుస్తోంది.
