GST : అసలే కష్టకాలం, ఆపై అదనపు భారం… కరోనా బాధితులపై GST బాదుడు

కరోనా మహమ్మారి కోట్లాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇది చాలదన్నట్టు వారిపై జీఎస్టీ రూపంలో అదనపు భారం పడింది. విపత్కర సమయంలోనూ కరోనా బాధితులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మోత మోగుతూనే ఉంది.

GST : అసలే కష్టకాలం, ఆపై అదనపు భారం… కరోనా బాధితులపై GST బాదుడు

Gst

GST : కరోనా మహమ్మారి కోట్లాది కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఇది చాలదన్నట్టు వారిపై జీఎస్టీ రూపంలో అదనపు భారం పడింది. విపత్కర సమయంలోనూ కరోనా బాధితులపై వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మోత మోగుతూనే ఉంది. కొవిడ్‌ రోగులకు ఉపయోగపడేవి, చికిత్సలో వాడే మందులు, పరికరాలు అన్నింటిపైనా 6 నుంచి 18 శాతం దాకా జీఎస్టీ భారం పడుతోంది. కరోనాతో ఆస్పత్రుల్లో చేరిన వారికి వైద్యంతో పాటు జీఎస్టీ రూపేణా పడే భారం అదనంగా 15 శాతం దాకా ఉంటోంది.

రెమ్‌డెసివిర్, మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు, సంబంధిత పరికరాలపై 12 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. అత్యధిక ఔషధాలపై 12 నుంచి 18 శాతం భారం పడుతోంది. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు, పీపీపీ కిట్లు సహా అన్నింటిపైనా ఈ బాదుడు కొనసాగుతోంది. వినియోగం భారీగా ఉంటున్న నేపథ్యంలో వీటిపై జీఎస్టీని తగ్గించాలని ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించాయి. కేంద్రం వెంటనే స్పందిస్తే బాధితులకు కొంతైనా ఊరట కలుగుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్లులు, ఫేస్, సర్జికల్‌ మాస్కులు, వెంటిలేటర్లు, కృత్రిమశ్వాస పరికరాలపై కస్టమ్స్‌ డ్యూటీని కేంద్ర సర్కారు ఇటీవల రద్దు చేసింది. మిగతా వాటిపై జీఎస్టీ కొనసాగుతోంది.

పరీక్ష నుంచి వెలుపలికి వచ్చే వరకూ భారమే:
కరోనా తీవ్రత ఆధారంగా రోగికి వినియోగించే మందులు, పరికరాల ఆధారంగా బిల్లుల్లో 15 నుంచి 20 శాతం భారం పడుతోంది. కరోనా పరీక్షతో మొదలుకుని బాధితుడు ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వెలుపలికి వచ్చే వరకూ ఉపయోగించే అన్నింటి పైనా జీఎస్టీ భారం పడుతోందని కరోనా ఆసుపత్రి డాక్టర్ స్పష్టం చేశారు. ఇది వారిపై అదనపు భారం మోపుతోందని, ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తే కొంతైనా మేలు జరుగుతుందని అన్నారు.

12 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్నవి:
> మెడికల్‌గ్రేడ్‌ ఆక్సిజన్‌
> కొవిడ్‌ నిర్ధారణ కిట్లు, రీజెంట్‌లు
> వెంటిలేటర్లు, ఇతర శ్వాస పరికరాలు
> మెకానికల్‌ విడిభాగాలు, ఫిల్టర్లు ఉన్న మాస్కులు
> రబ్బరు గ్లౌజ్‌లు
> రక్షణ కళ్లద్దాలు
> బ్యాండేజీలు, ఆపరేషన్‌కు వాడేవి

18 శాతం జీఎస్టీ పరిధిలోనివి:
> స్టెరిలైజేషన్‌కు ఉపయోగించే ఇథైల్‌ ఆల్కహాల్‌
> సబ్బులు, చర్మ శుభ్రతకు వినియోగించేవి
> శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌లు
> ప్రమాదకర వ్యర్థాలు వేసేందుకు వాడే కవర్లు
> ప్లాస్టిక్‌తో చేసిన రక్షణ పరికరాలు
> క్రిమి సంహారకాలు
> టిష్యూ పేపర్లు, న్యాప్‌కిన్లు
> వస్త్రంతో తయారు చేసిన చేసిన గ్లౌజ్‌లు, ఇతర రక్షణ ఉత్పత్తులు
> సెల్యులోజ్‌ ఫైబర్‌తో చేసిన మాస్క్‌లు
> తలకు వాడే నెట్‌లు
> రోగుల నుంచి ఫ్లూయిడ్స్‌ సేకరించే శానిటరీవేర్‌
> ల్యాబొరేటరీ పరికరాలు, స్టెరిలైజేషన్‌కు వాడేవి
> థర్మామీటర్లు, సైకోమీటర్లు, హైగ్రోమీటర్‌
> క్యాలిబరేటింగ్‌ మీటర్లు