అసోంలో వరదలు : రోడ్డు మీదకు వచ్చి పడుకున్న ఖడ్గమృగం

  • Published By: madhu ,Published On : July 19, 2020 / 12:11 PM IST
అసోంలో వరదలు : రోడ్డు మీదకు వచ్చి పడుకున్న ఖడ్గమృగం

అసోంలో వరదలతో వేలాది మంది నిరాశ్రయులవగా.. పశుపక్ష్యాదులు అదేస్థాయిలో మృతి చెందాయి. ఖజిరంగ జాతీయ ఉద్యానవనంలో 96 జంతువులు మృతిచెందాయి. ఆ ఉద్యానవనం నుంచి బయటికివచ్చింది ఓ ఖడ్గమృగం.

బాగోరి అటవీ రేంజ్‌ పరిధిలోని బందర్ ధుబీ ప్రాంత సమీపంలో జాతీయ రహదారి-37పైకి చేరి విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. ఖడ్గమృగ్గాన్ని పార్కులోకి పంపేందుకు సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు.

పార్కు సిబ్బంది, నాగాన్ పోలీసులు ఈ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ వాహనదారులను నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. ఆ ఖడ్గమృగం బలహీనంగా ఉండటంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు.

మరోవైపు…అసోంలో వ‌ర‌ద‌ల ఉదృతి ఇంకా కొన‌సాగుతూనే ఉంది. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇప్పటి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారిసంఖ్య 104కు చేరుకుంది. వీరిలో కొండ‌చ‌రియ‌లు విరిగ‌ప‌డి 26 మంది చ‌నిపోయారు. రాష్ర్టంలోని 33 జిల్లాల‌కు గానూ 28 జిల్లాల్లో వ‌రద భీభ‌త్సం సృష్టిస్తోంది.

దీంతో దాదాపు 40 ల‌క్షల‌మంది నిరాశ్రయులు అయ్యారు. రోజురోజుకు పెరుగుతున్న భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇప్పటికే 1.3 ల‌క్షల హెక్టార్ల పంట నాశ‌న‌మైన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

గ‌త సంవ‌త్సరంతో పోలిస్తే ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని, మ‌ర‌ణాల సంఖ్య కూడా అధికంగా ఉంద‌ని అసోం స్టేట్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ దృవీక‌రించింది.