Neeraj Chopra : ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Neeraj Chopra : ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు అస్వస్థత

Neeraj Chopra

Neeraj Chopra falls ill : టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హరియాణలోని పానిపట్‌ సమీపంలోని తన స్వగ్రామం సమల్ఖాకు బయల్దేరాడు.

ఢిల్లీ నుంచి పానిపట్‌ వరకు నీరజ్‌ భారీ కాన్వాయ్‌తో వెళ్లాడు. స్వగ్రామం చేరుకునేలోపు అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం నుంచి కారు టాప్‌పై ఉండి అందరికీ అభివాదం చేస్తూ స్వర్ణ పతకం చూపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నాడు. 6 గంటల పాటు సాగిన ఈ యాత్రలో నీరజ్‌ నీరసించిపోయాడు.

ఒలింపిక్స్‌ తర్వాత తొలిసారి స్వగ్రామం సమల్ఖాకు మంగళవారం వెళ్లిన నీరజ్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నీరజ్‌పై పూల వర్షం కురిపించారు. పానిపట్‌కు చేరుకున్న అనంతరం నీరజ్‌ నీరసించడంతో వెంటనే స్నేహితులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

నీరజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో నీరజ్ కు నెగటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్‌ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో అనారోగ్యానికి గురయ్యాడు.

గత కొంతకాలంగా నీరజ్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ఇటీవల హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి అతను గైర్హాజరయ్యాడు. అయితే ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో మాత్రం నీరజ్‌ పాల్గొన్నాడు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి మోడీని కలిసి అభినందనలు పొందాడు.