G20 Summit 2023 : సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు .. కేవలం ఆ దుకాణాల నిర్వహణకు మాత్రమే అనుమతి
సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటల వరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు

Traffic restrictions In delhi
G20 Summit Traffic Restrictions In Delhi: ప్రపంచ ఆర్థిక సవాళ్లపై చర్చించే జీ-20 సదస్సుకు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీ వేదికగా G20 శిఖరాగ్ర సమావేశాలు జరగనున్నాయి. ప్రపంచ దేశాధినేతలు G20 శిఖరాగ్ర సమావేశాలకు వస్తుండటంతో ప్రభుత్వం పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌తో సహా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ప్రధానులు, అధ్యక్షులతో పాటు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గోనున్నారు. అమెరికా అధ్యక్షుడు ఈనెల 7న ఢిల్లీకి చేరుకుంటారు. G20 సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి ఉంటాయి.
పూర్తి వివరాలు ఇలా..
– సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రగతి మైదాన్ భారత్ మండపంలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశాలకు ప్రపంచ దేశాధినేతలు వస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఢిల్లీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
– న్యూఢిల్లీతో సహా ఢిల్లీ అంతటా అన్ని మెడికల్ షాపులు, కిరాణా దుకాణాలు, పాల బూత్‌లు, కూరగాయలు, పండ్ల దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చారు.
– ప్రగతి మైదాన్ నియంత్రిత జోన్లోకి ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా సిబ్బంది, వైద్య నిపుణులు, పారా మెడిక్స్ వారి ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వ వాహనాలకు అనుమతి ఉంటుంది.
– అన్నిరకాల వాణిజ్య వాహనాలు, బస్సులు రింగ్ రోడ్ దాటి ఢిల్లీ సరిహద్దులవైపు రోడ్ నెట్‌వర్క్‌లో అనుమతి ఉంటుంది.
– విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు , ISBTలకు ప్రయాణీకులకు అనుమతి.
– న్యూ ఢిల్లీ జిల్లాలో హోటళ్లు, ఆసుపత్రులు వెళ్లే హౌస్ కీపింగ్, క్యాటరింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ వాహనాలకు వెరిఫికేషన్ తర్వాతే అనుమతి ఉంటుంది.
– G20 సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రగతి మైదాన్ పరిసర ప్రాంతాల్లోకి ప్రైవేట్ వాణిజ్య వాహనాలకు అనుమతి ఉండదు.
– ఢిల్లీలో సుప్రీంకోర్టు మెట్రో స్టేషన్ మినహా అన్ని మెట్రో స్టేషన్లలో ప్రయాణీకులకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
– సెప్టెంబర్ 9 ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11 గంటల వరకు సుప్రీంకోర్ట్ మెట్రో స్టేషన్లో బోర్డింగ్ డిబోర్డింగ్ ఉండదని వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు
– న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) ప్రాంతం అధికార పరిధి వెలుపల, జాతీయ రహదారి 48 (NH-48) మినహా సాధారణ ట్రాఫిక్ ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
– ప్రజలు మెట్రో సేవలు వినియోగించుకోవచ్చని, సెంట్రల్ ఢిల్లీలో ప్రజా రవాణాకోసం కొన్నినిబంధనలు పాటించాలని సూచించారు.
– G 20 సమావేశాల సందర్భంగా ఢిల్లీలో లాక్డౌన్ పరిస్థితులు ఉండవని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
– ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి, G-20 సమ్మిట్ సమయంలో అధునాతన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, సాంకేతికతలను ఉపయోగించుకుని స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్, మొబైల్ యాప్‌లద్వారా రియల్ టైం ట్రాఫిక్ అప్డేట్లు, ట్రాఫిక్ నిఘా వ్యవస్థలు సజావుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
– సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఆంక్షలపై ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.
– G20 ప్రతినిధులు ఇండియా గేట్, రాజ్‌ఘాట్, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI) సహా పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న నేపథ్యంలో పలు రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.