PNB స్కామ్ : నీరవ్ బెయిల్ మరోసారి తిరస్కరణ

  • Published By: venkaiahnaidu ,Published On : October 26, 2020 / 08:22 PM IST
PNB స్కామ్ : నీరవ్ బెయిల్ మరోసారి తిరస్కరణ

UK court rejects Nirav Modi’s bail పీఎన్ బీ స్కామ్ కేసులో నీరవ్ మోడీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నీరవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను లండన్‌ కోర్టు మరోసారి తిరస్కరించింది. నీరవ్ బెయిల్ ను లండన్ కోర్టు తిరస్కరించడం ఇది ఏడోసారి. గతంలో ఐదు సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకొని భంగపడిన తర్వాత..రాజకీయ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నాడు నీరవ్. అయితే,అప్పుడు కూడా నీరవ్ కు చుక్కెదురైంది.



రూ.13,500కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ…2018లో దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన కోసం తీవ్రంగా గాలించిన భారత అధికారులు లండన్ లో నీరవ్ తలదాచుకుంటున్నట్లు గతేడాది గుర్తించారు. స్కాట్లాండ్ యార్డ్ జారీచేసిన వారెంటుపై 2019 మార్చి 19 న నీరవ్ మోడీని అరెస్టు చేశారు. అప్పటి నుంచి లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో నీరవ్ ఉన్నాడు.



నీరవ్ ని భారత్ కి అప్పగింత విచారణ రెండో దశ విచారణలో భాగంగా వచ్చే నెలలో వీడియో లింక్ ద్వారా కోర్టు ఎదుట నీరవ్ మోడీ హాజరుకానున్నారు. కాగా, గత నెలలో యూకే కోర్టు.. నీరవ్ అప్పగింతపై కొనసాగుతున్న విచారణలో తదుపరి షెడ్యూల్ విచారణ జరుగనున్న నవంబర్-3 వరకు నీరవ్ మోడీ రిమాండ్‌ను పొడిగించిన విషయం తెలిసిందే.



గత నెలలో నీరవ్ తరపున న్యాయవాది లండన్‌ కోర్టుకు హాజరై.. నీరవ్ మోడీకి భారతదేశంలో న్యాయమైన విచారణ జరిగే అవకాశం లేదని చెప్పారు. తన కేసును రాజకీయం చేయడం, భారతీయ జైళ్లలో తగిన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల అతను ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం అధికంగా ఉన్నదని స్పష్టం చేశారు. అయితే,నీరవ్ మోడీని త్వరగా భారత జైలు ఊచలు లెక్కపెట్టించడానికి సీబీఐ,ఈడీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి.