చైనాకి చెక్… భారత్ కు పూర్తి అండగా అమెరికా

చైనాకి చెక్… భారత్ కు పూర్తి అండగా అమెరికా

ఇండియా , చైనా సరిహద్దు వివాదం ముదురు పాకాన పడుతోంది . ఒక పక్క చర్చలు సాగుతుండగానే చైనా సరిహద్దుల్లోకి భారీగా సైనిక దళాలను తరలిస్తోంది . చైనా కు ధీటుగా భారత్ కూడా సైనిక దళాలను తరలించింది . పైగా భారత వైమానిక దళం యుద్ధ విమానాలు సరిహద్దు గగన తలం పై నిత్యం చక్కర్లు కొడుతున్నాయి . పెట్రోలింగ్ చేస్తున్నాయి . మరో వైపు అగ్ర రాజ్యం అమెరికా భారత్ కు అండగా రంగం లోకి దిగుతోంది . ఆసియాలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆగడాలకు చెక్ పెట్టక తప్పదని అమెరికా తేల్చి చెప్పింది .

జర్మనీ నుంచి పది వేల మంది సైనిక దళాలను అమెరికా వెనక్కు తీసుకు వస్తోంది . చైనా కమ్మూనిస్టు పార్టీ నుంచి ఇండియాకు ప్రమాదం పొంచి ఉందని … అందుకే ఐరోపా దేశాల నుంచి సైనిక దళాలను వెనక్కు తీసుకు వస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో ప్రకటించారు. సౌత్ చైనా సముద్రం సరిహద్దుగా గల అనేక దేశాలను చైనా ఇక్కట్ల పాలు చేస్తోందన్నారు. ఐరోపా నుంచి అమెరికా సైనిక దళాలను వెనక్కు రప్పించడం మన సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది 

 చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉందని కూడా పొంపియో చెప్పారు. ఇండియా , దక్షిణ ఆసియా దేశాలకు చైనా నుంచి ప్రమాదాలు పెరిగాయన్నారు . ఈ కారణంగానే ఐరోపాలో తమ దళాలను తగ్గిస్తున్నట్లు అయన గురువారం చెప్పారు . ఐరోపా నుంచి తన సైనిక దళాలను వెనక్కు రప్పించాలని , వాటిని ఆసియా లో మోహరించాలని అమెరికా రెండేళ్ల క్రితమే నిర్ణయించింది . కానీ , ఇప్పుడు ఇండియా సరిహద్దుల్లో చైనా ఆగడాలు మితిమీరడం తో వెంటనే దళాలను వెనక్కి రప్పిస్తోంది.

 ఐరోపా నుంచి వెనక్కు తీసుకొచ్చే దళాలను అమెరికా సౌత్ చైనా సముద్ర ప్రాంతంలో మోహరించే అవకాశాలున్నాయి. మన సరిహద్దులో చైనా దూకుడు మితిమీరితే , ఆ వైపు నుంచి చైనా ను కట్టడి చేయాలన్నది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది . సౌత్ చైనా సముద్ర ప్రాంతం లో ఇప్పటికే చైనా తో విసిగిపోయిన దేశాలకు అమెరికా నిర్ణయం ఒక పెద్ద ఊరట కావచ్చు . చైనా సైన్యాన్ని ధిక్కరించే స్థాయి లేక ఈ దేశాలు ఇన్నాళ్లూ మిన్నకుండి పోయాయి . ఇప్పుడు అమెరికా నేరుగా రంగం లోకి దిగుతోంది . అటు జపాన్ , దక్షిణ కొరియా కూడా దీన్ని ఆహ్వానిస్తాయి . 

నాటో దేశాలతో ఒప్పందం లో భాగంగా 3,20,000 మంది అమెరికా సైనికులు ఐరోపా దేశాల్లో ఉన్నారు . మొత్తం నాటో దళాల్లో ఇది పది శాతం . ఒక్క జర్మనీ లోనే 34,500  మంది అమెరికా సైనికులున్నారు. ఇప్పుడు జర్మనీ నుంచి పది వేల మంది సైనికులను అమెరికా వెనక్కు రప్పిస్తోంది . ఇందుకు నాటో దేశాలు అభ్యంతరం చెప్పాయి. కానీ, ఆసియాలో ఏర్పడ్డ భద్రతా కారణాల రీత్యా దళాలను తగ్గించవలసి వస్తోందని అమెరికా నాటో దేశాలకు నచ్చచెబుతోంది. 

చాలాకాలంగా సౌత్ చైనా సముద్రంలో చైనా ఆగడాలు మితిమీరుతున్నాయని ఆ ప్రాంత దేశాలు ఆరోపిస్తున్నాయి . ముఖ్యంగా వియత్నాం , ఇండోనేషియా , మలేసియా , ఫిలిప్పీన్స్ ఈ విషయం పై అమెరికాకు ఫిర్యాదు చేశాయి. వియత్నాం ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు కూడా వేసింది. తీర్పు వియత్నాంకు అనుకూలంగానే వచ్చింది . కానీ, చైనా అడ్డం తిరిగింది. అంతర్జాతీయ న్యాయ స్థానం తీర్పును తోసిపుచ్చింది.

ఆనాటి నుంచి సౌత్ చైనా సముద్రంలో చైనా ఆక్రమణలు బాగా పెరిగాయి. ఒక పక్క ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతుంటే సౌత్ చైనా సముద్రం లో వియత్నాం, ఇండోనేషియా ఫిషింగ్ ట్రాలర్లను చైనా కోస్ట్ గార్డ్ దళాలు దాడి చేసి ముంచేశాయి. ఇప్పుడు ఇండియా సరిహద్దుల్లోకి చైనా దళాలు చొచ్చుకు రావడంతో ఆసియాలో పరిస్థితులు విషమించాయి. ఇదే ఇప్పుడు అమెరికాకు పెద్ద సవాలుగా మారింది. ఆసియాపై పట్టు సంపాదించిన చైనా రేపు మరో చోట తన ఆధిపత్యానికి సవాలుగా మారదన్న గ్యారంటీ లేదు. ఆ విషయం అమెరికాకు బాగా తెలుసు . అందుకే ఆసియాలోనే చైనాను నిలువరించాలన్నది అమెరికా వ్యూహం . అందుకు అన్ని వనరులూ సిద్ధం చేశామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో స్పష్టం చేశారు. ఐరోపా నుంచి అమెరికా తన సైనిక దళాలను వెనక్కు రప్పించడానికి ఇదే కారణం.