Election Commission of India: ఎన్నికల్లో జప్తు చేసే కోట్ల రూపాయలను ఏం చేస్తారు?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నల్లధనం వినియోగం పెరగడం, కోట్లాది రూపాయల నగదు వివిధ ప్రాంతాలకు తరలిపోవడం, ఎన్నికల్లో రకరకాలుగా వినియోగాలకు పోవడం షరా మామూలే. ఎన్నికల నియమావళి ప్రకారం.. ఇలాంటి డబ్బును కట్టడీ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు

Election Commission of India: ఎన్నికల్లో జప్తు చేసే కోట్ల రూపాయలను ఏం చేస్తారు?

Updated On : October 26, 2023 / 9:24 PM IST

Election Commission of India: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సహా దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలు కూడా ముమ్మరం చేసి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నేతలు వీధుల్లోకి రావడం ప్రారంభించారు. ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లో కూడా వందల కోట్ల రూపాయల నగదు బయటపడుతోంది. అయితే ప్రతి ఎన్నికలలో రికవరీ అయ్యే వందల కోట్ల విలువైన ఈ నగదు ఏమవుతుంది? అనే ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. వాస్తవానికి ఈ డబ్బును ఏం చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు కూడా.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నల్లధనం వినియోగం పెరగడం, కోట్లాది రూపాయల నగదు వివిధ ప్రాంతాలకు తరలిపోవడం, ఎన్నికల్లో రకరకాలుగా వినియోగాలకు పోవడం షరా మామూలే. ఎన్నికల నియమావళి ప్రకారం.. ఇలాంటి డబ్బును కట్టడీ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఇది కాకుండా పోలీసులకు ఇన్ఫార్మర్లు కూడా ఉంటారు. వారి సహాయంతో ఈ నగదును స్వాధీనం చేసుకుంటారు.

ఇప్పుడు ఈ కోట్లాది రూపాయలు ఎక్కడికి పోతాయన్న ప్రశ్నకు వస్తే… ఎన్నికల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తారు. అయితే, దీని తర్వాత నగదు రికవరీ అయిన వ్యక్తి దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి డబ్బు తనదే అని నిరూపించడంలో విజయం సాధించి, దాని పూర్తి సమాచారాన్ని సాక్ష్యంగా చూపితే, అతనికి డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. అయితే ఎవరూ డబ్బును క్లెయిమ్ చేయకపోతే అది ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తుంది.

క్లెయిమ్ చేయడానికి, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఏటీఎం లావాదేవీ, బ్యాంక్ రసీదు లేదా పాస్‌బుక్ ఎంట్రీని వివరాలు తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలి. ఎన్నికల సమయంలో నగదుతో పాటు మద్యం కూడా పెద్దఎత్తున పట్టుబడుతూ ఉంటుంది. ఈ మద్యాన్ని ఒక చోట సేకరించి కొంత సమయం తర్వాత మరొక చోట ధ్వంసం చేస్తారు.